Abn logo
Nov 23 2020 @ 02:42AM

పోలీసులకు చిక్కిన మావోయిస్టు పార్టీ సభ్యుడు

అశ్వారావుపేట, నవంబరు 22: రిక్రూట్‌మెంట్‌ కోసం వచ్చిన మావోయిస్టు పార్టీ సభ్యుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి నుంచి ఒక బ్యానర్‌, విప్లవ సాహిత్యం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఉపేంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేట మండలం నల్లబాడు గ్రామానికి చెందిన గడ్డం వెంకన్నబాబు అలియాస్‌ అరుణ్‌(22) భద్రాచలంలో 2015లో ఇంటర్మీడియట్‌, 2018లో ఐటీఐ చదివాడు.


సీపీఐ మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యుడు రాందాస్‌ ద్వారా పార్టీ సమావేశంలో పాల్గొని ప్రసంగాలకు ఆకర్షితుడయ్యాడు. ఈ ఏడాది సెప్టెంబరు 4న చర్ల లోకల్‌ గెరిల్లా స్క్వాడ్‌ మధు దళంలో చేరాడు. దళంలో చేరిన రెండు రోజులకే పెద్దమిడిసిలేరు తాలిపేరు ప్రాజెక్టుకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డుపై మందుపాతర పేల్చిన ఘటనలో అగ్రనాయకులతో కలిసి ప్రత్యక్షంగా పాల్గొన్నాడు.


సెప్టెంబరు 19న పోలీసులే లక్ష్యంగా చర్ల-భద్రాచలం రోడ్డులో తెడగ కలివేరు గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రోడ్డులో మూడు మందుపాతరలు అమర్చిన వారిలో ఉన్నాడు. అలాగే ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం తమ్మిరెల్లి అటవీ ప్రాంతంలో పోలీసులపై జరిపిన కాల్పుల్లో పాల్గొన్నాడు. సీపీఐ మావోయిస్ట్‌ పార్టీ మిలీషియా సభ్యులు రాందాస్‌, జయరాం, బాలు, ఆదేశాల మేరకు రెండు రోజుల క్రితం అశ్వారావుపేట ప్రాంతంలో యువతను రిక్రూట్‌ చేసుకునేందుకు వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా చేతిసంచితో ఊట్లపల్లి వస్తున్న వెంకన్నబాబు.. పారిపోయేందుకు ప్రయత్నించి, పట్టుబడ్డాడు.


Advertisement
Advertisement