అద్వితీయం

ABN , First Publish Date - 2021-08-02T10:00:28+05:30 IST

ఒలింపిక్‌ స్వర్ణం సాధించాలన్న ఆశ నిలువునా కూలి.. హృదయం బద్దలైనా.. మరుసటి రోజే ఆ మనోవేదన నుంచి పీవీ సింధు ఫీనిక్స్‌ పక్షిలా పైకి లేచింది. ప్రత్యర్థి తనకన్నా మెరుగైన స్థితిలో ఉంటేనేం..

అద్వితీయం

  • కాంస్య పోరులో జియావోపై సింధు విజయం
  • కెరీర్‌లో రెండో ఒలింపిక్‌ పతకం  
  • సెమీ‌స్‌కు పురుషుల హాకీ జట్టు 
  • పోరాడి ఓడిన సతీశ్‌ 

ఒలింపిక్‌ స్వర్ణం సాధించాలన్న ఆశ నిలువునా కూలి.. హృదయం బద్దలైనా.. మరుసటి రోజే ఆ మనోవేదన నుంచి పీవీ సింధు ఫీనిక్స్‌ పక్షిలా పైకి లేచింది.  ప్రత్యర్థి తనకన్నా మెరుగైన స్థితిలో ఉంటేనేం.. ఈసారి తెలుగు తేజం చెలరేగింది. సెమీ్‌సలో ఓడినా కాంస్యమైనా అందిస్తుందనే దేశ ప్రజల అంచనాలను వమ్ము చేయలేదు. తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ.. మూడో స్థానం పోరులో తన అస్త్రశస్ర్తాలను సరిచేసుకుంటూ.. హి బింగ్‌ జియావోపై విరుచుకుపడింది. కళ్లు చెదిరే స్మాష్‌, క్రాస్‌ కోర్టు, డ్రాప్‌ షాట్లతో ఉక్కిరిబిక్కిరి చేసింది. చివర్లోనూ ఓ సూపర్‌ స్మాష్‌తో మ్యాచ్‌ను ముగిస్తూ తనపై ఉన్న భారాన్ని విజయవంతంగా అధిగమించింది. అటు సగర్వంగా కాంస్య పతకాన్ని మెడలో వేసుకుంది. అంతేనా.. దేశం తరఫున రెండు వ్యక్తిగత ఒలింపిక్‌ పతకాలు అందుకున్న ఏకైక మహిళా అథ్లెట్‌గా కీర్తిని సాధించిన సింధుకు ఇప్పుడు దేశమంతా హ్యాట్సాఫ్‌ చెబుతోంది..


టోక్యో: తాజా ఒలింపిక్స్‌లో ఇప్పటిదాకా ఒక్క రజతంతోనే సరిపెట్టుకుంటున్న భారత్‌ ఖాతాలో మరో పతకం జత చేరింది. మూడో స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు విజేతగా నిలిచి కాంస్యం అందుకుంది. కెరీర్‌లో తనకిది రెండో ఒలింపిక్‌ పతకం కావడం విశేషం. 2016 రియో గేమ్స్‌లో రజతంతో మురిపించింది. ఇక భారత మహిళా అథ్లెట్లలో సింధు మాత్రమే రెండు వ్యక్తిగత పతకాలను దక్కించుకుంది. ఓవరాల్‌గా సుశీల్‌ కుమార్‌ (2008లో కాంస్యం, 2012లో రజతం) సరసన నిలిచింది. ఆదివారం చైనా క్రీడాకారిణి హి బింగ్‌ జియావోతో జరిగిన ఈ ప్లేఆ్‌ఫలో 21-13, 21-15 తేడాతో సింధు వరుస సెట్లలో గెలిచింది. 


ఏకపక్షంగా..

కాంస్య పోరులో సింధు వ్యూహాత్మకంగా బరిలోకి దిగింది. గతంలో బింగ్‌ జియావోతో జరిగిన మ్యాచ్‌లన్నీ హోరాహోరీగానే సాగాయి. కానీ తై జు యింగ్‌తో సెమీ్‌సలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ.. ఈసారి బింగ్‌ను కోలుకోనీయలేదు. తొలి గేమ్‌లో చక్కటి విన్నర్స్‌తో 4-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే సింధు అనవసర తప్పిదంవల్ల జియావోకు తొలి పాయింట్‌ అందగా, మరో నెట్‌ పాయింట్‌తో తన స్కోరు 2-4కు చేరింది. అలాగే బింగ్‌ ఈ దశలో ర్యాలీలతో పాటు క్రాస్‌ కోర్టు షాట్లతో స్కోరును 5-5తో సమం చేసింది. సింధును నెట్‌ దగ్గరే ఆడించాలని చూసింది. కానీ ఆ వ్యూహాన్ని అడ్డుకుంటూ సింధు 8-6తో ముందుకు వెళ్లగలిగింది. మరో సుదీర్ఘ ర్యాలీతోపాటు పవర్‌ఫుల్‌ స్మాష్‌తో  బ్రేక్‌ సమయానికి 11-8తో లీడ్‌ సాధించింది. అయితే సెమీ్‌సలోనూ ఇలాగే తైజుపై ముందు ఆధిక్యం సాధించినా ఆ తర్వాత వెనుకంజ వేసింది. కానీ ఈసారి మాత్రం ఆ పొరపాట్లను పునరావృతం చేయలేదు. వరుస పాయింట్లు సాధిస్తూ 14-8తో దూసుకెళ్లింది. అలాగే అటాకింగ్‌తో పాటు సింధు చక్కటి డిఫెన్స్‌ ప్రదర్శిస్తూ ఈ గేమ్‌ను 21-13తో ముగించింది. 


అదే జోరు..

కీలక రెండో గేమ్‌లోనూ సింధు ఏమాత్రం తగ్గలేదు. రెండు లైన్‌ పాయింట్లతో పాటు క్రాస్‌ కోర్టు స్మాష్‌తో మరోసారి ఆరంభంలోనే 4-1తో బింగ్‌ను వెనక్కినెట్టింది. అయితే పట్టు వీడని ప్రత్యర్థి పుంజుకుంటూ 4-5తో సింధు ఆధిక్యాన్ని తగ్గించింది. కానీ మరో ర్యాలీని సూపర్‌ స్మాష్‌తో ముగిస్తూ సింధు 6-4కు వెళ్లింది. అదే రీతిన తిరుగులేని స్మాష్‌లతో ర్యాలీలను ముగిస్తూ 11-8తో బ్రేక్‌కు వెళ్లింది. అటు బింగ్‌ అనవసర తప్పిదాలు కూడా సింధుకు కలిసివచ్చాయి. బ్రేక్‌ తర్వాత మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. కోర్టులో వేగంగా కదిలిన బింగ్‌ వరుసగా మూడు పాయింట్లతో స్కోరును 11-11తో సమం చేస్తూ సవాల్‌ విసిరింది. కానీ ఒత్తిడిని తట్టుకుంటూ తెలుగు తేజం రెండు కళ్లుచెదిరే డ్రాప్‌ షాట్లతో 14-11తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. అటు బింగ్‌ మరో అనవసర తప్పిదంతో సింధు  15-11కి చేరుకుంది. పట్టు వీడని బింగ్‌ వరుసగా రెండు పాయింట్లతో 13-15తో దూసుకొచ్చింది. ఈ దశలో పాయింట్‌ కోసం మరోసారి సుదీర్ఘ ర్యాలీ జరిగింది. కానీ సింధు ఎప్పటిలాగే క్రాస్‌ కోర్టు స్మాష్‌తో దెబ్బతీసి 16-13తో నిలిచింది. ఇక ఇక్కడి నుంచి సింధు చకచకా పాయింట్లు సాధిస్తూ బింగ్‌ను అల్లంత దూరాన ఉంచింది. చివరకు తన ట్రేడ్‌మార్క్‌ సూపర్‌ స్మాష్‌తోనే మ్యాచ్‌ను ముగిస్తూ చేతులు, తల పైకెత్తి గట్టిగా ఊపిరిపీల్చుకుంది.


బ్యాడ్మింటన్‌  స్వర్ణం చైనాకే..

చైనాకు చెందిన చెన్‌ యు ఫీ మహిళల సింగిల్స్‌లో స్వర్ణం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో వరల్డ్‌ నెంబర్‌వన్‌ తైజు యింగ్‌ (చైనీస్‌ తైపీ)పై 21-18, 19-21, 21-18 తేడాతో నెగ్గింది.  




41 ఏళ్ల తర్వాత సెమీస్‌కు..

పురుషుల హాకీ జట్టు అద్భుత ఆటతీరు కొనసాగుతూనే ఉంది. గత వైభవాన్ని చాటుకునే క్రమంలో సమష్టి ఆటతీరుతో 41ఏళ్ల తర్వాత సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గ్రేట్‌ బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్‌ ్సలో 3-1 తేడాతో మన్‌ప్రీత్‌ సేన గెలిచింది. దిలీప్‌ సింగ్‌ (7వ నిమిషంలో), గుర్జంత్‌ సింగ్‌ (16), హార్దిక్‌ సింగ్‌ (57) గోల్స్‌ సాధించారు. భారత జట్టు 1980 మాస్కో గేమ్స్‌లో స్వర్ణం సాధించింది. అయితే అప్పట్లో ఆరు జట్లు మాత్రమే పాల్గొనగా సెమీఫైనల్స్‌ జరుగలేదు. అంతకుముందు 1972 మ్యూనిచ్‌ గేమ్స్‌లో సెమీఫైనల్లో ఆడి పాక్‌ చేతిలో ఓడింది.  ఇక తాజా సెమీ్‌సలో మంగళవారం భారత హాకీ జట్టు ప్రపంచ నెంబర్‌వన్‌ బెల్జియంను ఢీకొంటుంది. మిగతా క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో బెల్జియం 3-1తో స్పెయిన్‌పై, ఆసీస్‌ పెనాల్టీ షూటౌట్స్‌లో 3-0తో నెదర్లాండ్స్‌పై, జర్మనీ 3-1తో అర్జెంటీనాపై గెలిచి సెమీ‌స్‌లో ప్రవేశించాయి.




నుదుటికి కుట్లతోనే సతీశ్‌ పోరాటం

పురుషుల బాక్సింగ్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. 91+కేజీ విభాగం సూపర్‌ హెవీవెయిట్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సతీశ్‌ కుమార్‌ 0-5తో వరల్డ్‌ చాంపియన్‌ జలోలోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో ఓడాడు. కానీ ఈ బౌట్‌లో అతడు ఏ పరిస్థితుల్లో బరిలోకి దిగాడో తెలిస్తే ఔరా అనిపించకమానదు. గురువారం రికార్డో బ్రౌన్‌ (జమైకా)తో జరిగిన ప్రీక్వార్టర్స్‌లో సతీశ్‌ నుదుటి భాగం, గడ్డంపై తగిలిన దెబ్బలకు 13 కుట్లు వేశారు. అవి నయం కాకుండానే సతీశ్‌ క్వార్టర్స్‌ ఆడేందుకు సాహసించాడు. ఈ బౌట్‌లో ప్రత్యర్థి పంచ్‌లకు కుట్లు తెరుచుకుని రక్తమోడుతున్నా తుది వరకు పోరాడాడు. అందుకే విజేత జలోలోవ్‌ సైతం సతీశ్‌ ధైర్యాన్ని ప్రశంసించాడు.


గోల్ఫ్‌:  పురుషుల గోల్ఫ్‌లో భారత్‌ కథ ముగిసింది. ఫైనల్‌ రౌండ్‌లో అనిర్బన్‌ లాహిరి  42వ స్థానం, ఉదయన్‌ మానె 56వ స్థానంలో నిలిచారు. 


ఈక్వెస్ట్రియన్‌:  వ్యక్తిగత విభాగం క్రాస్‌ కంట్రీ ఈవెంట్‌లో ఫౌవాద్‌ మీర్జా మెరుగ్గా రాణిస్తూ 22వ స్థానంలో నిలిచాడు. 7.45 నిమిషాల్లో ఈ ఈవెంట్‌ను పూర్తి చేయాల్సి ఉండగా మీర్జా 8 నిమిషాల్లో ముగించాడు. నేడు జరిగే షో జంపింగ్‌లోనూ అతను టాప్‌-25లో ఉంటే ఆ తర్వాత జంపింగ్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాడు.

Updated Date - 2021-08-02T10:00:28+05:30 IST