Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్షుద్రపూజల కలకలం!

దోమ: మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అంటే రాలుతాయనే అంటున్నారు ఈ అమాయక పల్లెజనం. సాంకేతికంగా ఎంతో ముందుకు దూసుకుపోతున్న ఈ రోజుల్లో ఇంకా గ్రామాల్లో బాణామతి, చేతబడులను నమ్ముతున్నారు. ఇలాంటి కోవలోకి వచ్చే ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా వికారాబాద్‌ జిల్లా దోమ మండలం ఖమ్మంనాచారం గ్రామ శివారులో క్షుద్ర పూజలు చేయడం జనాలను ఆందోళనకు గురి చేశాయి. ఖమ్మంనాచారం గ్రామ శివారులోని ఓ ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. ఆ ప్రదేశంలో వారు ముగ్గు వేసి, నిమ్మకాయలు, గుమ్మడి కాయలు, పసుపు, కుంకుమ వేశారు. మరోపక్క మేక తలకాయ, కందులు, శనగలు చుట్టూరా పెట్టారు. కాగా, అక్కడ బట్టలను కూడా కాల్చారు. కల్లుతో కూడిన ఓ కుండ అక్కడ ఉంది. కాగా, వీటన్నింటిని ఉపయోగించి క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.  అయితే, ఈ ప్రదేశాన్ని ఖమ్మంనాచారం గ్రామానికి చెందిన ఓ రైతు గురువారం ఉదయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్షుద్ర పూజలు చేతబడి, బాణామతి కోసమా? లేదా గుప్త నిధుల కోసమా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, కొందరు గ్రామస్తులు కలిసి ఈ క్షుద్రపూజలు చేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తామంటే పడరానివారికి చేతబడి చేయాలనే కొందరు ఈ క్షుద్ర పూజలు చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement