Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిరాడంబర నాయకుడు

(హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి)

తొలిసారి ఎమ్మెల్యే అయిన వారు సైతం హంగూ ఆర్భాటాలు, మందీ మార్బలం, పోలీసు సెక్యూరిటీతో హడావుడి చేస్తున్న రోజులు ఇవి! కానీ... ఎన్జీరంగా శిష్యుడిగా రోశయ్య ఎప్పుడూ సాధారణ జీవితాన్నే గడిపారు. ఆర్భాటాలకు దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి, గవర్నర్‌ హోదాలో తప్పనిసరి భద్రత మధ్య ఉన్నారు తప్ప... మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఏ సెక్యూరిటీ అవసరం రాలేదు. సీఎంగా ఉన్నప్పుడు, గవర్నర్‌గా కొనసాగినప్పుడూ హైదరాబాద్‌లో ప్రభుత్వ బంగళాలో అత్యంత సౌకర్యంగా ఉండే అవకాశం ఉన్నా వాటిని వాడుకోలేదు. సీఎంగా ఉండి కూడా అమీర్‌పేట దరమ్‌కరమ్‌ రోడ్డులోని తన ఇంట్లోనే రాత్రి బస చేసి.. ఉదయం అల్పాహారం ముగించుకుని 11 గంటలకు ప్రజాదర్బారు కోసం మాత్రమే సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చేవారు. ఢిల్లీలో బంగళాలను ఖాళీ చేయకుండా వేలాడే మాజీ ఎంపీలు ఎందరో ఉన్నారు. రోశయ్య అలాకాదు! 1999లో లోక్‌సభ రద్దయిన సాయంత్రమే ఢిల్లీలో తనకు కేటాయించిన ప్రభుత్వ క్వార్టర్‌ను ఖాళీ చేసేశారు.


పీసీసీ అధ్యక్షుడు.. ఆ వెంటే అధికార ప్రతినిధి! 

ఒక రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవి తర్వాత... సీఎల్పీ నాయకుడిగానో, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానో వెళ్లాలని భావిస్తారు. పీసీసీ హోదాకంటే తక్కువ పదవి ఇస్తే స్వీకరించడానికి నిరాకరిస్తారు.  రోశయ్య మాత్రం దీనికి మినహాయింపు. ఉమ్మడి ఏపీలో 1994 నుంచి 1996 వరకూ రోశయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఎం.సత్యనారాయణరావుకు ఆ పదవి దక్కింది. రోశయ్యను అధిష్ఠానం పీసీసీ అధికార ప్రతినిధిగా నియమించింది. పోస్టు చిన్నదైనప్పటికీ ఆ బాధ్యతలనూ ఆయన కాదనకుండా సమర్థంగా నిర్వహించారు.

Advertisement
Advertisement