Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరకట్న వేధింపులు..చావులోనూ బిడ్డను వదలని తల్లి

మహబూబ్ నగర్/మిడ్జిల్‌: తొమ్మిది నెలల పసిబిడ్డతో తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండల కేంద్రంలో గురువారం వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన సరిత(21)తో రెండు సంవత్సరాల క్రితం మిడ్జిల్‌ గ్రామానికి చెందిన శ్రీశైలంకు వివాహమైంది. వివాహం జరిగిన కొద్దిరోజుల్లోనే సరిత అత్త ఎత్తరి రాములమ్మ, మామ మల్లయ్యతో పాటు భర్త శ్రీశైలం వరకట్న కోసం వేధిస్తున్నారని, దూషిస్తూ హింసించేవారని పోలీసులు, గ్రామస్థులు తెలిపారు. ఇదే విషయంపై పలుమార్లు పోలీసులు భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు తెలిపారు. కాగా సరిత అత్తింటి వారితో గొడవపడి పుట్టినింటికి వెళ్లగా తల్లిదండ్రులతో పాటు ఇరు గ్రామాలకు చెందిన కుల పెద్దలు నచ్చచెప్పి భర్త ఇంటి వద్ద వదిలి వెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి తన 9 నెలల బిడ్డతో సరిత వెళ్లిపోయినట్లు భర్త శ్రీశైలం మిడ్జిల్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు.


గురువారం ఉదయం మిడ్జిల్‌ గ్రామ శివారులోని నళ్ల చెరువులో మృతదేహం కనిపించడంతో ఆ చుట్టుపక్కల రైతులు, గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చెరువులో ఉన్న మహిళ మృతదేహం సరితదేనని గుర్తించారు. సరిత తన 9నెలల బిడ్డను ఎదపై చీరతో కట్టుకొని ఉన్న దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. సరిత మృతదేహాన్ని బయటకు తీస్తున్న సమయంలో బంధువులతో పాటు గ్రామస్థుల రోదనలు మిన్నంటాయి. మృతురాలి తండ్రి సంగయ్య ఫిర్యాదు మేరకు  కేసును నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ అస్పత్రికి తరలించినట్లు   మిడ్జిల్‌ ఎస్సై జయప్రసాద్‌ తెలపారు.

Advertisement
Advertisement