తిరోగమన బాటలో కొత్త విద్యావిధానం

ABN , First Publish Date - 2020-09-15T06:06:52+05:30 IST

కేంద్రప్రభుత్వం జాతీయ విద్యావిధానం 2020 ప్రకటించిన తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాలలో మాతృభాషా మాధ్యమానికి మహర్దశ పట్టిందనే భావం ప్రచారంలో ఉంది. ప్రధానమంత్రి...

తిరోగమన బాటలో కొత్త విద్యావిధానం

జాతీయ విద్యావిధానం 2020లో అకడమిక్‌ కోర్సులైన సామాజిక, ప్రకృతి, గణిత శాస్త్రాల వంటివి కూడా ఐచ్ఛిక పాఠ్య విషయాలుగా కుదించబడ్డాయి. అంటే ఎవరైనా ప్రకృతి, సామాజిక, గణిత శాస్త్రాలలో ఒకదానిని విడిచిపెట్టి ఆంగ్లానికి అదనంగా మరొక విదేశీ భాషను ఎన్నుకునే వీలు కల్పించబడింది. ఈ విధానం అమలు జరిగితే, అధిక ఫీజులు వసూలుచేసే ఐదు నక్షత్రాల ప్రైవేటు పాఠశాలలలో చదివే విద్యార్థులు సామాజిక శాస్త్రాలు నేర్చుకోకుండానే పై స్థాయిలకు వెళ్ళిపోతారు. అట్టి వారు నైపుణ్యం కలిగిన కార్పోరేటు మేనేజర్లు కాగలరు గాని సామాజిక స్పృహ కలిగిన పౌరులు మాత్రం కాలేరు. 


కేంద్రప్రభుత్వం జాతీయ విద్యావిధానం 2020 ప్రకటించిన తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాలలో  మాతృభాషా మాధ్యమానికి మహర్దశ పట్టిందనే భావం ప్రచారంలో ఉంది. ప్రధానమంత్రి కూడా మాతృభాషా మాధ్యమ ప్రాధాన్యత గురించి మాట్లాడేసరికి ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ నూతన విద్యావిధానంలో మాతృభాషా మాధ్యమానికి సంబంధించిన నిర్దేశాలు ఏం ఉన్నాయి అనే విషయం పరిశీలించాలంటే, ముందుగా ఈ విద్యావిధానాన్ని ఇప్పుడు అమలులో ఉన్న ‘విద్యాహక్కు చట్టం’తో, అలాగే 1986 నాటి ‘జాతీయ విద్యావిధానం’తో పోల్చిచూడాలి.


2010 ఏప్రిల్‌ 1నుంచి ‘బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009’ అనే కేంద్ర చట్టం అమలులో ఉన్న విషయం తెలిసిందే. 6 నుంచి 14 ఏళ్ల వయసులో ఉన్న బాలల రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కు ‘21’ఎ ని వాస్తవీకరించడానికి ఈ చట్టం చేశారు. కానీ ఈ చట్టం విద్యావ్యాపారాన్ని నిషేధించలేకపోయింది. ఉమ్మడి బడి విధానానికి మార్గం వేయలేకపోయింది. ఇంకా పాఠశాలల వనరుల వసతుల విషయంలో సరైన నిబంధనలు లేనందున విమర్శలకు గురవుతున్నది. అయితే, పాఠ్య ప్రణాళిక విషయంలో విద్యాహక్కు చట్టం పెద్దగా విమర్శలను ఎదుర్కోలేదు. ఈ చట్టం విభాగం 29(2)(యఫ్‌)లో వీలయినంతవరకు, మాతృభాషా మాధ్యమంలోనే విద్య అందించాలని నిర్దేశిస్తుంది. ఈ నిబంధన ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నింటికి 1 నుంచి 8వ తరగతి వరకు వర్తిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలు, చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా, ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలు ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. 


ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానంలో మాతృ భాషా మాధ్యమం విషయంలో ప్రభుత్వంపై వచ్చిన కేసు సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టంలో ‘వీలయి నంతవరకు’ అని ఉందని, ఆ వెసులుబాటును తాము ఉపయోగించుకుంటున్నామని చెప్పింది. ప్రభుత్వ వివరణను హైకోర్టు తోసిపుచ్చింది. ‘వీలయినంతవరకు’ అన్నది  వెసులుబాటు మాత్రమేనని, దాన్ని చాలా ప్రత్యేక సందర్భాలలో- అంటే  మాతృభాషలో విద్య అందించలేని సందర్భాలలోనే ఉపయోగించుకోవాలని వివరించింది. ఇప్పుడు జాతీయ విద్యావిధానం 2020ని పరిశీలిద్దాం. ఈ విధానం 4.11 విభాగంలో- ‘‘వీలయిన చోట (వీలయిన ప్రతిచోట అని, ఇంకా వీలయిన ప్రతి సందర్భంలో అని కూడా అర్థం చెప్పవచ్చు) కనీసం 5వ తరగతి వరకు–8వ తరగతి ఆపై స్థాయిలో కూడా వీలైతే మంచిదే–ఇంటి భాష లేదా మాతృభాష లేదా స్థానిక భాష లేదా ప్రాంతీయ భాష బోధనా మాధ్యమంగా ఉంటుంది’’ అని పేర్కొంది. దీన్ని బట్టి– ఈ విధానం- 5వ తరగతి వరకు వారి వారి భాషలలోనే బాలలకు విద్య అందించాలనీ, 8వ తరగతి వరకు ఆపై స్థాయి లోనూ విద్యార్థులకు వారి వారి భాషలలో విద్య అందించగలిగితే మంచిదేననీ చెబుతోంది. కానీ విద్యా హక్కు చట్టం మాత్రం 8వ తరగతి వరకు బాలలకు మాతృభాషలోనే విద్య అందించాలని స్పష్టంగా పేర్కొంది. విద్యాహక్కు చట్టంలో ఉన్న ‘వీలయినంతవరకు’, ఈ విధానంలో ఉన్న ‘వీలయిన చోట’ అన్న పదబంధాలను మినహాయించి చూస్తే- విద్యా హక్కు చట్టం 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాన్ని నిర్దేశించగా, ఈ కొత్త విధానం 5వ తరగతి వరకు మాత్రమే మాతృభాషా మాధ్యమాన్ని నిర్దేశిస్తున్నదని అర్థమవుతోంది.   


మరొక విషయం ఏమంటే జాతీయ విద్యా విధానం 2020 దానికదే అమలు జరగదు. దానిని అమలు చేయడానికి పార్లమెంటులో అంశాల వారీగా చట్టాలు చేయవలసి ఉంటుంది. పాఠశాల విద్యలో ఇప్పటికే ఒక కేంద్ర చట్టం (విద్యాహక్కు చట్టం 2009) ఉంది కాబట్టి దానిని మారుస్తూ చట్టం చేయవలసి ఉంటుంది. అప్పుడు విషయాలు మరింత స్పష్టమవుతాయి. 1 నుంచి 8వ తరగతి వరకు వర్తించే విద్యా హక్కును ఇటు పూర్వ ప్రాథమిక విద్యకు అటు సెకండరీ విద్యకు విస్తరించాలని కస్తూరి రంగన్‌ కమిటీ చేసిన సిఫారసును ఈ విధాన పత్రం పట్టించుకోలేదు. మరి అట్టి హక్కుపై ఆధారపడిన చట్టాన్ని అలాగే ఉంచి పూర్వ ప్రాథమిక విద్యకూ సెకండరీ విద్యకూ కొత్త చట్టాలను తీసుకువస్తారా, లేక ఆ చట్టాన్ని రద్దుచేసి పూర్వ ప్రాథమిక విద్య నుంచి 12వ తరగతి వరకు ఒకే కొత్త చట్టాన్ని తీసుకువస్తారా అన్నది తేలాల్సిన విషయం. ఎలా చేసినా ఈ నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయాలంటే బోధనా మాధ్యమం విషయంలో ప్రస్తుతం ఉన్న విద్యా హక్కు చట్టాన్ని సవరించాలి. ముఖ్యంగా 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమం￿￿ అని ఉన్న ప్రస్తుత నిబంధనని 5వ తరగతి వరకు అని సవరించాలి. అంటే ఉన్న చట్టానికి అభివృద్ధి నిరోధకమైన సవరణ చేయవలసి ఉంటుంది. మాతృ భాషా మాధ్యమం విషయంలో 2010 ఏప్రిల్‌ 1 నుంచి అమలు జరుగుతున్న విద్యాహక్కు చట్టం కంటే ‘జాతీయ విద్యావిధానం 2020’ ఒక అడుగు వెనుకన ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు.


ఈ విధానం ప్రకారం ఏయే భాషలను పాఠ్య విషయాలుగా బోధిస్తారు అనేది మరొక చర్చనీయాంశం. 1968 నాటి జాతీయ విద్యావిధానంలో ప్రకటించబడి, 1986 నాటి జాతీయ విద్యా విధానంలో కొనసాగించబడిన త్రిభాషా విధానం ప్రకారం తెలుగు విద్యార్థులకు తెలుగు, హిందీ, ఆంగ్లం అనే మూడు భాషల పద్ధతి ఉన్న విషయం తెలిసిందే. కొత్త విద్యావిధానంలోనూ ఈ విధానం కొనసాగుతుందని పేర్కొన్నారు. కాని ఇది ఇంతవరకు అమలు అవుతున్న విధానంతో పోలిస్తే పూర్తిగా వేరుగా ఉంది. కస్తూరి రంగన్‌ నివేదికలో హిందీ తప్పనిసరి అని ప్రతిపాదిస్తే హిందీయేతర రాష్ట్రాల నుంచి ప్రధానంగా తమిళనాడు నుంచి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని విధాన పత్రంలో ఆ ప్రతిపాదనను తొలగించారు. అంతమేరకు మంచిదే. అంత కంటే ప్రధానమైన విషయం ఏమంటే ఈ విధానంలో మాతృభాషగాని అలాగే ఆంగ్లం కాని తప్పనిసరి అని పేర్కొనకపోవడం. ఈ విధానం విద్యార్థికి చాలా వెసులుబాటు ఇచ్చింది. ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలు, ఇంకా ప్రధానంగా విద్యార్థులు తమ అభీష్టం ప్రకారం ఏవేని మూడు భాషలను ఎంపిక చేసుకోవచ్చని, అయితే అట్టి ఎంపికలో కనీసం రెండు దేశ (నేటివ్‌) భాషలు ఉండాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా వ్యాపార విధానంలో ఇలాంటి వెసులుబాటులు వివక్షలకు దారితీస్తాయి. ఈ విధానం ప్రకారం విద్యార్థి ఆంగ్లం లేకుండా కూడా మూడు దేశీయ భాషలు నేర్చుకోవచ్చు. అలా దక్షిణాది రాష్ట్రాలలో జరగదు కాని కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో జరగవచ్చు. మరొకవైపు చూస్తే ఈ విధానం ప్రకారం మాతృభాష లేకుండా కూడా మూడు భాషలను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలలో ప్రైవేటు పాఠశాలలలో తెలుగు లేకుండా ఇంగ్లీషుతోపాటు ‘స్కోరింగ్‌ సబ్జక్టులైన’ హిందీ, సంస్కృతం అనే త్రిభాషా విధానం అమలు కావచ్చు.  


అంతేకాక మూడు భాషలకు అదనంగా ఏదేని ఒక భాషను (ఫ్రెంచ్‌, జర్మన్‌, కొరియన్‌, జపనీస్‌ వంటివి) ఒక ఐచ్ఛిక పాఠ్య విషయంగా తీసుకోవచ్చని జాతీయ విద్యావిధానం 2020లో పేర్కొన్నారు. ఈ విధానంలో అకడమిక్‌ కోర్సులైన సామాజిక, ప్రకృతి, గణిత శాస్త్రాల వంటివి కూడా ఐచ్ఛిక పాఠ్య విషయాలుగా కుదించబడ్డాయి. అంటే ఎవరైనా ప్రకృతి, సామాజిక, గణిత శాస్త్రాలలో ఒకదానిని విడిచిపెట్టి ఆంగ్లానికి అదనంగా మరొక విదేశీ భాషను ఎన్నుకునే వీలు కల్పించబడింది. ఈ వీలును ప్రధానంగా ఉపయోగించుకునేది ప్రైవేటు పాఠశాలలు. ఒక స్థాయి ప్రైవేటు పాఠశాలలలో జర్మనీ, జపనీస్‌, కొరియన్‌ వంటి భాషలకు డిమాండు ఉంది. ఆ డిమాండును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్దేశాన్ని రూపొందించి ఉండవచ్చు. ఈ విధానం అమలు జరిగితే, అధిక ఫీజులు వసూలుచేసే ఐదు నక్షత్రాల ప్రైవేటు పాఠ శాలల్లో చదివే విద్యార్థులు సామాజిక శాస్త్రాలు నేర్చుకోకుండానే పై స్థాయిలకు వెళ్ళిపోతారు. అట్టి వారు నైపుణ్యం కలిగిన కార్పొరేటు మేనేజర్లు కాగలరు గాని సామాజిక స్పృహ కలిగిన పౌరులు మాత్రం కాలేరు. ఈ విధానం పర్యవసానంగా తెలుగు రాష్ట్రాలలో, ప్రభుత్వ పాఠశాలలలో ప్రస్తుతం ఉన్న త్రిభాషా విధానం కొనసాగే అవకాశం ఉండగా, ప్రైవేటు పాఠశాలలలో తెలుగును తొలగించి 6వ తరగతి నుంచే సంస్కృతం ప్రారంభం కాగలదు. మాతృభాషను తప్పనిసరి చేయకపోవడం, మరోవైపు సంస్కృతాన్ని పరిధులు దాటి ప్రోత్సహించడం, మాతృభాషా మాధ్యమాన్ని ఐదవ తరగతికి పరిమితం చేయడం ఈ విధానంలో ప్రధానమైన సమస్యలు. ఈ విధానం పేదల ఎడల మాత్రమే కాక భాషల ఎడల కూడా వివక్షగా పరిణమించగలదు.

రమేష్‌ పట్నాయక్‌, అఖిల భారత విద్యాహక్కు వేదిక


Updated Date - 2020-09-15T06:06:52+05:30 IST