Abn logo
Sep 26 2021 @ 00:47AM

విప్లవానికి వినూత్న వ్యాఖ్యాత

గెయిల్ ఆంవెట్ పరిశోధనలు, రాజకీయ కార్యాచరణకు ‘స్నేహశీలత’ (కన్‌వివీయాలిటీ) కేంద్రంగా ఉన్నాయి. కుల వ్యతిరేక తాత్వికతలు, దళిత్ బహుజన్ ఆదివాసీ విప్లవకర ఆలోచనాయుత కార్యాచరణలో ఆ భావన మూలాలు ఉన్నాయి. కుల నిర్మూలన సందేశాన్ని, విప్లవ భావనకు దళిత్ బహుజన్ విప్లవ దార్శనికతే దృష్టాంతమనే సందేశాన్ని మరింత విస్తృతంగా పరివ్యాప్తం చేసే దూతగా గెయిల్ ఆంవెట్ తనను తాను భావించుకున్నారు.


‘విప్లవం’ ఏమిటి? దాని సామాజిక స్వభావాన్ని, దాని చరిత్రలు, నిర్దిష్ట మార్గాలను ఎలా అర్థం చేసుకోగలం? విప్లకారులను, విప్లవ కార్యాచరణను ఎలా గుర్తించగలం? విప్లవ భావాన్ని భావన చేయడంలో కార్యాచరణ, సిద్ధాంతం మధ్య ఉన్న సంబంధమేమిటి? విప్లవకర ఆదర్శ రాజ్యాలకు దారి గుర్తులు ఏమిటి? విప్లవానికి భౌతిక, సామాజిక చారిత్రక, ప్రాదేశిక (గ్రామీణ, పట్టణ, ప్రాంతీయ) సందర్భాలేమిటి? విప్లవాత్మక సంఘీభావాలు ఎలా రూపొందుతాయి? విశాలమైన, మరింత వ్యావృతమైన విప్లవశీల సంఘీభావాలను సృష్టించడంలో పర్యాలోచక సంభాషణ, వివాదాస్పద చర్చ, అభిప్రాయ బేధం స్థానమేమిటి? విప్లవ అంతర్ ప్రపంచాలపై ప్రశ్నలతో గెయిల్ ఆంవెట్ మేధో కృషి చైతన్యవంతమయింది. 1970వ దశకంలో మహిళా పోరాటాలు, స్త్రీవాద కార్యాచరణపై ఆమె తొలి రచనా వ్యాసంగంలోనూ, 21వ శతాబ్ది రెండో దశకంలో కుల వ్యతిరేక తాత్వికతలు, రాజకీయాలు, ఉద్యమాలపై సునిశిత విశ్లేషణల్లోనూ అదే చైతన్యశీలత స్పష్టంగా కనిపిస్తుంది.


ఐదు దశాబ్దాలకు పైగా విభిన్న సందర్భాలలో ప్రభవించిన ఆమె రచనలు, ప్రజాపోరాటాల్లో భాగస్వామిగా లక్ష్య పరిపూర్తి కృషిలో ఆమె నిమగ్నతను మనకు విదితం చేస్తాయి. నిర్దిష్ట చారిత్రక సందర్భాలలో స్త్రీవాదం, భూమి, నీరు కోసం పోరాటాల, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు, హిందూ మెజారిటీవాదం (మెజారిటేరియనిజం) పై విస్తృత చర్చలకు సంబంధించి ఆమె వైఖరులలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంవెట్ తుది సంవత్సరాలలోని రచనలు చదవడం ద్వారా ఆ మార్పులు ఎంత చైతన్యశీలమైనవో మనకు అర్థమవుతాయి. ఇప్పుడు హిందూ ఆధిపత్యవాద పాలనలో ఉన్న మనం, గెయిల్ ఆంవెట్ రచనలను మళ్ళీ అధ్యయనం చేస్తే విప్లవపూరిత ఆలోచనాయుత కార్యాచరణ (రివొల్యూషనరీ ప్రాక్సిస్)పై ఆమె తిరుగుబాటుతత్వ, ఉద్వేగాత్మక కథనాల శక్తి ఆశ్చర్యపరుస్తుంది. సామాజిక, చారిత్రక సందర్భాలలో ఆశయాలు, లక్ష్యాలు, ఆదర్శ పోరాటకారులను అన్వేషిస్తూ సాగిన ఆ కథనాలు నేటి భారతంలో కలవరపెడుతున్న వర్తమానంపై పోరాడేందుకు మనకు తోడ్పడుతాయి. 


కులవ్యవస్థపై దళితుల ప్రతిఘటనా మూలాలు ఉన్న భౌతిక, సామాజిక సందర్భాలు విప్లవకర చింతనాయుత కార్యాచరణ చరిత్ర, సాధ్యతలను అర్థం చేసుకునేందుకు మనకు ప్రధాన ఆధారమవుతాయి. నగరాలలోని స్వతంత్ర స్త్రీవాదంపై ఆమె నిర్మాణాత్మక విమర్శల నుంచి, భారత్‌ను అర్థం చేసుకునేందుకు ఆమె అనుసరించిన మార్క్సిస్టు ఆలోచనా చట్రాలు, ఉపఖండంలో హిందూధర్మం పట్ల వ్యతిరేకతపై ఆమె కథనాలు... ఇవే భారతదేశ చరిత్రను సుబోధకం చేశాయి. దళితులు, బహుజనులు, ఆదివాసీలు, రైతులు, శ్రామికులు (ప్రధానంగా గ్రామీణ) అందునా మహిళలు సమానత్వం, గౌరవం కోసం అవిరామంగా పోరాడారు. భూమి, నీరు కోసం చేసిన పోరాటాల ద్వారా, అస్పృశ్యత నిర్మూలన కోసం, న్యాయబద్ధమైన వేతనాల కోసం, ఆరాధనా మందిరాలలో ప్రవేశాల కోసం, సహజ వనరుల కోసం, ఆధ్యాత్మిక సమున్నతి కోసం దళితులు అన్వేషించారు.


బ్రాహ్మణీయ హిందూధర్మం మధ్యవర్తిత్వం ప్రమేయం లేకుండా; మరీ ముఖ్యంగా విభిన్న చారిత్రక సమయాలలో రాజ్యవ్యవస్థ– పాలకవర్గాలు కుమ్మక్కయిన తీరుతెన్నుల మీద కులవ్యతిరేక దృక్పథంతో నిశిత శోధన చేశారు. విప్లవకర ఆలోచనాయుత కార్యాచరణను, నిజానికి విప్లవాన్ని వివరించేందుకు గెయిల్ ఆంవెట్ పలువురు ఆదర్శ వ్యక్తులను ఉత్కృష్ట ఉదాహరణలుగా నివేదించారు. వారు బుద్ధ, కబీర్, రవిదాస్, తుకోబా, జ్యోతి బా పూలే, అయోతీ థాస్, పెరియార్, రమాబాయి, అంబేడ్కర్. ఇలా చేయడంలో ఆమె భారత ఉపఖండంలోని ‘జ్ఞాన వికాసోద్యమం’ బహు విధ రీతులపై వెలుగులు సారించారు. ఒక తాత్విక జలపాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జ్ఞాన వికాసోద్యమం యూరోపియన్ వికాసోద్యమం కంటే మిన్న అయినది. భారతీయ భావుకతలో ఆమె చూసిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆదర్శాలు– కులదాస్యం నుంచి విముక్తమయిన ఆదర్శాలు, వాటి దార్శనికతలు బౌద్ధం ఆవిర్భావం నుంచి అంబేడ్కర్ నవయాన ప్రభవం దాకా చారిత్రకంగా ముడివడి ఉన్నాయి. సాహిత్యం, ప్రదర్శన, మున్నెన్నడు లేని రీతుల్లో నిరసనలు వ్యక్తం చేసిన తీరుతెన్నులతో అవి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. 


నక్సల్బరీ, దళిత్ పాంథర్స్, రైతు పోరాటాలు, మహిళా ఆందోళనలు, పర్యావరణ పరిరక్షణ ఇత్యాది విలక్షణ ఉద్యమాలను గెయిల్ ఆంవెట్ తన ‘రీ ఇన్వెంటింగ్ రివొల్యూషన్’ (1993)లో నిశితంగా పరిశీలించారు. ఆ ఉద్యమాలు, పోరాటాల మధ్య ఒక నిరంతరత లేదా అనుక్రమాన్ని ఆమె వివరించారు. ఆ ఉద్యమాలలో అంతర్గత క్రియాశీలిగా వాటిని లోపలి నుంచి పరిశీలిస్తూ ప్రతిఘటన సిద్ధాంతం, ఆచరణ మధ్య సైద్ధాంతిక విభజనను తొలగించేందుకు ఆమె నూతన మేధో అన్వేషణకు పూనుకున్నారు. ఇందులో భాగంగా మార్క్సిజం, ఉత్పత్తి విధానాలు, మహిళా విముక్తి, ‘పీజెంట్, వ్యవసాయ కూలీ, రైతు మధ్య ఉన్న వ్యత్యాసం మొదలైన అంశాలపై చర్చల్లోకి ఆమె ప్రవేశించారు. 


మహిళలే అత్యంత సమరశీలురు అని వివిధ వామపక్షాలకు చెందిన పురుష నేతలు నిర్ధారించారని ఆంవెట్ తెలిపారు. భర్త భారత్ పటాంకర్‌తో కలిసి ఆమె స్థాపించిన శ్రామిక ముక్తిదళ్ మహిళల విషయంలో అనుసరించిన దృక్పథం మరే వామపక్షం దృక్పథం కంటే ప్రగతిశీలమైనది. మహిళల అణచివేతకు ఆస్కారం లేని కులరహిత, వర్గరహిత సమాజాన్ని నెలకొల్పనంతవరకు స్త్రీలు దోపిడీకి గురవుతూనే ఉంటారని ఆమె అన్నారు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని మానవాళి సంపూర్ణ విమోచనకై కుల దోపిడీ, వర్గ దోపిడీ, మహిళా అణచివేత లేని సమాజసాధన లక్ష్యాన్ని శ్రామిక ముక్తిదళ్‌ ఔదలదాల్చింది. సమకాలీన భారతదేశంలో మహిళా ఉద్యమాలు ముమ్మరమవుతున్నాయి. స్త్రీవాదం ప్రభావమూ పెరుగుతోంది. అయినప్పటికీ భారతీయ సమాజంలో విప్లవ శక్తి దళిత్, బహుజన్, ఆదివాసీ మహిళలే అని ఆంవెట్ స్పష్టం చేశారు. 


తాను వివిధ స్థాయిలలో అంగీకరించిన, విభేదించిన, సహకరించిన మేధో సహచరులు, సహప్రయాణికుల గురించి ఆంవెట్ తన పలు పుస్తకాలలో ప్రస్తావించారు. దళిత్ పోరాటాలు, భూమి, నీటి కోసం జరిగిన పోరాటాల్లో గ్రామీణ మహిళల సమరశీలతకు ప్రాధాన్యాన్ని తగ్గించిన అధ్యయనాలలోని లొసుగులను ఎత్తిచూపుతూ ఆ వాదాలకు దీటైన, సహేతుకమైన ప్రతివాదాలను వాటి ప్రాధాన్యాన్ని ఆంవెట్ నొక్కి చెప్పారు. 


1960 దశకం తుదినాళ్ళ నుంచి 2017 దాకా దళిత్ బహుజన్ విప్లవకర చింతనాశీల కార్యాచరణ, విప్లవ భావనను, దళిత బహుజనులు పునరావిష్కరణ చేసిన రీతులపరంగా పాశ్చాత్య సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే మార్గాలను ఆమె అన్వేషించారు. భారత్‌లో సిద్ధాంతం-–ఆచరణ మధ్య తీవ్ర అంతరాలు స్పష్టంగా ఉన్నట్టు ఆమె గుర్తించారు. ఇందుకు కారణాలను తెలుసుకునేందుకు ఆమె దేశంలోని వామపక్షాలను, మార్క్సిస్టు రాజకీయ సంస్థలను నిశితంగా పరిశీలించారు. తిరుగుబాటుతత్వ ఆధ్యాత్మికత కోసం దళితుల అన్వేషణను అర్థం చేసుకునేందుకు ఆమె ప్రయత్నించారు. 


‘ఇంటర్ సెక్షనాలిటీ’ (ఒక వ్యక్తి సామాజిక, రాజకీయ గుర్తింపుల అంశాలు విభిన్న వివక్షలకు, ప్రత్యేక హక్కుల సృష్టికి ఎలా మిళితమవుతున్నాయో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే విశ్లేషణాత్మక చట్రం) భావనకు మూలాలు తొలినాటి బ్లాక్ ఫెమినిస్ట్ వ్యక్తీకరణల్లోనూ, అలాగే పరాధీన భారతంలో కులం, జెండర్‌పై సావిత్రీబాయి పూలే ఆలోచనల్లోనూ ఉన్నాయని సామాజిక శాస్త్రవేత్తలు పాట్రీసియా హిల్ కొల్లిన్స్, సిర్మా బిల్గే వివరించారు. ఈ భావనను తొలుత ప్రతిపాదించిన కింబెర్ లే విలియమ్స్ క్రెన్ షా మేధోకృషిని చారిత్రకంగా, భౌగోళికంగా విస్తరింప చేశారు.


ఆఫ్రికన్-–అమెరికన్ స్త్రీవాద ఉద్యమాలు, పోరాటాలు, ఇటు భారత్ లోని దళితుల ఉద్యమాల గురించి సన్నిహిత, సమధిక అవగాహన ఉన్న ఆంవెట్ భారతీయ పరిశోధనలు నిజానికి క్రెన్ షా ‘ఇంటర్ సెక్షనాలిటీ భావన’ ను ముందుగానే సూచించాయి. పలువురు పాశ్చాత్య స్త్రీవాద విదుషీమణుల భావనలను ఆంవెట్ తన పరిశోధనలలో ప్రస్తావించినప్పటికీ ‘ఇంటర్ సెక్షనాలిటీ’ భావనను ఉపయోగించుకోలేదు. క్రెన్ షా ఆ భావనను ప్రతిపాదించేనాటికే ఆంవెట్ పరిశోధనాసక్తులు గ్రామీణ పోరాటాలు, వ్యవసాయ సంక్షోభాలు, కుల వ్యతిరేక తాత్వికతలపై కేంద్రీకృతమయ్యాయి. అయినప్పటికీ ‘ఇంటర్ సెక్షనాలిటీ’ భావన మూలాధారాలను, దళిత్ బహుజన్ ఉద్యమాల సంస్కరణవాద చైతన్యాన్ని అర్థం చేసుకోవడంలో దాని ఉపయుక్తతను ఆంవెట్ పరిశోధనలు విశదం చేశాయి. 


గెయిల్ ఆంవెట్ పరిశోధనలు, రాజకీయ కార్యాచరణకు ‘స్నేహశీలత’ (కన్‌వివీయాలిటీ) కేంద్రంగా ఉన్నాయి. కుల వ్యతిరేక తాత్వికతలు, దళిత్ బహుజన్ ఆదివాసీ విప్లవకర ఆలోచనాయుత కార్యాచరణలో ఆ భావన మూలాలు ఉన్నాయి. కుల నిర్మూలన సందేశాన్ని, విప్లవ భావనకు దళిత్ బహుజన్ విప్లవ దార్శనికతే దృష్టాంతమనే సందేశాన్ని మరింత విస్తృతంగా పరివ్యాప్తం చేసే దూతగా గెయిల్ ఆంవెట్ తనను తాను భావించుకున్నారు. 


-కల్పనా కన్నాబిరాన్