కొత్తరకం నిర్బంధం

ABN , First Publish Date - 2021-11-16T06:35:50+05:30 IST

మావోయిస్టుపార్టీ నేత అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే) మీద వెలువడబోతున్న ఒక సంకలనాన్ని, హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించదలపెట్టిన సంస్మరణ సభనూ తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు..

కొత్తరకం నిర్బంధం

మావోయిస్టుపార్టీ నేత అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే) మీద వెలువడబోతున్న ఒక సంకలనాన్ని, హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించదలపెట్టిన సంస్మరణ సభనూ తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఎవరిమీద వచ్చిన పుస్తకం, ఎవరి సంస్మరణ అన్నవిషయాలను పక్కనబెడితే, ఇది ముద్రణారంగంతోనూ, రచనలతోనూ, పుస్తకాలతోనూ, సభలూ సమావేశాలతోనూ సంబంధం ఉన్నవారందరికీ వర్తించే అంశమన్నది గమనించాలి. హైదరాబాద్ పోలీసులు ఈ సందర్భంలో రెండు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారు. ఒకటి, ప్రచురణలో ఉన్న పుస్తకాన్ని ముద్రణాలయం నుంచి స్వాధీనం చేసుకోవడంతో పాటు, సదరు ముద్రణాసంస్థ అధిపతిపై కఠినచట్టాల కింద అభియోగాలు నమోదు చేశారు. రెండవది, ఎటువంటి అనుమతులు పొందనవసరం లేని సభను, ఆ స్థలం యజమాన్యంపై ఒత్తిడి తెచ్చి జరగనివ్వకుండా చేశారు. ఒక మావోయిస్టు నాయకుడి సంస్మరణతో ముడిపడిన అంశం కనుక, ఇటువంటివి సహజమే, సాధారణమే అనుకోవచ్చును కానీ, ఈ రెండు చర్యలూ ఆనవాయితీగా మారితే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. 


హాల్ మీటింగులు కూడా పోలీసులు జరగనివ్వకుండా చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. కానీ, ఒక పుస్తకం ఆవిష్కరణను ఇలా నిరోధించడం ఇటీవల ఎప్పుడూ వినని సంఘటన. ఏదైనా పుస్తకం వెలువడిన తరువాత దానిలో మంచిచెడులు బేరీజు వేసుకొని ప్రభుత్వాలు నిషేధించిన సందర్భాలున్నాయి. అలా నిషేధించడానికి కావల్సిన వెసులుబాటు కూడా చట్టాల్లో ఉంది. కానీ, ఒక పుస్తకం బయటకు రాకమునుపే, అందులో అభ్యంతరకరమైనది ఉన్నదని అనుకొని, దానిని రాకుండా చేయడమన్నది విచిత్రం. ఈ ప్రీ సెన్సార్ షిప్ ఎమర్జెన్సీ కాలంలో కూడా పుస్తకాల విషయంలో అమలు జరిగినట్టుగా వినలేదు. ఇక, సంస్మరణ సభ జరగవలసిన అక్కిరాజు హరగోపాల్ విషయానికి వస్తే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం దృష్టిలో చట్టవ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తే కావచ్చు కానీ, సమాజంలోని అనేక వర్గాలలో, చదువుకున్నవారిలోనూ, లేనివారిలోనూ కూడా అతనిపై సానుకూల అభిప్రాయం ఉన్నది. అందుకు అనేక చారిత్రక కారణాలున్నాయి. ప్రభుత్వమే మావోయిస్టులతో చర్చలు జరిపిన సందర్భం కూడా వాటిలో ఒకటి. రామకృష్ణ ప్రభుత్వ దళాలతో జరిగిన ఘర్షణలో కాక, అనారోగ్యంతో మరణించారు. ఇవన్ని కారణాల వలన సమాచార ప్రసార మాధ్యమాలు ఆర్కే మరణవార్తను ప్రముఖంగా ప్రచురించడమే కాక, ఆయన జీవిత ఆచరణను ఉదాత్తమైనదిగా భావిస్తూ కథనాలు ప్రచురించాయి. ఆర్కే గురించి  ఆయన వ్యక్తిత్వం గురించి ప్రముఖ పత్రికల్లో అనేక వ్యాసాలు కూడా ప్రచురితమైనాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న పుస్తకంలో పత్రికావ్యాసాలే పునర్ముద్రించామని ప్రచురణకర్తలు చెబుతున్నారు. పత్రికా వార్తలకు, వ్యాసాలకు లేని అభ్యంతరం పుస్తకానికి ఎందుకో తెలియడం లేదు.


ఆర్కేకు సంబంధించిన సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్‌లో అలకూరపాడు గ్రామంలో విజయవంతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు పెట్టలేదు. ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేసిందే తప్ప సభకు అనుమతించింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం భిన్నంగా ఎందుకు వ్యవహరించిందో అర్థంకాదు. ప్రభుత్వం సంస్మరణ సభను నిషేధించినా, ఆ నిషేధాన్ని తప్పుబడుతూ పత్రికా సమావేశం జరగనే జరిగింది. ఏది ఏమైనా సమాజంలో దేనిని అనుమతిస్తామో, దేనిని కాదంటామో చట్టాలలో రాసుకొని, దాని ప్రకారం వ్యవహరించడం మేలు. కొన్ని రకాల పుస్తకాలు ప్రచురించకూడదనీ, కొన్ని రకాల సభలు జరగకూడదనీ అనుకుంటే అందుకు తగిన చట్టాలను రూపొందించుకుంటే ఎవరికీ ఏ సమస్యా ఉండదు. ముద్రాపకులను, సమావేశస్థలాల నిర్వాహకులను భయపెట్టి నిషేధాలను, నిర్భందాలను అమలు చేయడం మంచి పద్ధతి కాదు.

Updated Date - 2021-11-16T06:35:50+05:30 IST