భగవంతుడి మీదే భారం!

ABN , First Publish Date - 2020-05-12T14:45:07+05:30 IST

ఊపిరాడని పి.పి.ఇ సూట్లు... వైద్యానికి ఆశించినంతగా సహకరించని రోగులు... కుటుంబానికి దూరంగా నివాసాలు... ఇవాళ దేశవ్యాప్తంగా అనేకచోట్ల కరోనా సొలేషన్‌ వార్డుల్లో సేవలందిస్తున్న నర్సుల పరిస్థితి ఇది! ఇంత కష్టంలోనూ చిరునవ్వుతో సేవ చేస్తున్న కనిపించే దేవుని రూపాలు వాళ్లు! అలా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు మనోగతం...

భగవంతుడి మీదే భారం!

ఆంధ్రజ్యోతి(12-05-2020):

ఊపిరాడని పి.పి.ఇ సూట్లు... వైద్యానికి ఆశించినంతగా సహకరించని రోగులు... కుటుంబానికి దూరంగా నివాసాలు... ఇవాళ దేశవ్యాప్తంగా అనేకచోట్ల కరోనా సొలేషన్‌ వార్డుల్లో సేవలందిస్తున్న నర్సుల పరిస్థితి ఇది! ఇంత కష్టంలోనూ చిరునవ్వుతో సేవ చేస్తున్న కనిపించే దేవుని రూపాలు వాళ్లు! అలా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు మనోగతం...


‘‘నా ఇరవై మూడేళ్ల వృత్తి జీవితంలో ఇలాంటి విపత్తు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. ఎన్నో రకాల వ్యాధులను చూశా! కానీ ఇంతలా భయాందోళనలకు లోను చేసిన వ్యాధి ఇదొక్కటే! స్టాఫ్‌ నర్సుగా కరోనా రోగులకు సేవలు చేయక తప్పదు. అది నా బాధ్యత. ఇలా రోజులో ఎంతోమంది రోగులకు చికిత్స ఇవ్వవలసి ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏమాత్రం ఏకాగ్రత తప్పినా వైరస్‌ బారిన పడతాను. కాబట్టే అనుక్షణం అప్రమత్తంగా నడుచుకుంటూ ఉండాలి. అయినా పొరపాటు చేయడం మానవ నైజం. అదే జరిగితే, వైరస్‌ బారిన పడక తప్పదు. అందుకే... ఐసొలేషన్‌ వార్డులో అడుగుపెట్టిన ప్రతిసారీ ‘‘భగవంతుడా! నీదే బాధ్యత!’’ అంటూ ఆ దేవుడి మీదే భారం వేస్తూ ఉంటాను. 


అనుక్షణం అప్రమత్తం!

ఐసొలేషన్‌ వార్డులో కరోనా రోగులకు సేవలు చేయడం సంతృప్తి కలిగించే విషయం. స్టాఫ్‌ నర్సుగా పలు రకాల బాధ్యతలు నిర్వహిస్తూ ఉండాలి. విధుల్లో భాగంగా రోగుల బెడ్‌షీట్స్‌ ప్రతి రోజూ దగ్గర ఉండి మార్పిస్తూ ఉంటాను. రోగులు పరిశుభ్రత పాటిస్తున్నారో, లేదో గమనిస్తూ ఉంటాను. వారికి ఆహారం ఇస్తూ, మధుమేహులైతే, ఆహారనియమాల ప్రకారం నిర్దిష్టమైన ఆహారం అందించాలి. రంజాన్‌ మాసం పాటిస్తున్న ముస్లిం రోగులైతే వారికి ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ ఉండాలి. అలాగే రోగులందరికీ సబ్బులు, టూత్‌బ్ర్‌షలు లాంటివి ఎప్పటికప్పుడు సమయానికి అందేలా చూస్తాను. ఈ పనులన్నీ తేలికైనవే! అయితే వైద్యుల సూచనల ప్రకారం రోగులకు సమయానికి ఇంజెక్షన్లు, మాత్రలు ఇవ్వడం కొంత ప్రమాదంతో కూడుకున్న పని. ఇంజెక్షన్‌ ఇవ్వాలన్నా, మాత్రలు అందించాలన్నా చేతులకు ధరించిన గ్లౌజులు తొలగించి, రోగిని తాకక తప్పదు. ఈ సమయంలో కరోనా వైరస్‌ సోకవచ్చు. తాకిన వెంటనే శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుని గ్లౌజులు మార్చుకున్నా, వైరస్‌ అంటుకుందేమో అనే భయం మనసును మెలిపెడుతూనే ఉంటుంది. అయినా నర్సుగా ఈ పనులన్నీ చేయడం నా బాధ్యత.


అప్రమత్తతతో అలసట!

అనుక్షణం ఇలా అప్రమత్తతతో, భయంతో మెలగడం వల్ల వృత్తిలో విపరీతమైన మానసిక ఒత్తిడి, అలసటలు తప్పడం లేదు. ఐసొలేషన్‌ వార్డులోకి వెళ్లేముందు పి.పి.ఇ (పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్వి్‌పమెంట్‌) సూట్‌ ధరించడంతో మొదలయ్యే ఈ ఒత్తిడి, మళ్లీ ఇంటికి చేరి స్నానం చేసేవరకూ కొనసాగుతుంది. పి.పి.ఇ దుస్తులను ధరించడం ఎంత తేలికో, తొలగించడం అంత కష్టం. ఒకసారి తొలగిస్తే, వాటిని జాగ్రత్తగా చెత్తబుట్టలో వేయాల్సిందే తప్ప, రెండోసారి వాడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ దుస్తుల్లో ఉన్నంత సేపు కాలకృత్యాలు తీర్చుకునే వీలు కూడా ఉండదు. అలాగే తొలగించేటప్పుడు దుస్తులను తిరగేసి తీయాలి. పొరపాటున కూడా ఉపరితలాన్ని తాకకూడదు. అలాగే తిరిగి ఉపయోగించే వీలు లేకుండా, తొలగించేటప్పుడే దుస్తులను చింపి, మూట కట్టి, చెత్తడబ్బాలో వేస్తాం. ఈ ప్రక్రియ మొత్తం ఎంతో అప్రమత్తతతో సాగాలి. అక్కడితో మా బాధ్యత తీరింది అనుకోవడానికి లేదు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత కూడా ఈ జాగ్రత్తలు ఇలాగే కొనసాగుతాయి. ఇంటి బయటే వేడినీటి స్నానం చేసి, దుస్తులను వేడినీళ్లతో ఉతికేస్తాను.


ఎండలో అరగంట పాటు నిలబడి, ఆ తర్వాతే ఇంట్లోకి అడుగు పెడతాను. ఎప్పుడు ఎక్కడ పొరపాటు జరుగుతుందో, ఏ క్షణం కరోనా సోకుతుందో అనే భయం డ్యూటీలో ఉన్నంతసేపూ వెన్నాడుతూనే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాను.


రోగులతో ఇబ్బందులు!

ఐసొలేషన్‌ వార్డులో పలు రకాల అనుభవాలను ఎదుర్కొన్నాను. కొందరు రోగులు బెడ్‌ వదిలేసి వార్డు బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఇంకొందరు చాలా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మరికొందరు చీటికీ మాటికీ చీకాకు పడిపోతూ, హైరానా పెట్టేస్తూ ఉంటారు. వీళ్లందరికీ నచ్చచెప్పి, సముదాయించి వార్డు దాటకుండా చూసుకుంటూ ఉంటాను. కరోనా సోకిందనే కోపం, నిస్సహాయతలు రోగులను మానసికంగా కుంగదీస్తాయి. కాబట్టి వారి ప్రవర్తనలకు నేను కోపం తెచ్చుకోను. ఓర్పుతో వారిని నెమ్మదించేలా చేసి, చికిత్సతో వ్యాధి నయం అవుతుందనీ, త్వరగా కోలుకుని ఇంటికి వెళ్లాలంటే చికిత్సకు సహకరించాలనీ చెబుతూ వారిలో మానసిక స్థైర్యాన్ని నింపుతూ ఉంటాను.’’


‘‘మా వారు హైదరాబాద్‌కు దూరంగా పోలీసు వృత్తిలో ఉన్నారు. వారానికి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇంట్లో పిల్లల ఆలనా పాలనా నేనే చూసుకోవాలి. నాకు ఇద్దరు పిల్లలు. పాప డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. బాబు ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం. పిల్లలిద్దరికీ నాతో అనుబంధం ఎక్కువ. సాయంత్రం మూడు గంటల నుంచి నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఇంటికి రావడం ఆలస్యం అయితే కంగారుపడతారు. ఆస్పత్రి ఏర్పాటు చేసిన బస్సులో ఉప్పల్‌ వరకూ చేరుకున్నా, అక్కడి నుంచి మా అబ్బాయి బండి మీద నన్ను ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. నేరుగా ఆస్పత్రి నుంచి వస్తాను కాబట్టి, బాబుకు నా నుంచి కరోనా వైరస్‌ అంటుకుంటుందేమో అని భయం వేస్తూ ఉంటుంది. కానీ ‘‘వస్తే వచ్చిందిలే అమ్మా! ఏం కాదు!’’ అని బాబు అంటూ ఉంటాడు. పిల్లలిద్దరూ నా నుంచి దూరం పాటించరు. నా నుంచి దూరంగా మసలడం వారి వల్ల కావడం లేదు.’’  


‘‘కరోనా విధుల్లో ఉన్న నర్సులు నెలలో 20 రోజులు డ్యూటీ చేయాలి. మిగతా 10 రోజులు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రతి వారం రోజుల డ్యూటీ తర్వాత మూడు రోజుల పాటు ఇంటికి వెళ్లవచ్చు. నిరంతర విధులతో నర్సులు అలసటకు గురవకుండా ఉండడం కోసమే ఈ ఏర్పాటు. విధుల్లో ఉన్నన్ని రోజులు ఆస్పత్రికి చేరువలో ఉన్న హోటల్‌లో నివాస ఏర్పాట్లు చేశారు.’’


అందరికీ దూరంగా!

‘‘మిగతా వారితో పోలిస్తే, కరోనా విధుల్లో ఉంటున్న నర్సుగా నేను సామాజిక దూరం మరింత ఎక్కువ పాటించవలసి ఉంటోంది. ఐసొలేషన్‌ వార్డులో పని చేస్తున్నాను కాబట్టి నా దగ్గరకు రావడానికి అందరూ భయపడుతూ ఉంటారు. మా ఇంటికి చేరువలో ఉన్న బంధువులు, స్నేహితుల రాకపోకలు తగ్గిపోయాయి. కరోనా సోకుతుందనే భయం ఎవరికైనా ఉంటుంది. తెలిసి తెలిసీ ఎవరూ కోరి కరోనాను తెచ్చుకోరు కదా? కాబట్టే వారి భయాలను నేను అర్థం చేసుకుని, అందరికీ దూరంగా ఉంటున్నాను. ఫోన్లలో పలకరింపులే తప్ప, స్వయంగా కలవడం మానేశాను.’’


Updated Date - 2020-05-12T14:45:07+05:30 IST