రిజిస్ట్రేషన్‌ శాఖలో సస్పెన్షన్ల పర్వం

ABN , First Publish Date - 2021-11-22T06:27:08+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది.

రిజిస్ట్రేషన్‌ శాఖలో సస్పెన్షన్ల పర్వం

 తాజాగా మరో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లపై వేటు

గతంలో ముగ్గురిని విధుల నుంచి తప్పించిన అధికారులు 

మరో రెండు రోజుల్లో మరికొందరిపై చర్యలకు అవకాశం

నల్లగొండ, నవంబరు 21: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. రెండు నెలల క్రితం ముగ్గురిని విధుల నుంచి తప్పించిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు తాజాగా, మరో ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్లను సస్పెండ్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ లేఔట్లకు డీటీసీపీ అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్లు చేసినందుకు నల్లగొండ సబ్‌రిజిస్ట్రార్‌ ముబషిర్‌ అహ్మద్‌ను, దేవరకొండ ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌ వెంకట్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు. బీబీనగర్‌లో పనిచేసిన ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్లు గోపి, భువనగిరిలో పనిచేసిన వెంకటేశ్వర్లు, హుజూర్‌నగర్‌లో పనిచేసిన నగే్‌షను రెండు నెలల క్రితం సస్పెండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ చేసినందుకు వీరిపై వేటుపడింది.


సస్పెన్షన్లకు కారణాలివే..

గ్రామీణ ప్రాంతాల లేఔట్లకు డీటీసీపీ అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్‌ చేయకూడదని 2019లో జీ2/257/2019 జారీచేసిన సర్క్యూలర్‌లో నిబంధన ఉంది. నాన్‌ అగ్రికల్చర్‌కింద ఫీజు కట్టినందునే తాము రిజిస్ట్రేషన్‌ చేశామని సబ్‌రిజిస్ట్రార్లు వాదిస్తున్నారు. రెండు నెలల క్రితం భువనగిరిలో ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన వెంకటేశం మూడు రోజుల్లో 500 డాక్యుమెంట్లను ఇదేవిధంగా రిజిస్ట్రేషన్‌ చేసినట్టు విచారణలో తేలడంతో సస్పెండ్‌ చేశారు. అదేవిధంగా ఈసీని తప్పుగా ఎంటర్‌ చేసి డాక్యుమెంట్‌ చేసినందుకు హుజూర్‌నగర్‌ ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌ నగే్‌షను సస్పెండ్‌ చేశారు. సెక్షన్‌ 28 ప్రకారం సూర్యాపేటకు చెందిన డాక్యుమెంట్‌ను బీబీనగర్‌లో రిజిస్ట్రేషన్‌ చేసిన ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌ గోపిని సస్పెండ్‌ చేశారు. తాను నిబంధన మేరకే రిజిస్ట్రేషన్లు చేశానంటూ గోపి హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రస్తుతం నల్లగొండలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ ఆడిట్‌ కార్యాలయంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు.


డాక్యుమెంట్‌ రైటర్లు, రియల్టర్ల ఒత్తిడితోనే..

ఉమ్మడి జిల్లాలోని చాలా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు, రియల్టర్లు, రాజకీయ నేతలు సబ్‌రిజిస్ట్రార్లపై ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ రాష్ట్ర కార్యాలయం కేవలం సర్క్యులర్‌ మాత్రమే ఇచ్చిందని, ఎలాంటి జీవో జారీ చేయలేదని, దీనికి తోడు హైకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నాయని సబ్‌రిజిస్ట్రార్లు పంచాయతీ లేఔట్లతో ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. అసెంబ్లీ ఆమోదం తెలిపితేనే గ్రామ పంచాయతీ లేఔట్ల రిజిస్ట్రేషన్‌కు జీవో వస్తుందని రాష్ట్ర అధికారులు జారీ చేసిన సర్క్యూలర్‌ చెల్లనందునే రిజిస్ట్రేషన్‌ చేశామంటూ కూడా కొందరు వాదిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇన్‌చార్జులుగా పనిచేసిన వారితో పాటు పూర్తిస్థాయి సబ్‌రిజిస్ట్రార్లు సైతం ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో చిక్కుకున్నట్లు తెలిసింది. మరికొందరు సబ్‌రిజిస్ట్రార్లపై వేటుపడే అవకాశం ఉంది.


పర్యవేక్షణ లేకే..

ఉమ్మడి జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖకు 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తు తం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెరిగింది. పట్టణ శివారు ప్రాంతాలకు సమీపంలో ఉన్న వెంచర్లన్నీ గ్రామ పంచాయతీ లేఔట్లతో అనుమతులు లేకుండానే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. డీటీసీపీ అనుమతి ఉండాలని రాష్ట్రస్థాయి అఽధికారులు పేర్కొంటుండగా, ప్రభుత్వం నుంచి సంబంధిత జీవో లేనప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తే తప్పేంటిని కొందరు అధికారులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు  ఉన్నతాధికారులు ఎందుకు పర్యవేక్షించలేదన్న చర్చ సాగుతోంది. ఆడిట్‌ అధికారులు ఎందుకు నియంత్రించలేక పోయారన్న విమర్శలు వస్తున్నాయి. 

Updated Date - 2021-11-22T06:27:08+05:30 IST