Abn logo
Nov 25 2021 @ 23:52PM

శాశ్వత పరిష్కారం కావాలి..!

పులపత్తూరులో ఽధ్వంసమైన ఇళ్లు

అన్నమయ్య ప్రాజెక్టు కట్టతెగి ఛిద్రమైన పల్లెలు

పులపుత్తూరు, తోగూరుపేట, మందపల్లిల్లో కోలుకోని నష్టం

వేలాది హెక్టార్లల్లో దెబ్బతిన్న పంటలు..

సర్వం కోల్పోయి వీధిన పడ్డ అభాగ్యులు

ఆంధ్రజ్యోతి విజిట్‌లో బాధితుల కన్నీటి కఽథలెన్నో

(కడప-ఆంధ్రజ్యోతి): అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగి సర్వం కోల్పోయాం.. ఉప్పెనై వచ్చిన వరదకు ఊర్లు, పొలాలు, ఏరు ఒక్కటయ్యాయి.. వరద ముంచిన రెండు రోజులకు అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చారు. ఆదుకుంటామని ఆభయమిచ్చారు. వీధుల్లో బురద తొలగిస్తున్నారు. నీడ కోసం చాలీచాలని బ్లూ టార్పాలిన్లు ఇన్తున్నారు. వారం రోజుల తర్వాత కరెంట్‌ ఇచ్చారు. తాత్కాలిక ఉపశమనం ఓకే.. మా పల్లెసీమలు సాధారణ స్థితికి తీసుకొచ్చే శాశ్వత పరిష్కార చర్యలు ఏవీ..? మన జిల్లాకే చెందిన సీఎం జగన్‌ ప్రత్యేక చొరవ చూపాలి. ఏడాదిలోగా పూర్వస్థితికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలంటూ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ బృందంతో ఏకరవు పెట్టారు.

రాజంపేట మండలం పులపత్తూరు, తొగూరుపేట, మందపల్లి, గుండ్లూరు, నందలూరు మండలం పాటూరు, నందలూరుతో పాటు చెయ్యేరు నదీ తీరంలోని పదుల సంఖ్యలో పల్లెసీమలు వరదకు చితికిపోయాయి. పచ్చని పంటలు.. పాడిధారలతో కళకళలాడే కోనసీమ లాంటి పల్లెసీమలు అన్నమయ్య ఆనకట్ట కొట్టుకుపోవడంతో ఛిద్రమయ్యాయి. పులపత్తూరులో రాజులకాలనీ, రెడ్లవీధి, దళితవాడలో సుమారు 150కి పైగా ఇళ్లు కుప్పకూలి ఆనవాలు కోల్పోయాయి. తొగూరుపేటలో 75 ఇళ్లు ఇసుక దిబ్బలుగా మారాయి. వరదలలో చిక్కి సర్వం కోల్పోయి నేటికి వారం రోజులు. వారికి జరిగిన నష్టం భరీ చేయలేనిది. వీధుల్లో పేరుకుపోయిన బురదను తొలగించారు. తెగిపోయిన రోడ్లకు ఆతుకులు వేశారు. ఇప్పుడిప్పుడే కరెంట్‌ సరఫరా ఇస్తున్నారు. ఇవన్నీ ఓకే.. మళ్లీ తాము సాధారణ స్థితికి రావాలంటే శాశ్వత చర్యలు చేపట్టాలని, జరిగిన నష్టంపై సమగ్ర అంచనాలు తయారుచేసి ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని కోరుతున్నారు.


బాధితుల ప్రధాన డిమాండ్లు ఇవీ..

- వేల హెక్టార్ల పొలాలలో 5 అడుగుల మేర ఇసుక మేటలు వేసాయి. ఉపాధి హామీ కింద ఇసుక మేటలు తొలగించి, ఏడాదిలోగా సాగులోకి తీసుకురావాలి

- వరదకు కొట్టుకుపోయిన వ్యవసాయ బావులను తిరిగి తవ్వించాలి. విద్యుత్‌ కనెక్షన్‌, విద్యుత్‌ మోటార్లు, డ్రిప్‌ పైపులు ఉచితంగా ఇవ్వాలి.

- పంట రుణాలన్నీ రద్దు చేయాలి. పాడి ఆవుల కొనుగోలుకు మహిళలు తీసుకున్న డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేయాలి

- వరదకు కొట్టుకుపోయి చనిపోయిన పాడి సంపదను లెక్కించి, ఆ మేరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇవ్వాలి.

- సురక్షిత ప్రాంతాల్లో 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి, ఇల్లు కట్టించి ఇవ్వాలి.

- ప్రతి ఇంట్లో కొట్టుకుపోయిన వంట సామగ్రి, టీవీ, కూలర్లు, బట్టలు, ఇతర సామగ్రి నిష్పక్షపాతంగా అంచనా వేసి కొనివ్వాలి

- పాడిపశువులకు ఏడాది పాటు ఉచితంగా దాణా సరఫరా చేయాలి

- తిరిగి పంటలు వేసి, రైతు కోలుకునే వరకు వడ్డీలేని బ్యాంకురుణాలు ఇవ్వాలి


నాడు సోమశిల.. నేడు చెయ్యేరు..

- తరిమెళ్ల నరేష్‌ 

2001-2002లో మా ఊరు సోమశిలలో మునిగింది. పులపుత్తూరుకు వచ్చి ఇల్లు కట్టుకుని పాడి ఆధారంగా జీవిస్తున్నాం. కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. చెయ్యేరు వరద మరోసారి ముంచింది. పది ఆవులు, పది గేదెలు, దూడలు, 40 కోళ్లు కొట్టుకుపోయాయి. సోమశిల ముంపు నిరుద్యోగ జాబితాలో మాపేరు ఉంది. కలెక్టర్‌ చొరవ చూపి ఆ ఉద్యోగం ఇస్తే కొంతైనా కోలుకుంటాం.


రూ.3కోట్ల దాకా నష్టం

- శంకర్‌రెడ్డి, మాజీ సర్పంచి, పులపత్తూరు 

చెయ్యేరు వరదకు ఓ కొండ కొట్టుకొచ్చి మా పొలంలో పడింది. 25 ఎకరాలు ఇసుక దిబ్బ, రాళ్లకుప్పగా మారింది. పది ఎకరాల్లో మామిడి తోట, 450 చెట్లు కొట్టుకుపోయాయి. రూ.3కోట్లకు పైగా నష్టపోయాం. మా ఊర్లో పెళ్లిళ్లు జరిగితే ఎందరికో అండగా నిలిచాం. ఈ రోజు అన్ని కోల్పోయి రోడ్డున పడాల్సివచ్చింది.


అయినవాళ్లను కోల్పోయాం

- బీము ఆశోక్‌కుమార్‌రెడ్డి, పులపత్తూరు 

మా అన్న జగన్‌ ఈ ఊరి సర్పంచి. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో అన్నదానం చేయాలని సరుకుల కోసం రాజంపేట వెళ్లాను. రాత్రి వర్షాలు అధికమవడంతో అక్కడే ఉన్నా. శుక్రవారం ఉదయం అన్నమయ్య అనకట్ట తెగిపోయి వరద వస్తుందని ప్రజలను కాపాడేందుకు మా అన్న ఊర్లోకి వెళ్లాడు. వీధి వీధి తిరిగాడు. ఇంట్లో ఉన్న అమ్మ విజయభారతి, పెద్దమ్మ పద్మావతమ్మ, తాత చెంగల్‌రెడ్డి వరదలో కొట్టుకుపోయారు. 200 మందిని కాపాడి ఆయిన వారిని కోల్పోయాం.


వరద నిలువునా ముంచింది

- సంపటి జయరామ్‌, వాణి, పులపత్తూరు 

శుక్రవారం అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి వరద వస్తుంటే, మా నాన్న గంగయ్య పక్కవాళ్లను బయటికి పంపి, అప్పటికే వరద ఎక్కువై మిద్దె ఎక్కాడు. వరద ధాటికి ఇల్లు పునాదులతో సహా కొట్టుకుపోవడంతో ఆయనా కొట్టుకుపోయాడు. శవం ఆదివారం దొరికింది. రూ.5800 ఇచ్చారే తప్ప, రూ.5లక్షలు చెక్కు ఇంత వరకు ఇవ్వలేదు. ఈ రోజు వరకు దళితవాడకు కరెంట్‌ రాలేదు. ప్రభుత్వం బ్లూ టార్పాలిన్లు మాత్రమే ఇచ్చింది. బట్టలు లేక వారం రోజులుగా స్నానాలు చేయలేదు. 


ఇసుక మేటలు తొలగించాలి 

-  పసుపులేటి వెంకటసుబ్బయ్య, వెంకటసుబ్బమ్మ దంపతులు, మందపల్లి గ్రామం 

చెయ్యేరు వరదకు రూ.15లక్షల దాకా నష్టపోయాం. రెండు ఎకరాల్లో ఐదు అడుగుల మేర ఇసుక మేటలు వేసింది. వీధుల్లో బురద తొలగించారు. ఇప్పుడిప్పుడే కరెంట్‌ ఇస్తున్నారు. ఇంట్లోకి నీళ్లు వచ్చాయని రూ.5800లు ఇచ్చారు. ఉపాధి హమీ కింద ప్రభుత్వమే ఇసుక మేటలు తొలగించాలి. ఏడాది పాటు పశువులకు దాణా ఉచితంగా ఇవ్వాలి.  మా డ్వాక్రా, పంట రుణాలు రద్దు చేయాలి. 


కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం

- ఆకుల పీరయ్య, మందపల్లి గ్రామం 

చెయ్యేరు ఒడ్డునే మా ఇల్లు ఉంది. కొత్తగా కట్టుకోవడం వల్ల కొంత వరకు దెబ్బతినింది. 48 బస్తాల ధాన్యం, 16 బస్తాల బియ్యం, 4 పాడిపశువులు, 30 కోడిపుంజులు కొట్టుకుపోయాయి. సామాన్లు సరేసరి. కట్టుబట్టలతో ఉన్నాం. మేం పూర్వస్థితికి రావాలంటే, కొట్టుకుపోయిన ఆవులను ప్రభుత్వమే కొనివ్వాలి. 


మా ఇద్దరు పిల్లలను ప్రభుత్వం దత్తత తీసుకోవాలి

- మల్లికార్జున, శివాలయం పూజారి, మందపల్లి 

శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో నా భార్యపిల్లలు, మా తమ్ముడి భార్యపిల్లలు, ఇద్దరు అక్కలు...మొత్తం 11 మంది వెళ్లాం. సామాన్లు ఆలయంలో పెట్టగానే వరద కన్పించింది. తూర్పు ద్వారం తెరవగానే, ఆలయంలోకి వరద ఉప్పెనలా పోటెత్తింది. భయమేసి అందరిని కల్యాణమండపం ఎక్కించాను. ఓ అల నన్ను బలంగా ఢీ కొట్టడంతో దూరంగా ఉన్న రాళ్ల గుట్టవైపు పడ్డాను. 15 నిమిషాల్లో గుడి, కల్యాణమండపం కన్పించలేదు. ఆరగంటలో వరద తగ్గింది కానీ, ఆలయం పునాదులతో సహా కొట్టుకుపోయింది. మా కుటుంబ సభ్యులు 9 మంది కొట్టుకుపోయారు. ఇదంతా కళ్లముందే జరిగింది. నేను, నా ఇద్దరు కొడుకులు మాత్రమే మిగిలాం. ఆ ఇద్దరు పిల్లలను ప్రభుత్వమే దత్తత తీసుకుని చదివించాలి. ఉద్యోగం ఇవ్వాలి.


ఆ ఐదూళ్లూ.. చీకట్లోనే..!

చెయ్యేరు వరదలో చిక్కుకుని ఐదు గ్రామాల ప్రజలు ఇప్పటికీ కరెంటు, రోడ్డు, సమాచార వ్యవస్థ పూర్తిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజంపేట మండలంలోని చెయ్యేరు నదికి అవతలివైపు అడవిలో పాపరాజుపల్లె, చింతలకోన, నూతిపల్లె, బగ్గిడిపల్లె, యాకిరిపల్ల్లె ఉన్నాయి. ఈ పల్లెలకు వెళ్లాలంటే చెయ్యేరు నదిని దాటాల్సిందే. ఈ ఐదూళ్లకూ సరైన రోడ్డు సౌకర్యం లేదు. వీరు నదిలో కాలినడకన వెళ్లేవాళ్లు. ప్రస్తుతం భారీ వరద వల్ల అటు నందలూరు నుంచి ఇటు రాజంపేట నుంచి వెళ్లే రెండు దారులు లేకుండా పోయాయి. గ్రామాల్లోని కరెంటు స్తంభాలు, వైర్లు దెబ్బతిన్నాయి. దీంతో కరెంటు  పోయింది. సమాచార వ్యవస్థ బంద్‌ అయింది. ఈ పరిస్థితుల్లో వారికి కరెంటు ఇవ్వడానికి విద్యుత శాఖ ప్రయత్నాలు ప్రారంభించినా నదిలో నీటి ప్రవాహం వల్ల సాధ్యం కావడంలేదు. దీంతో ఈ ఐదూళ్లు చీకట్లోనే ఉన్నాయి. ఈ విషయమై రాజంపేట విద్యుత శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌రావును ఆంధ్రజ్యోతి వివరణ కోరగా పాపరాజుపల్లె, చింతలకోన, నూతిపల్లె, బగ్గిడిపల్లె, ఏకిరిపల్లెతో పాటు తాళ్లపాక పంచాయతీ హేమాద్రివారిపల్లెలో విద్యుత పునరుద్ధరణకు చర్యలు చేపట్టామన్నారు. ప్రధానంగా  నష్టపోయిన మందపల్లె, పులపత్తూరు, తొగూరుపేట, గుండ్లూరు తదితర గ్రామాలకు కరెంటు పునరుద్ధరించామని, అడవుల్లోని పై గ్రామాలకు కూడా కరెంటు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.