Abn logo
Sep 27 2021 @ 22:49PM

‘పోడు’ సమస్యకు శాశ్వత పరిష్కారం

- మంత్రి సత్యవతి రాథోడ్‌ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం

- అందరి దృష్టి అటువైపే

- ఆసక్తిగా గమనిస్తున్న రాజకీయపక్షాలు

- గిరిజనేతర రైతుల అంశంపై చర్చిస్తారా?

- ఏజెన్సీలో పట్టాలు దక్కని రైతులను పరిగణనలోకి తీసుకునేనా?

- మాకూ హక్కులు కల్పించాలంటున్న ఏజెన్సీ దళితులు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

రావనకాష్టంలా రగులుతున్న పోడుభూముల వ్యవహారంలో శాశ్వత పరిష్కారం కనుగొనే పేరుతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పోడురైతుల అంశాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి పరిష్కారం చూపడం కోసం గిరిజన సంక్షేమశాఖామంత్రి సత్యవతి రాథోడ్‌ నేతృత్వంలో ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ సంఘం రాష్ట్రంలో పోడు ప్రభావిత జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించడంతోపాటు ప్రస్తుతం ఎంత మంది రైతులు పోడు సాగులో ఉన్నారు. ఇందులో అర్హులు ఎంతమంది? అడవులకు నష్టం కలగకుండా ఎలా సర్దుబాటు చెయ్యాలి. అలాగే పోడుకు ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాల వంటి అంశాలపైనా నిశితంగా చర్చించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీ గిరిజనులు, మైదానప్రాంత గిరిజనుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వానికి సూచనలిచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇవేకాకుండా జిల్లాలో గిరిజనులతోపాటు గిరిజనేతర రైతులు కూడా పెద్దఎత్తున పోడు భూములు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా సిర్పూర్‌ నియోజకవర్గంలోని 8మండలాల్లోనూ సుమారు 20వేల మందికి పైగా గిరిజనేతర రైతులు పోడు సాగు చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రి వర్గ ఉపసంఘం వీరిపైన దృష్టి సారిస్తుందా లేదా అనే అంశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. వీరితో పాటు ఆసిఫాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఆసిఫాబాద్‌ మొదలుకొని తిర్యాణి వరకు గడచిన 5-6దశాబ్దాలుగా దళిత  రైతులు కూడా పెద్ద సంఖ్యలోనే పోడు భూములు సాగుచేసుకుంటున్నారు. ఆదివాసులతో సమానంగా ఏజెన్సీలో తమకు కూడా అన్నిరకాల హక్కులు కల్పించాలన్న డిమాండ్‌తో ఇటీవలి కాలంలో తరుచూ ఆందోళనలు చేపడుతున్నారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర- తెలంగాణకు సరిహద్దులో ఉన్న కెరమెరి మండలంలోని 12గ్రామాలకు చెందిన ప్రజలు భూమిపై హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. ఇరురాష్ట్రాల మధ్య వివాదాస్పద సరిహద్దు గ్రామాలుగా గుర్తింపు పొందిన ఈ 12గ్రామాలకు చెందిన ప్రజలు ఇక్కడి ఏజెన్సీ చట్టాల కారణంగా మహారాష్ట్రలో విలీనం అయ్యేందుకు అక్కడి ప్రభుత్వంతో మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో ముఖ్యంగా ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రతీఏటా అటవీ అధికారులకు గిరిజన, గిరిజనేతర పోడు రైతులకు మధ్య తరుచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్న ధరిమిళా పోడు సమస్య పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిలా తయారయింది.

గిరిజనేతర రైతుల చేతుల్లో 20వేల ఎకరాలు!?

జిల్లాలో అటవీశాఖ లెక్కల ప్రకారం సుమారు 40వేల ఎకరాలకు పైగా అటవీ భూములు సాగు భూములుగా మారాయి. ఇందులో కొంతమేరకు గతంలో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టంను అనుసరించి గిరిజనులకు హక్కులు కల్పించగా రమారమి 21-25వేల ఎకారాల అటవీభూమి అనధికారికంగా పోడు సాగుకు గురవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో అత్యధికంగా సిర్పూర్‌ నియోజక వర్గంలోనే అటవీ భూములు ఆక్రమణలకు గురవుతున్నట్లు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 15-20వేల ఎకరాలలో గిరిజనేతర రైతులే పోడు సాగుచేస్తున్నట్లు చెబుతున్నారు. చాలావరకు ఆదివాసులతో ఒకటి రెండు సంవత్సరాలు పోడు సాగు చేయించి ఆ తర్వాత గిరిజనేతర రైతులు వాటిని స్వాధీనం చేసుకొని పోడు సాగు చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.