పాక్ ఆర్మీ చీఫ్‌ను రాజీనామా చెయ్యమన్నందుకు ఐదేళ్ళ జైలు

ABN , First Publish Date - 2021-10-30T21:50:24+05:30 IST

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా

పాక్ ఆర్మీ చీఫ్‌ను రాజీనామా చెయ్యమన్నందుకు ఐదేళ్ళ జైలు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఓ వ్యక్తికి ఆ దేశ మిలిటరీ కోర్టు ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. జనరల్ బజ్వా పదవీ కాలాన్ని మరోసారి పొడిగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ గత ఏడాది సెప్టెంబరులో ఆ వ్యక్తి ఓ లేఖ రాయడంతో దేశ ద్రోహం ఆరోపణలపై విచారణ జరిగింది. 


పాకిస్థాన్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, జనరల్ బజ్వా పదవీ కాలాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి పొడిగించడంతో హసన్ అస్కరి అనే కంప్యూటర్ ఇంజినీరు గత ఏడాది సెప్టెంబరులో ఓ లేఖ రాశారు. జనరల్ బజ్వా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హసన్ తండ్రి పాక్ ఆర్మీ రిటైర్డ్ మేజర్ జనరల్ జఫర్ మెహ్ది అస్కరి. 


హసన్ అస్కరి దేశద్రోహానికి పాల్పడినట్లు నమోదైన ఆరోపణలపై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విచారణ జరిపింది. ఈ ఏడాది జూలైలో జరిగిన విచారణలో అస్కరి తరపున పాక్ మిలిటరీ కోర్టు నియమించిన అధికారి ఒకరు ప్రాతినిధ్యంవహించారు. ఈ విచారణ సందర్భంగా హసన్ తండ్రి అస్కరి ఓ ఫిర్యాదు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్న సాహీవాల్ జైలులోని తన కుమారుడిని కలవడం చాలా కష్టమవుతోందని ఆరోపించారు. 


ఇస్లామాబాద్ హైకోర్టు ఈ కేసుపై జనవరిలో విచారణ జరిపింది. ఈ దేశ ద్రోహం కేసును రహస్యంగా విచారించాలని ఆదేశించింది. ఈ విచారణ ఏవిధంగా జరిగిందో, ఎటువంటి శిక్ష విధించారో అధికారికంగా ప్రకటన వెలువడకపోవడంతో నిందితుని తండ్రి లాహోర్ హైకోర్టు రావల్పిండి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. తన కుమారుని తరపున వాదించేందుకు అతనికి నచ్చిన న్యాయవాదిని నియమించుకునేందుకు అవకాశం కల్పించలేదని ఆరోపించారు. తన కుమారుడిని రావల్పిండిలోని అడియాలా జైలుకు మార్చాలని కోరారు. 


Updated Date - 2021-10-30T21:50:24+05:30 IST