చెట్టులా నవ్విన పద్యం

ABN , First Publish Date - 2021-10-04T05:40:17+05:30 IST

ఒక చెట్టును చూస్తే లోపల వంద చెట్లు నాటినట్టే లోపలి చెట్లనీ, బయట చెట్లనీ కలిపే వేర్లుంటాయి వాటి ఆనవాళ్ళు తెలిపే దార్లుంటాయి...

చెట్టులా నవ్విన పద్యం

ఒక చెట్టును చూస్తే

లోపల వంద చెట్లు నాటినట్టే

లోపలి చెట్లనీ, బయట చెట్లనీ

కలిపే వేర్లుంటాయి

వాటి ఆనవాళ్ళు తెలిపే దార్లుంటాయి


ఆ తోటలో అడుగు పెట్టాను

ఓ కొత్త కవితలో అడుగు పెట్టినట్టు-

పైనంతా ఆకుపచ్చ పండాల్‌

నేలంతా పారిజాతాల పూల తివాచీ

మధ్యలో సుగంధిత ఆత్మలా

నా పద్యం పరుగులు-


మనిషీ చెట్టూ అనంతంగా పెనవేసుకున్న

రెండు స్వప్నాల సర్ప సంగమ కేళి తోట

మట్టి రాసిన మహాకావ్యం తోట


చెట్టుకు నీళ్ళయినా పొయ్యాలి

కన్నీళ్ళయినా పొయ్యాలి


కవిత కోసం నేనేరుకున్న పదాలన్నీ

తాటాకు చేదల్లాగా 

నీళ్ళొంపుకుంటూ నాట్యాలు చేశాయి

చెట్టు చెట్టునీ తనిఖీ చేసుకుంటూ

తోట కాపలాదారుడిలా నా పద్యం

రాగాలు తీసింది


ఆ చెట్ల మీద రాత్రి విశ్రాంతి తీసుకున్న

నక్షత్ర లోకాల దివ్య మణి దీపాలు

గ్రహాంతర వాసులు కాబోలు

పచ్చని కాంతి కెరటాన్ని

నా తల మీద కిరీటంలా వుంచి

వెలుగు నవ్వుల గిలిగింతలు పెట్టారు


మనిషికి ఇన్ని వేటలెందుకు

ఒక తోటుంటే చాలదా!

లోపలో బయటో

ఆకులా ఆత్మ ఉదయించడానికి

ఇంత చోటుంటే చాలదా!


శూన్యంగా వెళ్ళి తోటలా వచ్చాను

తిరుగు ప్రయాణంలో దారులన్నీ 

తోటలు అటూ ఇటూ తొలగి

నా కోసం పరచిన తోవల్లా అనిపించాయి


ఇంటికొచ్చాక తోట కావాలని

పసిపిల్లాడిలా నా పద్యం మారాం చేసింది

అప్పుడు నాలోపలి చెట్లన్నీ శీర్షాసనం వేస్తే

వాటి మీద ఆడుకుంటున్న కిరణాలన్నీ

జలజలా రాలాయి

చెట్టులా వేషం వేసి 

పద్యం పకపకా నవ్వింది

ప్రసాదమూర్తి

84998 66699


Updated Date - 2021-10-04T05:40:17+05:30 IST