మారిన జీవనచిత్రం

ABN , First Publish Date - 2020-04-09T10:59:02+05:30 IST

లాక్‌డౌన్‌తో ప్రజల జీవన చిత్రం పూర్తిగా మారింది. ఆంక్షల కారణంగా బయటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు

మారిన జీవనచిత్రం

లాక్‌డౌన్‌తో 70శాతం తగ్గిన కాలుష్యం 

20 శాతం పెరిగిన విద్యుత్‌ వినియోగం

కటింగ్‌ చేస్తే రూ.300 

పెరిగిన నిబంధనల ఉల్లంఘన కేసులు


నల్లగొండ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): లాక్‌డౌన్‌తో ప్రజల జీవన చిత్రం పూర్తిగా మారింది. ఆంక్షల కారణంగా బయటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యులకే కేటాయిస్తూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. దీంతో విద్యుత్‌ వినియోగం పెరిగింది. కర్ఫ్యూ వాతావరణంతో రోడ్లపైకి వాహనాలు రావడం లేదు. ఫలితంగా కాలుష్యం తగ్గింది. నిత్యావసర వస్తువులు, కూరగాయల దుకాణాలు తెరిచి ఉంచగా, మిగతావన్నీ మూతపడ్డాయి. దీంతో ఏ ఇతర వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అధికారులు ధరలపై దృష్టిపెట్టి నియంత్రిస్తున్నా, కొన్ని వస్తువుల రేట్లు పెగాయి. దుకాణాలన్నీ మూతపడటంతో కనీసం కటింగ్‌, షేవింగ్‌ చేయించుకునే పరిస్థితి లేదు. ఇంటికి పిలిపించుకొని క్షవరం చేయించుకుంటే రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. ఇక లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. 


పెరిగిన పోలీస్‌ కేసులు

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్‌డౌన్‌ తప్పనిసరి కావడంతో పోలీసులు పూర్తి స్థాయి బాధ్యతలు ఇక్కడే నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో 15రోజుల్లో పెద్ద సం ఖ్యలో నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. రోడ్లపైకి వచ్చిన వారికి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. లాక్‌డౌన్‌ను అతిక్రమించిన 37 మందిని అరెస్టు చేయగా, 700 వాహనాలు సీజ్‌ చేశారు. అక్రమ మద్యం రవాణా కింద ఐదు కేసులు, అధిక ధరలకు నిత్యవసర వస్తువులు విక్రయిస్తున్న వారిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై రెండు కేసులు నమోదయ్యాయి.


20శాతం పెరిగిన విద్యుత్‌ వినియోగం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అంతా ఇళ్లకే పరిమితం కావడంతో గృహ అవసరాలకు విద్యుత్‌ వినియోగం సాధారణ రోజులతో పోలిస్తే 20శాతం అదనంగా పెరిగింది. అదే వాణిజ్యపరంగా చూస్తే పరిశ్రమలకు గత నెలతో పోలిస్తే లాక్‌డౌన్‌ నేపథ్యంలో 40శాతం వినియోగం తగ్గింది. గత ఏడాది ఇదే నెలలో జిల్లా వ్యాప్తంగా 733 మెగా వాట్ల విద్యుత్‌ వినియోగం జరగ్గా, ఈ ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా 649 మెగా యూనిట్లకు తగ్గింది. 84 మెగా యూనిట్ల డిమాండ్‌ తగ్గింది. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూసి ఉండటం కూడా డిమాండ్‌ తగ్గడానికి కారణం. అయితే గత ఏడాదితో పోలిస్తే 20శాతం మేర గృహ విద్యుత్‌ వినియోగం పెరిగింది.


కటింగ్‌ చేస్తే రూ.300

లాక్‌డౌన్‌తో ఎవరి గడ్డాన్ని వారు చేసుకుంటున్నప్పటికీ క్షవరం సమస్యగా మారింది. లాక్‌డౌన్‌తో షాపులన్నీ మూసివేశారు. దీంతో గడ్డం, కటింగ్‌ పెరిగిన వారి నుంచి క్షురకులపై ఒత్తిడి వస్తోంది. దీంతో క్షురకులు ఇంటికి వచ్చి గడ్డం, కటింగ్‌ చేయడంతో పాటు కలర్‌ వేస్తున్నారు. క్షురకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్‌లు పెట్టుకోవడంతో పాటు శానిటైజర్లను వినియోగిస్తున్నారు. ఇంటికి వచ్చి కటింగ్‌, గడ్డం చేస్తే రూ.300 వరకు తీసుకుంటున్నారు.

   

లాక్‌డౌన్‌ నేపథ్యం లో కాలుష్యం 70 శాతం మేర తగ్గింది. లాక్‌డౌన్‌కు ముందు ప్రతిరోజు వేలాది వాహనాలు తిరగడం, పరిశ్రమల కారణంగా కాలుష్య వివిధ రూపాల్లో వెలువడేది. వాహనాలు తిరగడం వల్ల పర్టికులేట్స్‌ (ధూళి కణాలు) వెలువడతాయి. పెట్రోల్‌, డీజిల్‌ ద్వారా సల్ఫర్‌, నైట్రోజన్‌ వాయువులు వెలువడతాయి. లాక్‌డౌన్‌తో వాహనాలు లేకుండా కర్ఫ్యూ వాతావరణం ఏర్పడటంతో 70శాతం కాలుష్యం తగ్గింది. వాతావరణంలో కాలుష్యం తగ్గడం వల్ల దగ్గు, జ్వరం వంటి వ్యాధులు సహజంగానే తగ్గాయని వైద్యులు పేర్కొంటున్నారు. వాహనాలు తిరగకపోవడం వల్ల కాలుష్యం 70శాతం వరకు తగ్గిందని ఉమ్మడి జిల్లా కాలుష్య నివారణ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రాజేందర్‌              తెలిపారు. 

Updated Date - 2020-04-09T10:59:02+05:30 IST