వైభవంగా అయ్యప్ప అభరణాల ఊరేగింపు

ABN , First Publish Date - 2021-01-16T06:31:12+05:30 IST

కేరళ రాష్ట్రంలో శబరిమల అయ్యప్ప పుణ్యక్షేత్రంలో మకర సంక్రాంతి పర్వదినం రోజు నిర్వహించే మకరవిళక్కు ఉత్సవాల మాదిరిగానే గురువారం మకర సంక్రాంతిని పురస్కరించుకుని సదాశివపేటలో అయ్యప్ప స్వామి ఆభరణాలు ఊరేగింపును (మకరవిళక్కు ఉత్సవాలు) భక్తులు కన్ను పండువగా నిర్వహించారు.

వైభవంగా అయ్యప్ప అభరణాల ఊరేగింపు
సదాశివపేటలో అయ్యప్ప రథాన్ని లాగుతున్న కౌన్సిలర్‌ పులిమామిడి రాజు

సదాశివపేట, జనవరి 15 : కేరళ రాష్ట్రంలో శబరిమల అయ్యప్ప పుణ్యక్షేత్రంలో మకర సంక్రాంతి పర్వదినం రోజు నిర్వహించే మకరవిళక్కు ఉత్సవాల మాదిరిగానే గురువారం మకర సంక్రాంతిని పురస్కరించుకుని సదాశివపేటలో అయ్యప్ప స్వామి ఆభరణాలు ఊరేగింపును (మకరవిళక్కు ఉత్సవాలు) భక్తులు కన్ను పండువగా నిర్వహించారు. స్థానిక సంగమేశ్వర మందిరం నుంచి ప్రారంభమైన అయ్యప్ప ఆభరణాల ఊరేగింపు అయ్యప్ప మందిరం వరకు సాగింది. కేరళ రాష్ట్రం నుంచి వచ్చిన కళాకారులతో నిర్వహించిన పేటయ్‌ తుళ్లి ఆటలు, మహిళల కోలాటం, అయ్యప్ప దీక్షదీక్షదారుల శరణుఘోష చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అభరణాల ఊరేగింపు అనంతరం అయ్యప్ప స్వామికి విశేష పూజలు నిర్వహించి స్వర్ణాభరణాలు అలంకరించారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిల్లోడి జయమ్మ, వైస్‌ చైర్మన్‌ చింతా గోపాల్‌, కౌన్సిలర్లు పులిమామిడి రాజు, పిల్లోడి విశ్వనాథం, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మునిపల్లి సత్యనారాయణ, గురుస్వాములు గోనె శంకర్‌, ఓదెల ప్రభు, కాంగ్రెస్‌ నాయకులు కంది కృష్ణ, వేల సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.


సంగారెడ్డి పట్టణంలో

సంగారెడ్డి రూరల్‌, జనవరి 15 : మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంగారెడ్డిలో గురువారం అయ్యప్ప స్వామి బంగారు ఆభరణాలను దీక్షధారణ చేసిన స్వాములు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. సంగారెడ్డిలోని బైపాస్‌ రోడ్డులో గల అయ్యప్ప స్వామి ఆలయం నుంచి బంగారు ఆభరణాల ఊరేగింపును ప్రారంభించి ప్రధాన వీధుల గుండా పాత బస్టాండ్‌లో గల నవరత్నాలయం వరకు స్వాములు నృత్యాలు చేస్తూ చేరుకున్నారు. భక్తుల సందర్శనార్థం ఆలయంలో ప్రదర్శనకు ఉంచిన అనంతరం ఆలయంలో భద్రపరిచారు. రాత్రి 7 గంటలకు మకర జ్యోతిని స్వాములు, భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయల కమిటీ గౌరవాధ్యక్షుడు జయప్రకాష్‌ గురుస్వామి, అధ్యక్షుడు రాము గురుస్వామి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గురుస్వామి, స్వాములు నరేష్‌, రాధాకృష్ణ, మల్లేష్‌, మాణిక్‌రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-16T06:31:12+05:30 IST