4 నెలల్లో.. లక్ష కోట్లకుపైనే

ABN , First Publish Date - 2021-06-18T08:54:00+05:30 IST

భారత ప్రభుత్వం నిర్దేశించిన కొత్త ఐటీ నిబంధనలు పాటించని ట్విటర్‌ మూడున్నర నెలల్లోనే లక్ష కోట్ల రూపాయలకుపైగా నష్టపోయింది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ట్విటర్‌ షేర్లు 25.78ు పతనమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26న న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌ లో ట్విటర్‌ షేరు అత్యధికంగా

4 నెలల్లో.. లక్ష కోట్లకుపైనే

షేర్‌ మార్కెట్లో ట్విటర్‌కు నష్టమిది

22.54% పడిపోయిన షేర్లు

ట్విటర్‌పై రెండో కేసు నమోదు

సైబరాబాద్‌ పోలీసుల నోటీసులు 

‘టూల్‌కిట్‌’లో ఎండీపై విచారణ

ఘాజియాబాద్‌ కేసులో స్వరభాస్కర్‌, ట్విటర్‌ ఎండీ, జర్నలిస్టులపై ఫిర్యాదు

ట్విటర్‌ను నిషేధించం.. రూల్స్‌ పాటించాల్సిందే

కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌


న్యూఢిల్లీ, జూన్‌ 17: భారత ప్రభుత్వం నిర్దేశించిన కొత్త ఐటీ నిబంధనలు పాటించని ట్విటర్‌ మూడున్నర నెలల్లోనే లక్ష కోట్ల రూపాయలకుపైగా నష్టపోయింది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ట్విటర్‌ షేర్లు 25.78% పతనమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26న న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌ లో ట్విటర్‌ షేరు అత్యధికంగా 80.75 డాలర్లకు చేరుకుంది. బుధవారం అంటే జూన్‌ 16న అది 59.93 డాలర్ల వద్ద ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 22.54ు లేదా 13.87 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ పెట్టుబడులను కోల్పోయింది. ఈ మొత్తం లక్ష కోట్ల రూపాయలకుపైగానే.


ట్విటర్‌పై తొలి కేసు బుధవారం ఘజియాబాద్‌లో నమోదైతే.. గురువారం హైదరాబాద్‌లో ఫిర్యాదు వచ్చింది. ఓ ఫేక్‌ వీడియోను ప్రసారం చేసినందుకు సైబరాబాద్‌ పోలీసులు ఈ ఫిర్యాదు తీసుకున్నారు. ట్విటర్‌ అధికారులకు నోటీసులు కూడా ఇచ్చారు. పోలీసులను అవమానించే సీన్లు ఉన్న ఓ వీడియో కొద్ది రోజుల కిందట ట్విటర్లో తిరిగింది. దాని పై నటి మీరా చోప్రా ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని పోలీసులు కోరినా ట్విటర్‌ స్పందించలేదు. దాంతో ఆ ఫేక్‌ వీడియోలోని అసందర్భ ప్రేలాపనలకు ట్విటర్‌దే బాధ్యత అని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. దానితోపాటు, అసలు ట్విటర్లో తొలుత ఆ వీడియోను ఎవరు పోస్టు చేశారో తెలపాలని నోటీసులో కోరారు. కాంగ్రెస్‌ టూల్‌కిట్‌ కేసులో ట్విటర్‌ ఇండియా చీఫ్‌ మనీశ్‌ మహేశ్వరిని ఢిల్లీ పోలీసులు మే 31వ తేదీన విచారించారని విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌కు చెందిన బృందం బెంగళూరులో మనీశ్‌ను విచారించినట్లు వివరించాయి. ఇక, యూపీలోని ఘజియాబాద్‌లో ఓ ముస్లిం వ్యక్తిపై దాడికి సంబంధించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు నటి స్వర భాస్కర్‌, ట్విటర్‌ ఎండీ మనీశ్‌, మరో ఇద్దరిపై ఢిల్లీలో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు.


దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సి ఉంది. ఘజియాబాద్‌లో ఓ ముస్లిం వ్యక్తిపై దాడి వీడియోకు సంబంధించి స్వర భాస్కర్‌, జర్నలిస్టు అర్ఫా ఖానూన్‌, ఆసిఫ్‌ ఖాన్‌ తమ ట్విటర్‌ హ్యాండిళ్లలో ప్రజల మధ్య ద్వేషం పెంచే వ్యాఖ్యలు చేశారని, మత విద్వేషానికి, ఆ వీడియోకు సంబంధం లేదని, అవి తప్పుడు ట్వీట్లని తెలిసినా వాటి తొలగింపునకు మనీశ్‌ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాగా, వారం రోజుల కిందట ఢిల్లీ, గుర్గావ్‌ల్లోని ట్విటర్‌ ఆఫీసులకు పోలీసులు వెళ్లారు. ఒకవైపు కేసులు నమోదవుతుంటే, మరోవైపు ట్విటర్‌ ఇండియా ఎండీని విచారిస్తున్నారు.


జర్నలిస్టులపై కేసును వెంటనే ఉపసంహరించాలి: ఎడిటర్స్‌ గిల్డ్‌

ఓ ముస్లిం వ్యక్తిపై దాడికి సంబంధించిన వీడియోను సర్క్యులేట్‌ చేస్తున్నారన్న ఆరోపణపై ఘజియాబాద్‌లోని కొందరు జర్నలిస్టులపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించాలని ఎడిటర్స్‌ గిల్డ్‌ డిమాండ్‌ చేసింది. రిపోర్టింగ్‌ను నేరమయం చేయడంతోపాటు స్వతంత్ర మీడియాను వేధించడమే ధ్యేయంగా చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది.


ట్విటర్‌ను నిషేధించం: రవిశంకర్‌

ట్విటర్‌ సహా ఎటువంటి సామాజిక మాధ్యమాన్ని నిషేధించే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. అదే సమయంలో, ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. తటస్థ హోదాను ట్వి టర్‌ కోల్పోవడంపై ఆయన స్పందించారు. ‘‘మేం ట్విటర్‌కు 3 నెలల సమయమిచ్చాం. చట్ట ప్రకా రం మిగిలిన వాళ్లు చర్యలు తీసుకున్నారు. వీళ్లు తీసుకోలేదు. వాటిని పాటించకపోతే తటస్థ హోదా కోల్పోతారని చట్టంలోనే ఉంది’’ అని వివరించారు. ప్రధాని, రాష్ట్రపతి సహా సగానికి సగం సర్కారు ట్విటర్లో ఉందని, తాము ఎంత పారదర్శకంగా ఉన్నా మో చెప్పడానికి ఇది నిదర్శనమని, కానీ, నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ చర్య భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి అన్న ట్విటర్‌ వాదనను ఆయన కొట్టిపారేశారు. ‘‘భారత్‌లో 100 కోట్ల సామాజిక మాధ్యమ వినియోగదారు లు ఉన్నారు. వాళ్ల ద్వారా ట్విటర్‌ను డబ్బులు సంపాదించుకోనివ్వండి. వినియోగదారులు మమ్మల్ని విమర్శించనివ్వండి.


కానీ, లాభాపేక్ష ధ్యేయంగా ఉండే ఇలాంటి కంపెనీలు ప్రజాస్వామ్యంపై మాకు లెక్చర్లు ఇవ్వడమేంటి? భారత్‌ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయి. మేం అసోంలో గెలిచాం. బెంగాల్లో ఓడిపోయాం. స్వతంత్ర న్యాయ వ్యవ స్థ ఉంది. సర్కారును కఠిన ప్రశ్నలు అడుగుతుంది. సీనియర్‌ మంత్రులను మీడియా ప్రశ్నిస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో మీరు నిబంధనలు ఉల్లంఘించలేరు’’ అన్నారు. కేపిటల్‌ హిల్‌ అమెరికాకు గర్వ కారణం అయితే, ఎర్రకోట భారత్‌కు గర్వ కారణమని, అక్కడ ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తారని చెప్పారు. కొత్త ఐటీ నిబంధనలు వ్యక్తిగత భద్రతకు భంగకరమన్న వాదనను కొట్టిపారేశారు.

Updated Date - 2021-06-18T08:54:00+05:30 IST