అందరికీ రెండో డోసు

ABN , First Publish Date - 2021-05-06T08:41:52+05:30 IST

రాష్ట్రంలో తొలిడోసు వ్యాక్సిన్‌ వేయించుకున్న ప్రతి ఒక్కరికీ సెకండ్‌ డోసు అందిస్తామని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు

అందరికీ రెండో డోసు

వ్యాక్సిన్‌ మొత్తం సెకండ్‌ డోసు వారికే

నెల్లూరుకు శ్రీహరికోట నుంచి ఆక్సిజన్‌

ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్‌


అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొలిడోసు వ్యాక్సిన్‌ వేయించుకున్న ప్రతి ఒక్కరికీ సెకండ్‌ డోసు అందిస్తామని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఏపీఐఐసీ భవనంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యాక్సిన్‌ రెండో డోసు వేయడం లేదన్న భయం, ఆందోళన అక్కర్లేదని భరోసా ఇచ్చారు. ఈ నెలలో కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసే టీకాలను రెండో డోసుకు వినియోగిస్తామని చెప్పారు. రెండో డోసు పూర్తయిన తర్వాత మిగిలితే మళ్లీ మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రులు, అనుమతి పొందిన ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌ కొరత లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామన్నారు. గడిచిన 24 గంటల్లో 387 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు సప్లయ్‌ చేశామని చెప్పారు. ఆక్సిజన్‌ కొరత రాబోతున్నదని నెల్లూరు జిల్లాలో ఆస్పత్రులు కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగానే.. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 12 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ సకాలంలో అందజేస్తామన్నారు.   


కర్ఫ్యూపై కలెక్టర్లతో సమీక్ష..

రాష్ట్రంలో బుధవారం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నామని ఏకే సింఘాల్‌ తెలిపారు.  కొవిడ్‌ మార్గదర్శకాలపై జిల్లా కలెక్టర్లతో ఏ రోజుకారోజు సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లో బ్యాంక్‌లు పని చేయాలన్నారు. ఇతర దేశాల నుంచి వస్తున్న విరాళాలను కేంద్రం రాష్ట్రాలకు అందిస్తుందని, దీనికోసం ప్రతి రాష్ట్రం ఒక నోడల్‌ అధికారిని నియమించిందన్నారు. ఏపీకి 4,879 రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు, 2,107 ఆక్సిజన్‌ పరికరాలు, 1.92 లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను కేంద్రం అందజేసిందన్నారు. 

Updated Date - 2021-05-06T08:41:52+05:30 IST