Abn logo
May 27 2020 @ 00:43AM

వరుస కష్టాలు

కరోనా కాలంలో ఎండలు ప్రజలను మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. ఉత్తరభారతం నుంచి వీస్తున్న వేడిగాలులతో ఉష్ణోగ్రతలు తీవ్రమై తెలుగు రాష్ట్రాలు మాడిపోతున్నాయి. ఆంఫన్‌ తుపాను పోతూపోతూ ఉన్న కాస్తంత తేమను తీసుకుపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమని అంటున్నారు. ఎండ తీవ్రతకు ఉపాధి హామీ కూలీలు, చిరువ్యాపారులు, పేదలు అల్లాడిపోతున్నారు. వడగాడ్పుల తీవ్రత కొనసాగుతుందనీ, భయంకరమైన వేడిమిని కొద్దిరోజులు భరించక తప్పదని వాతావరణశాఖ చెబుతున్నది. రాష్ట్రాలన్నీ కరోనా మీదా, అది తెచ్చిపెట్టిన సమస్యలమీదా దృష్టిసారించి ఉన్న తరుణంలో, ప్రజలను ప్రమాదంలో పడవేస్తున్న ఈ అధిక ఉష్ణోగ్రతల బాధ పాలకులకు పట్టడం లేదు. ప్రజలు రుతుపవనాల రాకకోసం ఎదురుచూడవలసిందే.


ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీలు దాటితే ఏయే పేర్లతో అధికారికంగా వర్గీకరిస్తారన్నది అటుంచితే, సత్వర చర్యలకు బాధ్యతపడాల్సి వస్తుంది కనుక యాభైడిగ్రీలు దాటినా ప్రభుత్వాలు దానిని అధికారికంగా అంగీకరించవని తెలిసిందే. అత్యధిక ఉష్ణోగ్రతలతో, వేడిగాలులతో దేశంలోని చాలా రాష్ట్రాలు అతలాకుతలమైపోతున్నా కూడా ప్రభుత్వాలు ఉపశమన చర్యలకు సంకల్పించని స్థితి ప్రస్తుతం ఉన్నది. వాతావరణ మార్పుల ప్రభావంతో గత కొద్దిసంవత్సరాలుగా మనదేశంలో వడగాడ్పులు హెచ్చాయి. గత ఏడాది 23 రాష్ట్రాల్లో ఎండలు మండి, వేడిగాలులు వీచాయి. అంతకుముందు సంవత్సరం కంటే కనీసం ఐదారు రాష్ట్రాలు కొత్తగా ఈ మార్పు చవిచూశాయి. గత ఏడాదికంటే ఈ ఏడు వడగాడ్పులు నమోదైన రోజుల సంఖ్య కాస్తంత తక్కువే ఉండవచ్చును కానీ, ప్రతీ ఏటా దేశం ఈ సమస్య తీవ్రస్థాయిలో చవిచూస్తున్నదే.


ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం వడదెబ్బతో ఏటా ఐదారువేల మంది మరణిస్తూనే ఉంటారు. అయితే, ఈ లెక్కలేవీ తీవ్రమైన ఎండలకారణంగా సంభవించే వాస్తవిక మరణాలను తెలియచెప్పేవి కావు. శరీరం అతిగా వేడెక్కి అవయాల పనితీరును దెబ్బతీసినందునో, గుండెపోటు వంటివి వచ్చినందువల్లనో మరణించినవారు వడగాడ్పు మృతుల జాబితాలోకి ఎక్కడం లేదు. జాతీయ విపత్తు చట్టం కానీ, ప్రకృత్తి విపత్తుల నిర్వహణా విధానం కానీ వడగాడ్పులను ప్రకృతి వైపరీత్యాల్లో ఒకటిగా గుర్తించకపోయినప్పటికీ, రాష్ట్రాలు అమలు చేసేందుకు వీలుగా ఎన్డీఎమ్‌ఏ కొన్ని మార్గదర్శకాలనైతే రూపొందించింది. ముందస్తు హెచ్చరికలు, వైద్యబృందాలను సిద్ధం చేయడం, షెల్టర్లు ఏర్పాటు చేసి కనీస సౌకర్యాలు కల్పించడం వంటివి ఇందులో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు కొంతమేరకు వీటి మీద దృష్టిపెట్టినా, అత్యధిక రాష్ట్రాలు ఈ మార్గదర్శకాలను గాలికి వదిలేశాయి. ఇక ఈ ఏడాది కరోనా కమ్ముకొచ్చిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలదీ ఒకే తీరు. ఆర్థికకష్టాల్లో పీకలోతుగా మునిగి ఉన్నందున వడగాడ్పులనుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యతనే విస్మరించాయి. 


వడగాడ్పులకు తోడు ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాలను రాకాసి మిడతలు భయపెడుతున్నాయి. గుంపులు గుంపులుగా ఖండాలు దాటివచ్చిన ఈ మిడతలు లక్షలాది ఎకరాల్లో పంటను నాశనం చేస్తున్నాయి. ఈ మిడతల దండుపై పోరాటానికి పాకిస్థాన్‌ ఫిబ్రవరిలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. పాక్‌ వైఫల్యంతో ఇప్పుడవి రాజస్థాన్‌, గుజరాత్‌, పంజాబ్‌ల మీదుగా గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లో ప్రవేశించి లక్షల ఎకరాల పంటను నమిలేస్తున్నాయి. గత పాతికేళ్ళలో ఎన్నడూ లేనంత ఎక్కువ తీవ్రతతో ఈ దాడి జరుగుతున్నందున, పెద్దపెద్ద చప్పుళ్ళతో వాటిని తరిమికొట్టడం అసాధ్యమైపోతున్నది. అగ్నిమాపక యంత్రాలతో మందులు పిచికారీ చేయిస్తున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో, ద్రోన్లను ఉపయోగించడానికి కొన్ని రాష్ట్రాలు కేంద్రం అనుమతి తీసుకున్నాయి. పచ్చగా కనిపించే ప్రతీ పంటను కడుపారా ఆరగిస్తూ, వేగంగా సంతానోత్పత్తి చేయగల ఈ మిడతల దండును సాధ్యమైనంత వేగంగా ఎదుర్కోకపోతే, వాటి విస్తరణను నిలువరించలేకపోతే దేశం అపారమైన ఆహార నష్టం చవిచూడాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాలకూ ఈ మిడతలు విస్తరించవచ్చునన్న అనుమానాలను అటుంచితే, జులైనాటికి దేశంలోకి మరిన్ని గుంపులు కొత్తగా వచ్చిపడతాయన్న అంచనాలు మరింత భయపెడుతున్నాయి. చైనా కరోనాతో పాటు తూర్పు ఆఫ్రికా మిడతలు, మండుతున్న ఎండలు మన సహనాన్నీ, సమర్థతనూ పరీక్షిస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement