మావోలకు ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2021-08-13T05:59:08+05:30 IST

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలోని..

మావోలకు ఎదురుదెబ్బ

పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి సుధీర్‌ సహా ఆరుగురు మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగుబాటు

విశాఖ మన్యంలో కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం

గాలికొండ కమిటీ గతంలోనే నిర్వీర్యం

నాలుగేళ్లలో పలు ఎదురుకాల్పుల్లో 40 మందిని కోల్పోయిన మావోయిస్టు పార్టీ

అరెస్టులు, లొంగుబాట్లతో బలహీనం


పాడేరు(విశాఖపట్నం): ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలోని విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు పార్టీ బలహీనపడుతోందా?...ఎన్‌కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్ల కారణంగా కొద్దికాలం నుంచి అంతంతమాత్రంగా సాగుతున్న కార్యకలాపాలు మరింత నెమ్మదించనున్నాయా?... మన్యంలో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పలు సంఘటనలు ఈ ప్రశ్నలకు తావిస్తున్నాయి.


దేశంలో ఛత్తీస్‌గఢ్‌ తర్వాత ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి పట్టున్నట్టు చెబుతుంటారు. ఒడిశాకు ఆనుకుని వున్న పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాలతోపాటు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీకి ఆనుకుని వున్న కొయ్యూరు మండలంలో గతంలో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉండేవి. జీకే వీధి, కొయ్యూరుతోపాటు పక్కనే వున్న తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో గాలికొండ కమిటీ, విశాఖ జిల్లాలోని పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, చింతపల్లి, హుకుంపేట మండలాల పరిధిలో పెదబయలు-కోరుకొండ కమిటీలు పనిచేసేవి. అయితే గత నాలుగేళ్లలో ఈ రెండు కమిటీల పరిధిలో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో సుమారు 40 మందికిపైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఈస్టు డివిజన్‌కు ఆయువుపట్టుగావున్న గాలికొండ ఏరియా కమిటీ...ఎదురుకాల్పులు, లొంగుబాట్లతో బాగా బలహీనపడింది. 2017 అక్టోబరులో ఒడిశా సరిహద్దులోని రామ్‌గఢ్‌ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 30 మందికిపైగా మావోయిస్టులు మృతిచెందారు.


వీరిలో ఏవోబీపై పట్టున్న అగ్ర నేతలు ఉన్నారు. మూడేళ్ల కిందట కొయ్యూరు సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి ఆజాద్‌, మరో దళ సభ్యుడు మరణించారు. 2019 డిసెంబర్‌లో తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దులోని జీకే వీధి మండలం ధారకొండ నేలజర్త, గుమ్మిరేవులు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో డీసీఎం, ఏసీఎంతోపాటు ముగ్గురు దళ సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది జూన్‌ నెల 16న కొయ్యూరు మండలం తీగలమెట్ట ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఈస్టు డివిజన్‌కి చెందిన ఇద్దరు డీసీఎంలు, ఒక ఏసీఎం, ముగ్గురు మహిళా దళ సభ్యులు మృతిచెందారు. 


నేతల లొంగుబాట్లు, అరెస్టులు

ఏవోబీలో సుదీర్ఘకాలం పనిచేసిన అగ్రనేతలు లొంగుబాట పట్టడం కూడా మావోయిస్టు పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇటీవల ఏవోబీ ఎస్‌జడ్‌సీ సభ్యుడు కృష్ణ, డీసీఎం నవీన్‌ లొంగిపోయారు. పది నెలల క్రితం కుంకుంపూడిలో గెమ్మెలి హరిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా పెదబయలు-కోరుకొండ ఏరియా, ఒడిశాలోని కలిమెల ఏరియా కమిటీలకు చెందిన ఆరుగురు మావోయిస్టులు గురువారం అమరావతిలో డీజీపీ గౌతం సవాంగ్‌ ముందు లొంగిపోయారు. వీరిలో పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి చిక్కుడు చిన్నారావు అలియాస్‌ సుధీర్‌, ఏరియా కమిటీ సభ్యులు వంతాల పన్ను అలియాస్‌ మహిత, మడకం సోమిడి, మడకం మంగ్లు, కలిమెల ఏరియా కమిటీ సభ్యులు పోయం రుకిని అలియాస్‌ రింకీ, సోడే భీమ్‌ ఉన్నారు. వీరిలో చిన్నారావు అలియాస్‌ సుధీర్‌ లొంగుబాటు పార్టీకి తీరని నష్టమని పోలీసులు భావిస్తున్నారు. పెదబయలు మండలం ఇంజెరి పంచాయతీ కోండ్రుం గ్రామానికి చెందిన సుధీర్‌...తన బంధువులను సైతం మావోయిస్టు పార్టీలో చేర్చాడు.


డీజీపీ ఎదుట లొంగిపోయిన వంతాల పన్ను అతనికి సమీప బంధువు. పోలీసులు తొలుత సుధీర్‌ను తమ వైపునకు లాక్కుని, ఆయన ద్వారా మిగిలిన సభ్యులు లొంగిపోయేలా చేశారు. సుధీర్‌కు పెదబయలు మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే అతను పార్టీ నుంచి బయటకు రాగానే ఈస్ట్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి అరుణ తీవ్రంగా స్పందించారు. కాగా సుధీర్‌, మరో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోవడంతో పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ కనుమరుగైనట్టేనని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2021-08-13T05:59:08+05:30 IST