కరోనా సెకండ్‌ వేవ్‌..!

ABN , First Publish Date - 2021-05-12T05:43:41+05:30 IST

సీన్‌ ఓపెన్‌ చేస్తే ఎవర్ని ఎటాక్‌ చేద్దామా అని ‘కరోనా’ వెతుకుతుంటుంది. ఖాళీ వీధులు, పార్కులు చూసి నీరసించిపోతుంది. ఇంతలో ఓ ముగ్గురు కుర్రాళ్లు ఉల్లాసంగా నడుచుకొంటూ వస్తుంటారు....

కరోనా సెకండ్‌ వేవ్‌..!

సీన్‌ ఓపెన్‌ చేస్తే ఎవర్ని ఎటాక్‌ చేద్దామా అని ‘కరోనా’ వెతుకుతుంటుంది. ఖాళీ వీధులు, పార్కులు చూసి నీరసించిపోతుంది. ఇంతలో ఓ ముగ్గురు కుర్రాళ్లు ఉల్లాసంగా నడుచుకొంటూ వస్తుంటారు. వారిని చూడగానే కరోనాకు ప్రాణం లేచొస్తుంది. ఆ ముగ్గురినీ ఫాలో అవుతుంటుంది. వెనకాల కరోనాను చూడగానే వాళ్ల వెన్నులో వణుకు పుడుతుంది. దాని నుంచి తప్పించుకోవడానికి భయంతో పరుగు అందుకొంటారు. కరోనా వదలదు. అంతే వేగంగా వెంటపడుతుంది. చివరికి ఇంట్లోకి దూరి గేటు మూసేస్తారు. దొరికారనుకుని కరోనా ముందుకు వస్తుండగా.. ఇంతలో దానికి అడ్డుగా వచ్చి వారికి అండగా నిలబడుతుంది ‘ఇమ్యూనిటీ’. ఇది చూసి కరోనా కంగారు పడుతుంది. తన బలమేమిటో, కరోనాను కట్టడి చేయడంలో తీసుకొంటున్న జాగ్రత్తలేమిటో ఒక్కొక్కటిగా కరోనాకు చూపిస్తుంది. ఈ క్రమంలో ఇమ్యూనిటీ ఒక చిటికె వేయగానే... ఆ ముగ్గురూ చేతులు శానిటైజ్‌ చేసుకొంటారు. రెండో చిటికెకు చేతిలో దీపాలతో ప్రత్యక్షమవుతారు. మూడో చిటికెకు చెంచాలతో కంచాలను కొడుతుంటారు.


తరువాత ముఖానికి మాస్క్‌లు వస్తాయి. లాక్‌డౌన్‌తో దుకాణాలు, ఎంటర్‌టైన్‌మెంట్లు అన్నీ బంద్‌. రోడ్డుపై ఒక్క పురుగూ కనిపించదు. ఇవన్నీ తట్టుకోలేక, బతకడానికి కాంటాక్ట్‌లు దొరక్క కరోనా అక్కడే కుప్పకూలిపోతుంది. దీంతో ఆ ముగ్గురు కుర్రాళ్లు కరోనా వెళ్లిపోయిందని సంబరాలు చేసుకొంటారు. ‘అరే తమ్ముళ్లూ... ఎందుకంత ఆనందపడతారు! కరోనా తగ్గిందంతే! పూర్తిగా పోలేదు’ అంటుంది ఇమ్యూనిటీ. ‘అదే పోద్దిలే అక్క’ అంటాడు ఒకడు. ‘నా మాట వినండిరా’ అని ఇమ్యూనిటీ చెప్పేలోపు... ‘యహే ఊరుకో! ఇప్పటిఏ ఐదారు నెలల నుంచి ఇంట్లోనే మగ్గిపోతుంటే! అవుటింగ్‌కు పోదాం రండిరా’ అంటాడు ఇంకొడు. ‘అరేయ్‌... అర్థం చేసుకోండిరా. అది మహమ్మారి. ఒక్కడికి వచ్చినా ఆటాడేసుకొంటది’ అంటుంది ఇమ్యూనిటీ! ‘ఏం మాట్లాడుతున్నావక్కా..! మా దగ్గర ఆంధ్రా పేరాసెటమాల్‌, తెలంగాణ బ్లీచింగ్‌ పౌడర్‌ ఉన్నాయి. ఆ రెండూ ఉంటే కరోనాతో సహజీవనం చేయడానికి కూడా మేము రెడీ’ అంటాడు ఇంకొకడు. ‘నా మాట వినండిరా’ అని ఇమ్యూనిటీ మొత్తుకొంటున్నా పట్టించుకోకుండా ముగ్గురూ మందు పార్టీలో మునిగిపోతారు. మధ్యలో ఆకలేస్తే ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తారు. తినడం అయిపోగానే ‘సినిమాకి వెళ్లి ఎన్ని రోజులైందిరా’ అంటూ థియేటర్‌కు వెళదామని ప్లాన్‌ చేసుకొంటారు. క్లబ్‌లు, పబ్‌లు, బార్లు, మాల్స్‌, బస్సులు, రైళ్లు... అన్నీ నడవడం మొదలైపోయాయి. ఎక్కడ చూసినా జనమే జనం. కొన ఊపిరితో ఉన్న కరోనాకు మళ్లీ ఊపిరి వస్తుంది. ‘మా దేవుడు ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యాడు. మేము వెళ్లి తీరాలి’ అంటూ ఇమ్యూనిటీ వద్దని చెప్పినా వినకుండా ఆ ముగ్గురు కుర్రాళ్లూ బయలుదేరుతారు. మూడు రోజుల తరువాత సీన్‌ మారిపోతుంది. ఇమ్యూనిటీ దూరమై కుర్రాళ్లు దగ్గు, తుమ్ములు, జ్వరంతో అల్లాడుతూ మంచాన పడతారు. ఈ సన్నివేశాలు ‘కరోనా సెకండ్‌వేవ్‌ వై’ లఘుచిత్రంలోనివి. 


ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా! ఏడాది కిందట మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేసి మళ్లీ విలయం సృష్టిస్తున్న కరోనా నేపథ్యంలో సామాజిక చైతన్యం కలిగించే కథనంతో ముందుకొచ్చింది ‘ఆర్‌ మీడియా’. మాస్క్‌లు, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత, రోగనిరోధకశక్తి తదితర అంశాలనే కథాంశంగా మలిచి, వాటిని పాత్రల్లో చొప్పించి ఈ షార్ట్‌ఫిలిమ్‌ను తెరకెక్కించింది. వినోదాత్మకంగా తీసిన ఈ చిత్రాన్ని ‘కిరాక్‌ పోరీ’ చానల్‌ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. 

Updated Date - 2021-05-12T05:43:41+05:30 IST