Abn logo
Apr 9 2021 @ 00:16AM

ఆశల వసంతం, నైరాశ్య శీతవేళ

‘అదిఒక వైభవోజ్వల మహాయుగం, వల్లకాటి అధ్వాన్నశకం; అది ఒక వివేకం వికసించిన తరం, మూఢత్వం కరడుగట్టిన కాలం; అది ఒక విశ్వాసం అతిశయించిన తరుణం, నమ్మశక్యం గాని యుగం; అది ఒక వెలుగు వెల్లువెత్తిన ఋతువు, తిమిరం ఆవహించిన సమయం; అది ఒక ఆశల వసంతం, నైరాశ్య శీతవేళ’- 19వ శతాబ్డి నడిమి రోజుల బ్రిటన్ గురించి జగత్ప్రసిద్ధ నవలాస్రష్ట చార్లెస్ డికెన్స్ (1812–70) రచన ‘ఏ టేల్ ఆఫ్ టు సిటీస్’ (1850) ఆరంభ వ్యాఖ్యలవి. నాటి బ్రిటన్ వలే నేటి 21వ శతాబ్ది భారత్ తన సొంత డికెన్సియన్ వేడుక, వేదనలలో చిక్కుకున్నట్టుగా కనిపిస్తోంది. కాలంలోకి జారిపోయిన 2020, భవిష్యత్తుపై ఎటువంటి భరోసాకు ఆస్కారం లేని సంవత్సరమయితే, నడుస్తున్న 2021 ఆశా నైరాశ్యాలు ఒకటి విడిచి మరొకటి మన జీవితాలలోకి తెగబడుతున్న సంవత్సరంగా అగుపించడం లేదూ? ఈ ఏడాది తొలినాళ్ళలో ఒక మహా విపత్తు ముగిసిపోనున్నదనే ఆశాభావం మన జీవితాలలో ఒక మహోల్లాసాన్ని విరజిమ్మింది. అయితే ఇప్పుడు ‘రెండో’ కరోనా అల మనపై విరుచుకుపడి ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా ఆ ఆశాభావం గతించి, ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. కొవిడ్–19 కేసులు మళ్ళీ రోజుకు లక్షకు పైగా పెరిగిపోతున్నాయి. ఇంత కలవర పరిస్థితులలోనూ, చెంతనే ఒక మహమ్మారి తమ కోసం వేచిఉన్నదనే భయానక వాస్తవాన్ని మరచిపోయి నానా వేడుకలు, ముఖ్యంగా ఎన్నికల ప్రచార కోలాహలంలో అసంఖ్యాకులు లీనమైపోయారు! 


అవును, వేలాది జనులు గుమిగూడే ఎన్నికల సభలలో మాస్క్ ధరించడంపై శ్రద్ధ చూపుతున్నవారు ఎంతోమంది ఉండడం లేదు. హరిద్వార్‌లో సాధువులు, భక్తజనులు మహాకుంభమేళా ఆనందోత్సాహాలలో మునిగిపోయిఉన్నారు. ముంబైలో వార్షిక క్రికెట్ ఉత్సవం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవనున్నది. క్రికెట్ అభిమానులు కరోనా మహమ్మారికి జడుస్తారా? కొవిడ్ కష్టకాలంలో విధిగా అనుసరించాల్సిన ప్రవర్తనా నియమావళిని వీరంతా పూర్తిగా విస్మరిస్తున్నారు. ఆ నియమావళిని పాటించేలా సామాన్య పౌరులను పలువిధాల బలవంతం చేస్తున్నారు. మన ఆలోచనలను మళ్ళీ ‘లాక్‌డౌన్’ భయాలు పునారావహిస్తున్నాయి. మీరు జీవభద్రతా పరిసరాలలో నివసించే వివిఐపి నేత, ఆధ్యాత్మిక గురువు లేదా క్రికెట్ స్టార్‌ కాని పక్షంలో మీకు నానా యాతనలు తప్పవు మరి. ఒక వివాహవేడుకకు యాభై మందిని మించి ఆహ్వానించకూడదు. అయితే ఒక రాజకీయ ర్యాలీలో లేదా మతపరమైన ఉత్సవంలో వేల మంది పాల్గొంటున్నారు! 


మహారాష్ట్ర వలే మరే రాష్ట్రమూ ఇంతవరకు కరోనా భారినపడలేదు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులలో సగం ఆ రాష్ట్రంలోనే లెక్క తేలుతున్నాయి. కొవిడ్ ఉపద్రవం సతమతం చేస్తుండగా మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం వెంటిలేటర్ పైకి చేరింది. కూటమి ‘బిగ్‌బాస్’, ఎన్‌సిపి నాయకుడు శరద్ పవార్ శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు.. కేంద్రమంత్రి అమిత్ షాతో ఒక రహస్యవిందు సమావేశంలో పాల్గొన్నారన్న వార్తలు బయటకు పొక్కిన ఒకటి రెండు రోజులకు పవార్ ఆసుపత్రిలో చేరడం గమనార్హం. బలవంతపు వసూళ్ళు చేయాలని రాష్ట్ర హోం మంత్రి (ఇప్పుడు ఈ మహాశయుడు పదవికి రాజీనామా చేశారు) తనను ఆదేశించినట్టు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ ఆరోపించిన నేపథ్యంలో ఈ వింత రాజకీయ పరిణామాలు జరిగాయి. శరద్‌పవార్, అమిత్ షాల చాణక్య వ్యూహాలు ఏమిటో గానీ, ఇది కొవిడ్ మహమ్మారిని సమైక్యంగా ఎదుర్కోవలసిన సందర్భమిది. కుట్రలు, కుహకాలకు తావివ్వకూడని సమయమిది. 


కొవిడ్‌తో కుదేలయిన దేశ ఆర్థికవ్యవస్థను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు మన రాజకీయ నాయకులు సంపూర్ణ శ్రద్ధ చూపాలని మీరు భావిస్తున్నారా? మంచిదే. కానీ అలా జరుగుతుందా? ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను త్వరితంగా ముగించారు. చాలామంది కేంద్రమంత్రులు న్యూఢిల్లీలో కాకుండా బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆరునూరైనా బెంగాల్‌ను కైవసం చేసుకునేందుకు బీజేపీ కృతనిశ్చయంతో ఉన్నది. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం పార్టీ ప్రయోజనాలను నెరవేర్చేందుకు ప్రాధాన్యమిస్తోంది. కోల్‌కతాను సొంతం చేసుకునే వరకు పాలన, విధానపరమైన నిర్ణయాలకు తొందరపడవలసిన అవసరం లేదని న్యూఢిల్లీ పాలకులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రధానమంత్రి సుహృద్భావ యాత్ర బెంగాల్లో ఎన్నికల ప్రయోజనాలు సాధించుకోవడమే లక్ష్యంగా సాగింది. 


ఆర్థికవ్యవస్థ వేగవంతంగా పునరుద్ధరణ అవుతోందని టీవీ స్టూడియోల్లో ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. వ్యాపారవేత్తలు ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందని ఢంకా బజాయిస్తున్నారు. వాస్తవమేమిటి? కేరళ నుంచి అసోం దాకా ప్రయాణించండి. సర్వత్రా కనిపించే ఒక ఉమ్మడి అంశం ప్రజల ఆర్థికదురవస్థ. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికుల దైన్య బతుకులు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ వ్యాఖ్యను తప్పక గుర్తు చేసుకోవాలి: ‘మనం బిఎస్‌ఇ, ఎమ్‌ఎస్‌ఇ గురించి ఆందోళన చెందుతున్నాం. అయితే ఎమ్ఎస్ఎమ్ ఈ గురించి పట్టించుకుంటున్న దెవరు?’


కొవిడ్ కష్టకాలంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఉద్యోగాలు మటుమాయమవుతున్నాయి కార్మికులు, మధ్యతరగతి ప్రజల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మరింత నగదు అందిస్తామని హామీ ఇస్తున్నాయి. అయితే బీజేపీ ప్రచారం మాత్రం మళ్ళీ మతకేంద్రితంగా ఉంది. హిందూ-ముస్లిం విభజనకు ప్రాధాన్యమిస్తోంది. అసోంలో సుగంధ తైలాల వ్యాపారి, పార్లమెంటు సభ్యుడు బద్రుద్దీన్ అజ్మల్‌ను ఒక ‘శత్రుతుల్యుడైన’ వ్యక్తిగా బీజేపీ పరిగణిస్తోంది. కేరళలో ‘లవ్ జిహాద్’ గురించి ఘోషిస్తోంది. శబరిమల, హిందూ ఆచారాల గురించి మాట్లాడుతోంది. ముస్లింలను బుజ్జగించడం, చర్చ్ తన హక్కుల గురించి పట్టుపట్టడం సమాజంలో సామరస్యాన్ని భగ్నం చేస్తాయని బీజేపీ విమర్శిస్తోంది. బెంగాల్లో మత పరమైన చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ తన ‘గోత్రం’ గురించి చెప్పుకోవలసివచ్చింది. చండీ స్తోత్రాలను కూడా ఆమె వల్లె వేశారు. తమిళనాడులో మాత్రం బీజేపీ మతాన్ని ఎన్నికల పాచికగా ఉపయోగించుకోవడం లేదు. జయాపజయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసేంతగా ఆ రాష్ట్రంలో ముస్లిం జనాభా లేకపోవడమే అందుకు కారణమని చెప్పితీరాలి. 


‘ప్రతిపక్షాలు లేని భారత్’ ఎజెండాను విజయవంతం చేసేందుకు బీజేపీ కృతనిశ్చయంతో ముందుకు సాగుతుండగా ప్రతిపక్షాలు తమను తాము సరిగా కాచుకోలేకపోవడం శోచనీయం. కాంగ్రెస్ పార్టీకి పూర్తికాలం పని చేసే అధ్యక్షుడు లేడు. ఒకటి రెండు రాష్ట్రాలనైనా గెలుచుకోవాలని ఆ పార్టీ ఆశిస్తోంది. ఆ విజయాన్ని సమకూర్చగలరని రాహుల్ గాంధీపై కాంగ్రెస్ వాదులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన డైవింగ్ నైపుణ్యాలు, అయికిడో కౌశల్యాలు ప్రదర్శించడం పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. కాంగ్రెస్ బాధ్యతలను పూర్తిస్థాయిలో చేపట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తెలియదు. ఆయన సోదరి ప్రియాంక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఆమె భావి పాత్ర ఏమిటనేది అనిశ్చితంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పూర్వ ప్రతిష్ఠను ఆకాంక్షిస్తోంది. అయితే అందుకు ఒక క్రమ పద్ధతిలో పనిచేయడంపై కాకుండా అదృష్టాన్ని నమ్ముకుంటోంది. 


బెంగాల్‌లో తనను తాను ‘బెంగాల్ పులి’గా ప్రకటించుకున్న మమత గుజరాత్ నుంచి వచ్చిన ‘బయటి వ్యక్తుల’పై శక్తివంచన లేకుండా పోరాడుతోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన ‘దాడి’లో తన కాలికి తీవ్రగాయమయినందున కట్టు కట్టుకుని చక్రాల బండిలో కూర్చుని మరీ ఆమె ప్రచారం చేస్తున్నారు. ఆమె ఆశిస్తున్నట్టు ప్రజల సానుభూతి లభిస్తుందా? దీదీనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సరే, ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందా? లేదు అని చెప్పితీరాలి. కేంద్రంలోని అధికార పార్టీకే అన్ని విధాల అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. 


ఉత్తర భారతావనిలో పలు ప్రాంతాలలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళన ప్రారంభమై ఇప్పటికే నాలుగునెలలకు పైగా గడిచిపోయింది. ఆశ్చర్యమేమిటంటే కొత్త సాగుచట్టాల రద్దుకోసం ఉద్యమిస్తోన్న ఉత్తర భారతావని రైతులోకంలో కొవిడ్ కేసుల పెరుగుదల వినరావడం లేదు. డిజైనర్ దుస్తులు ధరించే పట్నంబాబుల కంటే పల్లెబిడ్డలకు కరోనా వైరస్‌ను ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉందా? ఉండచ్చు, ఉండకపోవచ్చు గానీ 2021 భారత్‌లో ‘కుచ్ భీ హో సక్తా హై!’ (ఏదైనా సంభవించగలదు సుమా!)

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Advertisement
Advertisement
Advertisement