అపర నక్షత్రకుడు, ఆబాల‘గోపాల’ రంజకుడు

ABN , First Publish Date - 2020-02-10T09:07:47+05:30 IST

‘నక్షత్రకుడ’ంటే గోపాలం, గోపాలం అంటే ‘నక్షత్రకు’డన్నట్టుగా రంగస్థల పద్యనాటక లోకంలో రసజ్ఞ ప్రేక్షకులను అర్ధశతాబ్దం పైగా అలరిస్తూ నూతన శకాన్ని సృష్టించిన సిక్కోలు బిడ్డ యడ్ల గోపాలం. టీవీ, సినిమా రంగాల పోటీ తట్టుకొని, నేటికీ...

అపర నక్షత్రకుడు, ఆబాల‘గోపాల’ రంజకుడు

‘నక్షత్రకుడ’ంటే గోపాలం, గోపాలం అంటే ‘నక్షత్రకు’డన్నట్టుగా రంగస్థల పద్యనాటక లోకంలో రసజ్ఞ ప్రేక్షకులను అర్ధశతాబ్దం పైగా అలరిస్తూ నూతన శకాన్ని సృష్టించిన సిక్కోలు బిడ్డ యడ్ల గోపాలం. టీవీ, సినిమా రంగాల పోటీ తట్టుకొని, నేటికీ పద్యనాటక వైభవాన్ని తన నటనా వైదుష్యం ద్వారా, తన గాన కౌశలం ద్వారా ప్రేక్షక మహాశయులకు రుచి చూపిస్తూ ముందుకు పోవడం గోపాలం కృషి, పట్టుదలకు నిదర్శనం. ‘‘దంతావళమ్ముపయి బలవంతు డొక్కండు నిలిచి’’ అన్న పద్యాన్ని ఊపిరి బిగబట్టి అరగంటసేపు గోపాలరావు ఆలాపన చేస్తుంటే, ఆనంద పరవశులై మైమరిచిపోయిన జనం చప్పట్లతో ఈలలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతుంది. ఆయన నక్షత్రక పాత్రలో లీనమై అభినయిస్తుంటే అపర నక్షత్రకుడే భువికి దిగి వచ్చాడా అన్న చందంగా ఉంటుంది.

యడ్ల గోపాలరావుకి పద్మశ్రీ పురస్కారం ప్రకటించటంతో యావదాంధ్ర పద్య నాటక సమాజం పరవశించింది. గతంలో ఎంతో మంది లబ్దప్రతిష్టులైన రంగస్థల పద్యనాటక కళాకారులకు పద్మ పురస్కారాలు లభించి ఉండవచ్చు. కానీ నేడు శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలం, మందరాడ గ్రామంలో ఒక సామాన్య, వెనుకబడిన రైతు కుటుంబంలో జన్మించిన యడ్ల గోపాలరావు గారిని ‘పద్మశ్రీ’ అవార్డు వరించడం అద్వితీయం. 


‘నక్షత్రకుడ’ంటే గోపాలం, గోపాలం అంటే ‘నక్షత్ర కు’డన్నట్టుగా రంగస్థల పద్యనాటక లోకంలో రసజ్ఞ ప్రేక్షకులను అర్ధశతాబ్దంపైగా అలరిస్తూ నూతన శకాన్ని సృష్టించిన సిక్కోలు బిడ్డ యడ్ల గోపాలం. టీవీ, సినిమా రంగాల పోటీ తట్టుకొని, నేటికీ పద్యనాటక వైభవాన్ని తన నటనా వైదుష్యం ద్వారా, గానకౌశలం ద్వారా ప్రేక్షక మహాశ యులకు రుచి చూపిస్తూ ముందుకు పోవడం గోపాలం పట్టుదలకు నిదర్శనం. ‘‘దంతావళమ్ము పయి బలవంతుడొక్కండు నిలిచి’’ అన్న పద్యాన్ని ఊపిరి బిగబట్టి అరగంటసేపు గోపాలరావు ఆలాపన చేస్తుంటే, ఆనందపరవశులై మైమరిచి పోయిన జనం చప్పట్లతో ఈలలతో ఆ ప్రాంత మంతా మార్మోగిపోతుంది. ఆయన నక్షత్రక పాత్రలో లీనమై అభినయిస్తుంటే అపర నక్షత్ర కుడే భువికి దిగి వచ్చాడా అన్న చందంగా ఉంటుంది. తన పద్య రాగాలాపనతో జనాన్ని ఇట్టే పడేయగల దిట్ట గోపాలం. నాటకరాజమైన ‘హరిశ్చంద్ర’లో డి.వి.సుబ్బారావు, చీమకుర్తి నాగే శ్వరరావు, బండారు రామారావు, ఆచంట వెంకట రత్నం నాయుడు, మల్కా రెడ్డి, జూనియర్‌ డి.వి, విజయరాజు, గూడూరు సావిత్రి, జయనిర్మల, రేబాల రమణ, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలగు ప్రఖ్యాత కళాకారుల చెంత పోటాపోటీగా నక్షత్రక పాత్రలో నటించి ప్రజల మన్ననలు అందుకు న్నారు.

నక్షత్రక పాత్రలో నటదిగ్గజాలైన పీసపాటి, షణ్ముఖిరాజు వంటివారు జన నీరాజనాలు అందు కున్నారు. గోపాలరావు ఆ పాత్రకు మరింత ప్రత్యేకతను సంతరించిపెట్టారు. ‘‘అలయక గుళ్లు గోపురములన్నియు, ఏలీలన్‌ సవరింతు మా ఋణము, వైదిక వృత్తి సంపాదింతు నంటివా’’ లాంటి పద్యాల ఆలాపనలో మిగతా నటులకంటే గోపాలం శైలి ప్రత్యేకం. నక్షత్రక పాత్రే గాక రామాంజనేయయుద్ధం, గయోపాఖ్యానం, శ్రీకృష్ణ తులాభారం, నారద గర్వభంగం, చింతామణి, కురుక్షేత్రం మొదలగు నాటకాల్లో ముఖ్యపాత్రలైన శ్రీరామ, శ్రీకృష్ణ, భవానీశంకర, నారద... మొదలైన పాత్రలలో కూడా గోపాలం అలరించారు.


గోపాలరావుగారిని కలిసిన ఒక సందర్భంలో నేను ఒక ప్రశ్న వేశాను. ‘‘గోపాలరావు గారూ... బలిజేపల్లి లక్ష్మీ కాంతంగారి సత్యహరిశ్చం ద్రీయంలో ప్రత్యేకించి కాటి సీనులో జాషువాగారి కొన్ని పద్యాలను ప్రక్షిప్తం చేయడం జరిగింది. అదే కోవలో నాటకంలో నక్షత్రక పాత్ర ముగిసే సమయంలో ప్రక్షిప్తం కాబడిన ‘శంభో.. హర హర మహాదేవ శంభో... శివ శంభో’ అనే శివస్తోత్రమును మీరు రమ్యంగా ఆలపించడం చూ స్తుంటాం. మీకంటే ముందు ఎవరైనా శివస్తోత్రాన్ని ఆలపించారా! ఆ స్తోత్రాన్ని రాసిన వారు ఎవరో చెప్పగలరా!’’ అని అడిగాను. దానికి ఆయన స్తోత్రాన్ని రాసిన వారైతే నాకు తెలియదుగానీ, ఇంతకుముందు కొంత మంది నటులు స్తోత్రాన్ని ఆలపించడం జరిగిం దనీ, కానీ ఆ స్తోత్రాన్ని ఆలపించడంలో మిగతా నటుల కంటే తానొక ప్రత్యేకశైలి ఏర్పరుచుకు న్నాననీ, బహుశా అందువల్లనే ప్రేక్షకుల నుండి ప్రత్యేక గుర్తింపు దొరికిందని అభిప్రా యపడ్డారు. సత్యహరిశ్చంద్ర నాట కంలో గోపాలం ఈ శివస్తోత్రం ఆలపిస్తుంటే ప్రేక్షక మహాశ యులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు.


క్రమశిక్షణ విషయంలో గోపాలం నేటి వర్ధమాన నటులు అందరికీ ఆదర్శ ప్రాయుడు. ఎందుకంటే ఇంతకుముందు కళారంగంలో ఉండే చాలామంది నటులు వ్యసనాల బారినపడి, ఆర్థికంగా నిలదొక్కుకోలేక తమ జీవితా లను అర్థాంతరంగా ముగించు కున్నారు. అదే కళారంగంలో స్వయంకృషిని నమ్ముకొని, క్రమ శిక్షణతో ముందుకుపోతే ప్రభుత్వం తగిన గుర్తింపునిస్తుందని గోపాలం జీవితం ద్వారా తెలుసుకోవచ్చు. సుమారు నాలుగున్నర గంటల నిడివిగల సత్యహరిశ్చంద్ర నాటకాన్ని రెండున్నర గంటల పద్య నాటక చలనచిత్రంగా నిర్మించి సత్య హరి శ్చంద్ర నాటకంపై తనకున్న మక్కువ చాటే ప్రయత్నం చేశారు. వివిధ గ్రామదేవతల పండుగలు, జాతర సమ యాలలో గోపాలం గారికి డేట్స్‌ కుదిరేవి కావు. అలాంటి సందర్భాల్లో పేరెన్నికగన్న హరిశ్చంద్ర, చంద్రమతి పాత్రధారుల సరసన నక్షత్రకునిగా గోపాలం నటించకపోతే ప్రేక్షకులు ఆమోదించే వారు కాదు. దీన్నిబట్టి నక్షత్రకునిగా ఆయనకున్న ప్రజాదరణ తెలుసుకోవచ్చు. గతంలో ఉత్తరాంధ్ర పుడమితల్లిపై అనేకమంది కళాకారులు జన్మిం చారు. వారిలో పీసపాటి నరసింహమూర్తి, అమరపు సత్యన్నారాయణ, కురిటి సత్యంనాయుడు, లోలుగు ఆచారి, ముక్కామల వరహాలాచారి, మంగాదేవి, చీకటి రామారావు, చిత్తారిపురం షావుకారు, కిల్లారి లక్ష్మి మొదలైన ఎందరో రంగస్థల కళాకారులు మిక్కిలి పేరెన్నికగన్నవారు. నేటి కాలంలోకూడా ప్రఖ్యాతిగాంచిన ఉత్తరాంధ్ర నటులు ఉండనే ఉన్నారు. అంటే ఉత్తరాంధ్రలో కూడా బాపట్ల, తెనాలి, చీరాల, ఒంగోలు ప్రాంతాల వలె సమంగా పేరొందిన కళాకారులకు కొదవ లేదన్నమాట.


ఎనభయ్యవ దశకం వరకు శ్రీకాకుళం జిల్లాలో రాజాం పట్టణము నుండి సుమారు 20 కిలో మీటర్ల మేరకు సరైన రహదారి లేని మారు మూల గ్రామం మందరాడ. ఆ ఊరి నుండి ఏ ఊరు వెళ్లాలన్నా కాలినడకనో, జట్కానో నమ్ముకో వాల్సిందే. అలాంటి మారుమూల గ్రామంలో రామ్మూర్తి, లక్ష్మమ్మ పుణ్య దంపతులకు 1950 మే 4వ తేదీన జన్మించారు. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం మందరాడ గ్రామంలో మరియు పి.యు.సి. మాత్రం ప్రభుత్వ కళాశాల శ్రీకాకుళంలో సాగింది. గతంలో సిక్కోలు బిడ్డలు ముగ్గురు పద్మ పురస్కారాలు పొందారు. 1984లో సంగీతానికిగాను శ్రీపాద పినాకపాణి పద్మభూషణ్‌ అవార్డు, 1995లో క్రీడల విభాగంలో కరణం మల్లేశ్వరి పద్మశ్రీ అవార్డు, 2008లో వైద్య రంగంలో డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు వైద్య రంగంలో పద్మశ్రీ అవార్డులు సాధించి సిక్కోలు కీర్తిని నలుదిశలా వ్యాపింప జేశారు. అయితే వీరంతా తర్వాత కాలంలో వేరు వేరు ప్రాంతా లలో నివాసం ఏర్పరుచుకున్నారు. కానీ గోపాలం మాత్రం ఇప్పటికీ తను పుట్టిన ఊర్లోనే నివాసం ఉండడం విశేషం.


పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కాబడిన సంద ర్భంగా గోపాలంగారిని పలువురు పాత్రికేయులు ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో, ‘‘మీరు నక్షత్రక పాత్రకు పెట్టింది పేరులా తయారవడానికి కారణం ఏమిటి?’’ అని అడిగారు. దానికాయన- చంద్రమతి పాత్రధారి అయిన బొమ్మన తవిటయ్య అనే సహనటులు ‘‘నీవు హరిశ్చంద్ర కంటే నక్షత్రకుడుగా బాగా రాణిస్తావయ్యా!’’ అని సలహా ఇచ్చారనీ. అప్పటి నుంచి నక్షత్రక పాత్రపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాననీ చెప్పారు.


1964లో ‘దేశంకోసం’ అనేక సాంఘిక నాట కంతో గోపాలం కళారంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ‘పావలా’, ‘ఆగండి, కొంచెం ఆలోచిం చండి’, ‘పూలరంగడు’, ‘చిల్లర కొట్టు చిట్టెమ్మ’, ‘పల్లెపడుచు’, ‘ప్రెసిడెంట్‌ పట్టయ్య’ మొదలైన సాంఘిక నాటకాలలో అనేక పాత్రల్లో నటించి ప్రజలను మెప్పించారు. సాంఘిక నాటకాలలో నటించిన విస్తృతానుభవం వల్లనే గోపాలం పద్య నాటకాలలో బాగా రాణించగలిగారని చెప్పవచ్చు. అంచెలంచెలుగా ఎదిగి అప్రతిహతంగా సుమారు 5,600 ప్రదర్శనలు ఇవ్వడం మామూలు విషయం కాదు. అందులో కేవలం నక్షత్రక పాత్ర ప్రదర్శనలే 3,600 వరకూ ఉండడం విశేషం. 


నాటకరంగంలో గోపాలం ఎన్నో సత్కారాలు, సన్మానాలు పొందారు. 2000 సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదగా ‘కలియుగ నక్షత్రక’ బిరుదు, 2015 సంవత్సరంలో అనంత పురం లలితకళాపరిషత్‌ వారిచే ‘బళ్ళారి రాఘవ అవార్డు’, అదే ఏడు రాజమండ్రిలో ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవాలకు తుది న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం, 2016లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చే ‘కందుకూరి విశిష్ట పురస్కారం’, 2017లో ఏపీ ప్రభుత్వం ఇచ్చే ‘నంది అవార్డు’లను ఆయన నటజీవితంలో మైలురాళ్లనవచ్చు. 

(యడ్ల గోపాలరావు 2020 సంవత్సరానికి ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపికైన సందర్భంగా)

పిల్లా తిరుపతిరావు

70951 84846

Updated Date - 2020-02-10T09:07:47+05:30 IST