ప్రకృతి కోపిస్తే...

ABN , First Publish Date - 2021-07-02T05:30:00+05:30 IST

ప్రకృతి అంటే పచ్చదనం. ప్రకృతి అంటే పరిశుభ్రత. ప్రకృతి అంటే సకలజీవుల జీవన సమాహారం. ఒక జీవి మరో జీవ జాతిని నాశనం చేయకూడదు. కానీ మానవులు తమ నివాసాల దాపుల్లో, రోడ్లను....

ప్రకృతి కోపిస్తే...

ప్రకృతి అంటే పచ్చదనం. ప్రకృతి అంటే పరిశుభ్రత. ప్రకృతి అంటే సకలజీవుల జీవన సమాహారం. ఒక జీవి మరో జీవ జాతిని నాశనం చేయకూడదు. కానీ మానవులు తమ నివాసాల దాపుల్లో, రోడ్లను బహిరంగ ప్రదేశాలనూ బహిర్భూములుగా మార్చేసుకున్న గ్రామాలూ, పట్టణాలూ నేటికీ ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి పనులు చేయరాదన్న కఠిన నియమం బౌద్ధంలో ఉంది. అనేక కథల్లో, ‘వినయ పిటకం’లో ఇది కనిపిస్తుంది.


వారణాసిలో వడ్రంగులు కొందరు తమ శ్రమకు తగిన ఫలితం రాకపోవడంతో ఆకలి బాధల్లో పడ్డారు. అప్పులు తిరిగి తీర్చే అవకాశం కనిపించలేదు. దీంతో ఆ నగరాన్ని విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. పెద్ద నౌకను తయారు చేసుకొని, ఒక అర్ధరాత్రి వేళ వారంతా కుటుంబాలతో సహా గంగానదిలో ప్రయాణించి, సముద్రంలోకి చేరారు. ఆ సముద్రంలో పక్షం రోజులు ప్రయాణించి, ఒక ద్వీపానికి చేరుకున్నారు. ఈ ద్వీపం ఎంతో అందంగా, అనేక పండ్ల చెట్లతో నిండి ఉంది. ఏ పనీ పాటూ చేయకుండానే ఆ కుటుంబాలన్నీ ఎన్నేళ్ళయినా అక్కడ జీవించవచ్చు. చెరుకు, అరటి, మామిడి, జామ, కొబ్బరి పండ్ల వృక్షాలతో పాటు మంచి వరి ధాన్యం కూడా అక్కడ సమృద్ధిగా ఉంది. వారందరూ ఆ ద్వీపం మీదకు దిగారు. తమను ముందుండి నడిపించడానికీ, తమ బాగోగులు చూసుకోవడానికీ ఇద్దరు నాయకులను ఎంపిక చేసుకున్నారు. ఆ నాయకులు మంచి నావికులు. వారిద్దరూ ద్వీపాన్నంతటినీ పరిశీలించడానికి బయలుదేరారు. 


ఒక చోట గడ్డం, మీసాలూ, జుట్టూ బాగా పెరిగిన ఒక మనిషి వారికి కనిపించాడు. యక్షుడేమో అనుకొని వాళ్ళు బాణాలు సంధించారు. అతను భయపడుతూ ‘‘నేను మనిషినే!’’ అంటూ వారి దగ్గరకు వచ్చాడు. తాను సముద్రంలో దారి తప్పి ఈ దీవి మీదకు వచ్చి పడ్డానని చెప్పాడు. 


‘‘ఇక్కడ మీరు స్వేచ్ఛగా, సంతోషంగా బతకవచ్చు. కానీ ఒకే ఒక్క పని చేయకూడదు. అది చేస్తే ప్రళయం వస్తుంది. సముద్రం కోపిస్తుంది. ఈ దీవిని ముంచేస్తుంది’’ అని అన్నాడు. 


‘‘ఏ పని చేయకూడదు?’’ అని అడిగారు వాళ్ళు.

‘‘ఇక్కడ నియమం ఏమిటంటే... మల మూత్రాలు విసర్జించాక వాటిని మట్టితో కప్పివేయాలి. అలా చేయకపోతే ప్రళయం తప్పకుండా వస్తుంది’’ అని చెప్పాడు.


వారణాసిలో ఉన్నప్పుడు వారికి ఇది అలవాటు లేని పని. అయినా తప్పదు కాబట్టి అలవాటు చేసుకున్నారు. కొన్నాళ్ళు వారందరూ సుఖంగా, హాయిగా బతికారు. అక్కడ దొరికే చెరకురసంతో సారాయి తయారు చేయడం నేర్చారు. ఒక రోజు అందరూ బాగా తాగారు. వాంతులూ, విరేచనాలూ అయ్యాయి. వాటిని మట్టితో కప్పడం మరచిపోయారు. క్రమంగా నిర్లక్ష్యం చేశారు. అలా తాగుడు పెరిగి, అందరూ ఆ దీవిని అశుభ్రం చేశారు. 


ఒక రోజు... ఎలాంటి హెచ్చరికా లేకుండా సముద్రం పొంగింది. నీరు దీవి మీదకు వచ్చేసింది. కొంతసేపటికి మరోమారు సాగరం విరుచుకుపడింది. చెట్లు మునిగిపోయాయి. అందరూ నశించారు. బల్లకట్టు నిర్మించుకున్న ఆటవికుడు ఒక్కడే ఆ ద్వీపం మీద మిగిలాడు.


మన జీవనానికి కారణమైన భూమిని అశుభ్రంగా మారిస్తే... ప్రకృతికి కోపం తెప్పిస్తే... మనకు జీవించే హక్కు మిగలదని తెలిపే సందేశాత్మక కథ ఇది.


బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2021-07-02T05:30:00+05:30 IST