పుత్రోత్సాహము తండ్రికి..

ABN , First Publish Date - 2020-07-16T07:45:47+05:30 IST

పుత్రోత్సాహము తండ్రికి..

పుత్రోత్సాహము తండ్రికి..

బేటా జాయే క్యా హువా, కహా బజా పైథాల్‌

ఆవన్‌జావన్‌ హోయె రహా జ్యోఁ కీరీ కానాల్‌


‘‘కొడుకు పుట్టిన సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలి’’ అనుకునే ఒక తండ్రితో.. ‘‘అప్పుడే ఎందుకంత సంబరపడిపోతున్నావ్‌! ఈ జగత్తులో పుట్టడం, గిట్టడం అనే క్రమంలో పుట్టిన ఆ బిడ్డ పెద్దవాడై మిమ్మల్ని సంతృప్తిపరిచినప్పుడే సంతోషపడవయ్యా!’’ అన్నాడు సంత్‌ కబీర్‌దాసు. సుమతీ శతకకర్త బద్దెన కవి కూడా..


పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా

పుత్రుని గనుగొని పొగడగ

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ


అన్నాడు. తండ్రికి నిజమైన పుత్రోత్సాహం కొడుకు పుట్టినప్పుడు కాదు.. ఆ కొడుకు సంస్కారవంతుడిగా ఎదిగి, అందరూ అతణ్ని పొగుడుతున్నప్పుడు కలుగుతుందని చెప్పాడు. పురాణేతిహాసాల్లో ఇలా ఆదర్శ పుత్రులుగా నడుచుకుని తల్లిదండ్రులకు, వంశానికి కూడా పేరుతెచ్చినవారి గురించి ఈ రోజుకీ కథలు కథలుగా చెప్పకుంటాం. తల్లి కైకేయి కోరిక, తండ్రి దశరథుడి ఆజ్ఞమేరకు పద్నాలుగేళ్ల వనవాసానికి వెళ్లిన రాముణ్ని అందుకే నేటికీ తండ్రి గౌరవాన్ని నిలబెట్టిన కుమారుడిగా కీర్తించి పూజిస్తున్నాం. అంధులైన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని తీర్థయాత్రలకు తీసుకెళ్లిన శ్రవణ కుమారుణ్ని నేటికీ మరువకుండా కీర్తిస్తున్నాం.


ప్రజాకవి వేమన చెప్పినట్టు.. కులంలో ఒక్క గుణవంతుడు ఉంటే ఆ కులానికి, వంశానికి గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. అదే చెడ్డవాడు ఉన్నట్టయితే ఆ కుల,వంశ ప్రతిష్ఠలు మంటగలుస్తాయి. అలాంటి వారికి ఉదాహరణలు రావణుడు, దుర్యోధనుడు. అందుకే ధూర్జటి కవి ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’లోని ‘కొడుకుల్‌ పుట్టరటంచు’ అనే పద్యంలో.. ‘‘ధృతరాష్ట్రుడికి వంద మంది కొడుకులు కలిగినా ఏ గతులు పొందాడు గనుక? కొడుకులు లేకపోయినా శుకమహర్షి సద్గతులు పొందాడు కదా..’’ అన్నాడు. పూజలు, వ్రతాలు చేసి కొడుకునుగన్న లక్ష్మి, జాహ్నవిశర్మ అనే దంపతులు.. చివరకు ‘ఇలాంటి కొడుకును ఎందుకు కన్నామురా భగవంతుడా?’ అని విలపించిన కథను ‘పాండురంగ మహత్యం’గా తెనాలి రామకృష్ణ కవి మనకు అందించాడు. అయితే.. వారి పుత్రుడైన పుండరీకుడు చివరకు తల్లిదండ్రులే ప్రత్యక్షదైవాలని తెలుసుకుని, వారి సేవలో తరించి సాక్షాత్తూ కృష్ణపరమాత్మలో లీనమవుతాడు. పుండరీకుణ్ని తనలో ఐక్యం చేసుకున్న కృష్ణుడు వెలిసిన చోటే పండరిపురం. ఆ దేవుడే పాండురంగడు. చెడ్డ లక్షణాలున్నవారు కూడా మాతాపితరుల సేవ చేత మహితాత్ములవుతారని, దేవతల ఆదరణ సైతం పొందుతారని నిరూపించే కథ అది. ఈ విషయాన్ని మరచి.. ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారు, వారిని వృద్ధాశ్రమాల్లో చేర్చేవారు జీవితంలో అష్టకష్టాలు పడతారు.

- పరికిపండ్ల సారంగపాణి, 9849630290

Updated Date - 2020-07-16T07:45:47+05:30 IST