Advertisement
Advertisement
Abn logo
Advertisement

సిరివెన్నెలకు కన్నీటి వీడ్కోలు

  • కన్నీటి పర్యంతమైన సినీ ప్రముఖులు
  • శోక సంద్రమైన సినీ పరిశ్రమ
  • ఫిల్మ్‌ ఛాంబర్‌కు భారీగా అభిమానులు
  • మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మరలిరాని లోకాలకు తరలిపోయిన సిరివెన్నెల సీతారామశాస్త్రికి తెలుగు చిత్ర పరిశ్రమ, అభిమానగణం కన్నీటి వీడ్కోలు పలికింది! సీతారామశాస్త్రి భౌతికకాయాన్ని కడసారి చూసి బాష్పాంజలి సమర్పించేందుకు సినీ లోకం కదిలి వచ్చింది. ఊపిరితిత్తుల కేన్సర్‌తో తుది శ్వాస విడిచిన సీతారామశాస్త్రి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం జూబ్లీహిల్స్‌ ఫిలింనగర్‌లోని ఫిల్మ్‌చాంబర్‌కు బుధవారం ఉదయం 7 గంటలకు తీసుకొచ్చారు. సినీప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మహేష్‌బాబు, నాగార్జున, వెంకటేశ్‌, జగపతి బాబు, నాగబాబు, శ్రీకాంత్‌, జీవిత రాజశేఖర్‌, నాని, రానా, శర్వానంద్‌, తనికెళ్ల భరణి, పరచూరి గోపాలకృష్ణ, రాజమౌళి, కీరవాణి, మణిశర్మ, గుణశేఖర్‌, క్రిష్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, గాయని సునీత, అల్లు అరవింద్‌, ఛోటా కె నాయుడు, మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, హరీశ్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పేర్ని నాని, విశ్రాంత ఐఎఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం తదితరులు, భారీగా తరలివచ్చిన అభిమానులు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి పార్థివ దేహానికి నివాళులర్పించారు.


ముఖ్యంగా.. తనికెళ్ల భరణి సీతారామశాస్త్రి పార్థివ దేహం దగ్గర కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారు. ఫిల్మ్‌ఛాంబర్‌ నుంచి ఉదయం 11.20 గంటలకు  ప్రత్యేక వాహనంలో అంతిమయాత్ర మహాప్రస్థానానికి బయలుదేరింది. మ ధ్యాహ్నం 2.20 గంటలకు వైకుంఠ మహాప్రస్థానంలో.. సీతారామ శాస్త్రి పెద్దకుమారుడు యోగీశ్వరశర్మ అంత్యక్రియలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాఽథ్‌, నిర్మాత సురే్‌షబాబు, ప్రజా గాయకుడు గద్దర్‌, విమలక్క, ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, రఘుబాబు, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, గాయకుడు మనోతో పాటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు మహాప్రస్థానానికి తరలివచ్చారు. సిరివెన్నెల లోటు భర్తీ చేయలేనిదని.. ఆయన పాటలు సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉండేవని.. చిరంజీవి కంటతడి పెట్టారు.  పుట్టిన జాతికి, ఊరికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిన మహనీయుడు సీతారామశాస్త్రి అని బాలకృష్ణ అన్నారు. తెలుగు జాతి, భాష ఉన్నంతకాలం సిరివెన్నెల సాహిత్యం బతికి ఉంటుందని జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. ఆయన పాటలు రాబోయే తరాలకు బంగారు బాటలుగా అభివర్ణించారు. ఇక.. సీతారామశాస్త్రి పార్థివదేహం వద్ద కన్నీరు పెట్టిన తనికెళ్ల భరణి.. ‘మమ్మల్ని దేవుడు ఇలా విడదీస్తాడని అనుకోలేదు. సీతారామశాస్త్రి రాసిన అన్ని పాటలూ వజ్రాలే’ అన్నారు. సీతారామశాస్త్రి మరణం తీరని లోటని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘ఇంత గొప్ప వ్యక్తి మన ముందు లేకపోవడం బాధాకరం’ అని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. నిర్మాత, నటుడు మురళీమోహన్‌, నటుడు నాని, నిర్మాత అశ్వనీదత్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.


సిరివెన్నెలకు టీడీపీ కార్యాలయంలో నివాళి

అమరావతి (ఆంధ్రజ్యోతి): సమాజ హితం కోసం పాటు పడిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి  రాష్ట్ర ప్రజలకు ఒక గొప్ప ఆస్తి అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీతారామశాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. కాగా హైదరాబాద్‌లో సీతారామశాస్త్రి భౌతికకాయానికి టీడీపీ తరఫున ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్‌, ఏలూరి సాంబశివరావు  నివాళులర్పించారు.  


వైద్య ఖర్చులు.. ఇంటి స్థలం మంజూరు!

ఏపీ సీఎం ఆదేశం

అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలవాలని సీఎంఓ అధికారులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. సిరివెన్నెల మృతి తర్వాత, ఆసుపత్రి ఖర్చుల భారం కుటుంబ సభ్యులపై పడకుండా చూడాలన్న సీఎం ఆదేశాల మేరకు సీఎం సహాయ నిధి నుంచి మొత్తం ఖర్చులు భరించనున్నట్లు అధికారులు తెలిపారు. సిరివెన్నెల కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలంటూ సీఎం ఆదేశించారు. 

Advertisement
Advertisement