Modi తో yediyurappa భేటీ... ఆంతర్యం ఏమిటో

ABN , First Publish Date - 2021-07-16T21:19:16+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి యడియూరప్ప శుక్రవారం భేటీ కానున్నారు. హఠాత్తుగా

Modi తో yediyurappa భేటీ... ఆంతర్యం ఏమిటో

బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి యడియూరప్ప శుక్రవారం భేటీ కానున్నారు. హఠాత్తుగా మధ్యాహ్నం 3 గంటలకు ఆయన కుమారుడు విజయేంద్రతో కలిసి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. సాయంత్రం 7 గంటలకు మోదీతో భేటీ కానున్నారు. కొన్ని రోజుల క్రితం కొంత మంది ఎమ్మెల్యేలు యడియూరప్ప నాయకత్వంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కర్నాటక ఇన్‌చార్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. యడియూరప్ప పాలనపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అయినా యడియూరప్పపై విమర్శలు, అసంతృప్తులు ఆగిపోవడం లేదు. వెల్లువలా వస్తూనే ఉన్నాయి. పరిపాలనలో ఆయన కుటుంబీకులు, కుమారుడు విజయేంద్రన్ జోక్యం మితీమీరిపోయిందన్న విమర్శలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో కుమారుడితో సహా యడియూరప్ప ప్రధానిని కలవనుండటంతో ఆసక్తి రేకెత్తిస్తోంది.


ఈ పర్యటనపై రెవిన్యూ మంత్రి అశోక్ మాట్లాడుతూ... ‘‘సాధారణ భేటీయే. ప్రత్యేకమేమీ లేదు. కర్నాటకలో నాయకత్వ మార్పు లేదు. యడియూరప్పే సీఎంగా కొనసాగుతారు. కావేరీ నది సమస్యపై మాట్లాడడానికే ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సహా ఇతర కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు’’ అని అశోక్ పేర్కొన్నారు. కర్నాటకలో నాయకత్వ మార్పు తథ్యమన్న సంకేతాలు చాలా రోజులుగా వస్తున్నాయి. యడియూరప్ప పరిపాలన, వ్యవహార శైలిపై అధిష్ఠానం కూడా తీవ్ర అసంతృప్తితో ఉందన్న వార్తలూ గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో యడియూరప్ప ఢిల్లీ వెళ్లడం ఆసక్తిదాయకం.

Updated Date - 2021-07-16T21:19:16+05:30 IST