నిజమైన విద్య

ABN , First Publish Date - 2020-07-02T09:03:27+05:30 IST

వ్యక్తి తన శక్తిపై నమ్మకం ఏర్పరచుకొని నియమ నిబంధనలతో దైవం వైపు చేసే ప్రయాణమే ‘విద్య’ అని రుగ్వేదం చెబుతోంది. నైతిక విలువలతో కూడిన శాస్త్రవిజ్ఞానాన్ని అధ్యయనం

నిజమైన విద్య

వ్యక్తి తన శక్తిపై నమ్మకం ఏర్పరచుకొని నియమ నిబంధనలతో దైవం వైపు చేసే ప్రయాణమే ‘విద్య’ అని రుగ్వేదం చెబుతోంది. నైతిక విలువలతో కూడిన శాస్త్రవిజ్ఞానాన్ని అధ్యయనం చేయడమే విద్య అంటుంది కఠోపనిషత్తు. సత్సంగాన్నే విద్యాలయంగా, అందులో తాను పొందిన అనుభవాలనే పాఠాలుగా అధ్యయనం చేసిన కబీరు.. చదువు గురించి తన రెండు పంక్తుల పద్యంలో ఈ విధంగా చెబుతాడు.


పఢి పఢి జో పత్థర్‌ భయా, లిఖిలిఖి భయా జు చోర్‌

జిస్‌ పఢ్‌నే సాహిబ్‌ మిలే సో పఢ్‌నా కుచ్‌ ఔర్‌


పనికిరాని చదువు మనిషి గుండెను ఏ అనుభూతులూ లేని బండరాయిగా మారుస్తుంది. పరమాత్ముని వైపు నడిపించగల యథార్థమైన  చదువులు, రాతలు మాత్రమే మనిషి జీవితానికి సరైన అర్థం చెప్పగలవు అని కబీరు హృదయం. మంచి గుణాలు విలువలతో కూడుకున్నదే నిజమైన విద్య. ఆ విద్యకు తగిన గౌరవం లభించాలంటే మనోవికారాలైన అరిషడ్వర్గాల (కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాల) ప్రభావం విద్యపై పడకూడదు. మనో వికారాలకు గురికాని విద్యే వెలుగులు విరజిమ్ముతుంది. గొప్ప విద్యావేత్తలు, తపస్సంపన్నులు అయినప్పటికీ.. అరిషడ్వర్గాలకు లోనై పతనమైనవారి ఉదాహరణలు మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. 


విద్యకుండవల్సిన ముఖ్య లక్షణం వినయం అంటాడు భర్తృహరి. వినయం లేని విద్యావేత్తలెందరో.. కష్టపడి సంపాదించిన తమ పాండిత్యానికి తగిన ఆధారం లభించక అవమానాలపాలయ్యారు. అలాంటి వారిలో రామ్‌ తాను పాండే ఒకడు. రామ్‌ తాను పాండేయే తాన్‌సేన్‌గా అక్బరు కొలువులో ఉండేవాడు. కానీ తాన్‌ సేన్‌కు సంగీతంలో తానే గొప్ప పండితుణ్నని, తనతో పోటీపడి సంగీతంలో ఎవరూ గెలువలేరనే అహం దండిగా ఉండేది. అక్బరు ఈ విషయం పసిగట్టి తగిన సమయం కోసం వేచి చూస్తుండేవాడు. గ్వాలియర్‌ రాజైన మానసింహుని ఆస్థానంలో ఉన్న బైజు బావరా తన సంగీతంతో రాళ్లను సైతం కరిగించగల సమర్థుడని విన్న అక్బర్‌.. ఆయన్ని తన దర్బారుకు రప్పించి ఉచిత స్థానాన్ని కల్పించాడు. ఇది తాన్‌సేన్‌కు గిట్టదు. అయినా ఊరుకుంటాడు. ఒకరోజు అక్బర్‌ సభలో వారిద్దరినీ తమ ప్రతిభను ప్రదర్శించాల్సిందిగా కోరతాడు. తాన్‌సేన్‌ తనకు చాలా ఇష్టమైన దీపక రాగాన్ని ఆలపిస్తాడు. దాంతో సభాప్రాంగణమంతా దీపాలు వెలిగి వాతావరణాన్ని వేడెక్కిస్తాయి.


అది చూసిన బైజూ బావరా.. మేఘ మల్హర్‌ రాగాన్ని ఆలపించి, వాన కురిపించి వాతావరణాన్ని చల్లబరుస్తాడు. మరోసారి.. చిట్టడవిలో ఏర్పాటు చేసిన సంగీత సభలో తాన్‌సేన్‌ తోడిరాగం ఆలపిస్తాడు. ఆ గానానికి అడవిలోని జింకల గుంపు అక్కడికి వస్తుంది. వెంటనే ఆయన తన మెడలోని పూలమాల తీసి ఒక జింక మెడలో వేస్తాడు. అవి అక్కడి నుంచి వెళ్లాక.. జింక మెడలో తాను వేసిన పూలదండను తెప్పించి ఇవ్వాలని తాన్‌సేన్‌ కోరుతాడు. అప్పుడు బైజూ బావరా మృగరంజని తోడి రాగం పాడి, జింకలను మళ్లీ రప్పించి ఆ పూలమాలను తీసి ఇవ్వడంతో తాన్‌సేన్‌కు కనువిప్పు కలుగుతుంది. అందుకే విద్యలో అహంకారం తగదని, వినయమే నిజమైన పాండిత్యానికి భూషణం అని అంటారు. కాబట్టి, చిన్ననాటి నుంచి పిల్లలకు ఆధ్యాత్మిక భావాలు కలిగించి పురాణేతి హాసాల్లోని కథల ద్వారా మంచి, చెడులను పరిచయం చేయాలి. అప్పుడే యువతకు విద్య యొక్క విలువ, జీవితానికి అర్థం తెలుస్తాయని పెద్దలు అంటారు.


పరికిపండ్ల సారంగపాణి

Updated Date - 2020-07-02T09:03:27+05:30 IST