Abn logo
Sep 16 2021 @ 23:52PM

కేంద్రం తీరుపై ఐక్య పోరాటం!

పాదయాత్ర ర్యాలీని ప్రారంభిస్తున్న నారాయణ

- పంచభూతాలను అమ్మేస్తున్న మోదీ ప్రభుత్వం 

- ప్రజల నుంచి పన్నులు...పెద్దల కోసం ఖర్చు

- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

(పాలకొండ/బూర్జ, సెప్టెంబరు 16)

రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై అన్ని రాష్ర్టాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు.  కేంద్ర ప్రభుత్వం పంచభూతాలను సైతం అమ్మేస్తోందని ఆరోపించారు. గురువారం బూర్జ మండలం పాలవలసలో ‘సీపీఐ జన ఆందోళన్‌’  పాదయాత్ర ప్రారంభ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం రాక్షస ప్రభుత్వం రాజ్యమేలుతోందని  ఆరోపించారు. అన్నివర్గాల ప్రజలు మోదీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్‌ శక్తులకు తొత్తులుగా మారిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే సమయం ఆసన్నమైందన్నారు. పేదలు, రైతులు, అణగారిన వర్గాలు కావాలా? కార్పొరేట్‌ శక్తులు కావాలా? మోదీ తేల్చుకోవాలన్నారు. దేశంలో అనేకమంది కార్పొరేట్లు అప్పు చేసి.. ఎగనామం పెట్టి విదేశాల్లో విలాసంగా బతుకుతుంటే.. కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజల నుంచి పన్నులను వసూలు చేస్తున్న ప్రభుత్వం పెద్దల కోసం ఖర్చు చేస్తోందని విమర్శించారు. దేశంలో 28 మంది బడాబాబులు అప్పులు తీసుకొని విదేశాలకు పారిపోయారని, వీరిలో 27 మంది గుజరాతీలేనని చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న దిగ్గజ కంపెనీలకు అప్పు కావాలంటే  ఇవ్వని కేంద్రం... ప్రైవేటు సెల్‌ కంపెనీలకు వేల కోట్ల అప్పులు ఎలా ఇస్తోందని ప్రశ్నించారు. ఆదానీ, అంబానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెట్టేందుకు చొరవ చూపుతోందని ఆరోపించారు.  ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను పోస్కో కంపెనీకి, గంగవరం పోర్టును ఆదాని గ్రూప్‌కు ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం దురదృష్టకరమన్నారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను, విద్యుత్‌ సంస్కరణల బిల్లు-2020ను రద్దు చేయాలని  డిమాండ్‌ చేశారు. ఈ నెల 27న నిర్వహించనున్న భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని నారాయణ కోరారు. 


గిరిజనుల జోలికి రావద్దు

గిరిజనుల జోలికి అటవీశాఖ అధికారులు, పోలీసులు వస్తే సహించేది లేదని నారాయణ హెచ్చరించారు. గిరిజనులు అడవిని ఖాళీ చేస్తే కార్పొరేట్లు వాటిని కొల్లగొడతారన్నారు. జయపురం అటవీ భూముల్లో ఉన్న గిరిజనులను వెళ్లగొట్టేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అలా జరిగితే మా శవాలైనా చూడాలి, లేకుంటే అటవీ సిబ్బంది ఆ ప్రక్రియను విరమించుకోవాలని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే 30ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ కట్టుకున్నారని... అది ఎవడబ్బ సొమ్మని  నిలదీశారు. ఎమ్మెల్యేలు ఫామ్‌హౌస్‌లు కట్టుకొని జీవిస్తుంటే  తప్పుకానిది, గిరిజనులు అటవీ ప్రాంతంలో నివసిస్తే తప్పా? అని ప్రశ్నించారు.


ప్రభుత్వాలు ముందుకురావాలి

ఢిల్లీ చుట్టూ లక్షలాది మంది రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారని నారాయణ తెలిపారు. ఆంధ్రపదేశ్‌, తెలంగాణ  ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని కోరారు. రాకుంటే భవిష్యత్‌లో మోదీపై చేస్తున్నట్లే... మీపైన కూడా పోరాటం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి  ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. 


పాలవలస నుంచి పాదయాత్ర

పాలవలస నుంచి పాలకొండలోని కోటదుర్గమ్మ  ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. సీపీఐ నాయకులు జేవీ సత్యనారాయణమూర్తి, జల్లి విల్సన్‌, పడల రమణ, జాన్సన్‌బాబు, పాత్రికేయుడు నల్లి ధర్మారావు పాదయాత్రకు నాయకత్వం హించారు. ఈ సందర్భంగా గాయ్రతీ గుడి సమీపంలో కట్టెల పొయ్యిపై వంట చేసి వినూత్న నిరసన తెలిపారు.  సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు పోరాట ఫలితంగానే తమకు న్యాయం జరిగిందని అగ్రిగోల్డ్‌ బాధితులు ఆయన్ను  సత్కరించారు. అనంతరం వీరఘట్టం వైపు పాదయాత్ర సాగింది. పాదయాత్రకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు సీతంపేట మండలం నారాయణగూడలో నారాయణ పర్యటించారు. గిరిజనులతో మాట్లాడారు. గతంలో భూపోరాటం సమయంలో ఈ గ్రామాన్ని సందర్శించినట్టు గుర్తు చేశారు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను పరిశీలించారు. అరటి గెలను భుజాన కొద్దిసేపు మోశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా అధ్యక్షుడు సనపల నరసింహులు, ప్రజా సంఘాల నాయకులు బుడితి అప్పలనాయుడు,   కూరంగి మన్మఽథరావు, బలగ శ్రీరామ్మూర్తి, చిక్కాల గోవిందరావు, ప్రభావతి, యుగంధర్‌, రాజేశ్వరరావు, చాపర వేణు, కూరంగి జగదీష్‌, అల్లుబోయిన అప్పలనాయుడు, సరుబుజ్జిలి, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట మండలాల కార్యదర్శులు పాల్గొన్నారు.