ఆఫ్ఘనిస్థాన్‌లో అంతర్యుద్ధం రావొచ్చు : అమెరికన్ జనరల్

ABN , First Publish Date - 2021-09-05T22:30:29+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో అంతర్యుద్ధానికి చాలా అవకాశాలు ఉన్నాయని

ఆఫ్ఘనిస్థాన్‌లో అంతర్యుద్ధం రావొచ్చు : అమెరికన్ జనరల్

వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్థాన్‌లో అంతర్యుద్ధానికి చాలా అవకాశాలు ఉన్నాయని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ మార్క్ మిలీ చెప్పారు. ఈ పరిణామాలు అల్‌ఖైదా పునరుజ్జీవానికి కానీ, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) వృద్ధి చెందడానికి కానీ దారి తీస్తాయని తెలిపారు. పంజ్‌షీర్‌లో రెసిస్టెన్స్ ఫ్రంట్‌తో తాలిబన్ల పోరాటం, ఆఫ్ఘన్‌లో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతుండటం నేపథ్యంలో జనరల్ మిలీ అమెరికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 


అమెరికా నేతృత్వంలోని దళాల ఉపసంహరణ తేదీ సమీపిస్తుండగానే తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకోవడంలో ప్రదర్శించిన దూకుడుకు పంజ్‌షీర్‌లో కళ్ళెం పడింది. ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, అహ్మద్ మసూద్‌ల నేతృత్వంలోని రెసిస్టెన్స్ ఫ్రంట్‌ నుంచి తాలిబన్లకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. మరోవైపు తాలిబన్, హక్కానీల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. దీంతో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులువు కాదనే సంకేతాలు వెలువడుతున్నాయి. 


జనరల్ మిలీ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్‌లో విస్తృత స్థాయిలో అంతర్యుద్ధం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తాను భావిస్తున్నానని తెలిపారు. ఆఫ్ఘన్ సైన్యం, ప్రభుత్వం చాలా వేగంగా కుప్పకూలాయని, దీనిని ఎవరూ ఊహించలేదని చెప్పారు. ఈ పరిణామాలు రానున్న ఒకట్రెండు సంవత్సరాల్లో  ఉగ్రవాద సంస్థలు విజృంభించడానికి దోహదపడవచ్చునని హెచ్చరించారు. 


Updated Date - 2021-09-05T22:30:29+05:30 IST