ఫోన్‌లో వైరస్‌...ఇలా కనిపెట్టొచ్చు

ABN , First Publish Date - 2021-10-23T04:09:52+05:30 IST

మొబైల్‌లోకి వైరస్‌ చేరిందనే అనుకుందాం. అయితే తెలుసుకోవడమెలా అన్నది ఒక ప్రశ్న. దీనిపై ఆందోళన చెందే కంటే కొన్ని....

ఫోన్‌లో వైరస్‌...ఇలా కనిపెట్టొచ్చు

మొబైల్‌లోకి వైరస్‌ చేరిందనే అనుకుందాం. అయితే తెలుసుకోవడమెలా అన్నది ఒక ప్రశ్న. దీనిపై ఆందోళన చెందే కంటే కొన్ని చిట్కాలతో అసలు విషయాన్ని గ్రహించవచ్చు.

వాస్తవానికి ఈ కరోనా సంక్షోభ కాలంలో మొబైల్‌ మనల్ని రియల్‌ వరల్డ్‌ నుంచి డిస్కనెక్ట్‌ కాకుండా చూడగలిగింది. వీడియో, వాయిస్‌ మెసేజ్‌లతో బంధువులు, స్నేహితులతో టచ్‌లో ఉండగలిగాం. ఒకరి వివరాలను మరొకరు తెలుసుకుని కుదుటపడగలిగాం. సాధ్యమైనంతమేర సహాయం కూడా చేసుకోగలిగాం అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. మొబైల్‌ టెక్నాలజీ సహకారంతోనే ఆఫీసు పనులనూ చక్కబెట్టుకున్నాం. పిల్లల చదువులూ కొనసాగాయి. ఇలా చెప్పుకొంటూ వెళితే మొబైల్‌తో పొందిన లాభాల జాబితా చాంతాడులా పెరుగుతూనే ఉంటుంది. అలాంటి మొబైల్‌కు మాల్వేర్‌ ద్వారా వైరస్‌ సోకితే తక్షణమే ముందుకు కదలాలి. ఎక్కువ నష్టం జరగకుండానూ చూసుకోవాలి. 

గూగుల్‌ ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్‌ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా వైరస్‌ బారిన పడకుండా మొబైల్‌ను చాలా వరకు కాపాడుకోవచ్చు. అలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మాల్వేర్‌ జొరబాటుకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. దరిమిలా జొరబాటును ఎలా తెలుసుకోవాలంటే...

ఊహకు అందని చార్జీలు పడుతుంటే మొబైల్‌ వైరస్‌ పాలైందని భావించవచ్చు. వైరస్‌ చేరిందని తెలుసుకోడానికి ఇదో సులువైన విధం. వినియోగదారుడి అనుమతి లేకుండానే సదరు వ్యక్తి ఫోన్‌తోనే ప్రీమియమ్‌ టెక్స్ట్‌ మెసేజ్‌లు వెళతాయి. ఫోన్‌ కాల్స్‌ జరుగుతాయి. యాప్‌ల కొనుగోలు కూడా జరుగుతుంది. వైరస్‌ సోకిందనడానికి గ్రహించేందుకు ఇంతకు మించి మరొకటి అవసరం లేదు. 

 భరించలేని విధంగా ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. యాడ్‌వేర్‌ సోకిందనడానికి ఇదో ఉదాహరణ.

స్పామ్‌ టెక్స్‌ట్ మెసేజ్‌లను పంపేందుకు మాల్వేర్‌, ట్రోజన్‌ మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించవచ్చు. తద్వారా కూడా వైరస్‌ సోకిందని తెలుసుకోవచ్చు.


స్మార్ట్‌ఫోన్‌ పర్ఫార్మెన్స్‌ గణనీయంగా మందగించడం సైతం ఒక సూచికే. 

వైరస్‌లు, మాల్వేర్‌ మీ ఫోన్‌లో మీకు తెలియకుండానే సరికొత్త యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ఈ యాప్‌లు, మెసేజ్‌లు పెద్ద ఎత్తున డేటాను ఉపయోగించుకోవచ్చు. అంటే ప్రమాదంలో పడినట్టే.

ఇదంతా బ్యాటరీ పనితీరుపైనా కనిపిస్తుంది. అది కూడా గమనించదగ్గ విషయం. 

Updated Date - 2021-10-23T04:09:52+05:30 IST