కన్నీరు పెట్టించే నడక!

ABN , First Publish Date - 2020-03-27T10:16:26+05:30 IST

వలస.. ఆకలితో నకనకలాడే కడుపులోకి ఇంత కలో గంజో పోసి చల్లార్చుకునేందుకు బడుగులు తమ బతుకు బండిని నెట్టుకొచ్చే ఓ ప్రయాస! సొంతవాళ్లను, పుట్టిన ఊరును వదిలేసి.. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరోచోటుకు పోయి ఏవేవో పనులు

కన్నీరు పెట్టించే నడక!

గమ్యం చేరేనా.. 

లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కూలీలు

పనులు లేక.. పస్తులతో ఉండలేక సొంతూళ్లకు పయనం

మహారాష్ట్రలో తనిఖీలో పట్టుబడ్డ వైనం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

వలస.. ఆకలితో నకనకలాడే కడుపులోకి ఇంత కలో గంజో పోసి చల్లార్చుకునేందుకు బడుగులు తమ బతుకు బండిని నెట్టుకొచ్చే ఓ ప్రయాస! సొంతవాళ్లను, పుట్టిన ఊరును వదిలేసి.. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరోచోటుకు పోయి ఏవేవో పనులు చేసుకుంటున్నవారు మన దేశంలో ఎందరో! ఈ తరహా బడుగుల గుండెల్లో లాక్‌డౌన్‌ పిడుగులా పడింది. పనులు లేక వారికి బువ్వ కరువవుతోంది. పస్తుల బాధ పడలేక సొంతూరుకైనా పోదామంటే బస్సులు.. ప్రైవేటు వాహనాలూ లేవు! ఇలా సోమవారం రాత్రి 8గంటలకు ప్రధాని మోదీ ప్రకటించిన లాక్‌డౌన్‌తో దేశంలో వలస కూలీలు ఎక్కడివారక్కడ చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు. ఉన్నచోటే ఉందామనుకున్నా లాక్‌డౌన్‌ 21 రోజులకు పరిమితం అవ్వకపోతే? ఏప్రిల్‌ 14 తర్వాతా కొనసాగితే? ఇదే ఆలోచనతో ఆందోళనకు గురవుతున్న వలస కూలీలు, కార్మికులు తెగించి సొంతూళ్లకు కదులుతున్నారు! ఐదు, పది కిలోమీటర్లు కాదు.. వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని కొందరు కాలినడకన సాగిస్తుంటే ఇంకొందరు సైకిళ్ల మీద సాగిస్తున్నారు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిర్చి, పత్తి ఏరేందుకు ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర నుంచి వచ్చిన వందలమంది కూలీలు సొంతూళ్లకు కాలినడకన బయలుదేరారు. జూలూరుపాడు, చంద్రుగొండ, ఏన్కూరు, కొత్తగూడెం, టేకులపల్లి, ములకలపలి మండలాల్లో పనిచేస్తున్న ఈ కూలీలంతా 1000 కిలోమీటర్లు, ఆపైన దూరంలో గల తమ ప్రాంతానికి కాలినడకనే వెళ్లాలని సంకల్పించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి నిర్మల్‌ జిల్లా భైంసాకు వచ్చిన కొందరు అక్కడ ఐస్‌క్రీమ్‌, జ్యూస్‌ వ్యాపారం చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌తో కొందరు కాలినడకన.. ఇంకొందరు సైకిళ్లపై యూపీలోని తమ ఊళ్లకు బయలుదేరారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలంలోని ఇప్పలపల్లి, మారడుగు, మద్దిమడుగు గ్రామాల్లో ఏపీలోని మంత్రాలయం పరిసర గ్రామాలకు చెందిన 10 కుటుంబాలు పనులు చేసుకొని బతుకుతున్నాయి. ఇప్పుడు వీరంతా 300 కిలోమీటర్ల దూరంలోని సొంత గ్రామాలకు నడుచుకుంటూనే వెళ్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రం చుట్టుపక్కల మండలాల్లో ఉన్న పరిశ్రమల్లో ఆరు వేల మందికిపైగా ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. 100పైగా క్వారీల్లో ఇంకొంద రు కార్మికులు పనిచేస్తున్నారు. వారందరూ ఇక్కడ ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రలో ఓ కూలీ ఆహారం కూడా తీసుకోకుండా నాగ్‌పూర్‌ నుంచి చందాపూర్‌ వరకు 135 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరాడు. 


కంటైనర్‌లో 300మంది రాజస్థాన్‌కు...

జులాయి సినిమాలో ప్రతినాయకుడు సోనూ సూద్‌, పోలీసుల కనుగప్పి తప్పించుకునేందుకు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఓ పెద్ద ట్యాంకర్‌లో కూర్చుని వెళతాడు. లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కూలీలు ఇలాంటి ట్రిక్‌నే ఫాలో అవుతున్నారు. ఇటీవల పాలవ్యాన్‌లో విజయవాడ వెళుతున్న 20మందిని పోలీసులు పట్టుకున్నారు. తాజాగా తెలంగాణలో పనిచేస్తున్న రాజస్థాన్‌కు చెందిన 300మంది.. రెండు కంటైనర్‌ ట్రక్కులో సొంతూళ్లకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కంటైనర్‌ ట్రక్కులను మహారాష్ట్రలోని యావత్మల్‌ జిల్లా సరిహద్దుల్లో పోలీసులు పట్టుకున్నారు. 


చైన్నె నుంచి విశాఖకు..ఏపీలోని విశాఖ జిల్లా గుడ్డిప, గొంప,   పెదమదీనా, గున్నెంపూడిలకు చెందిన సుమా రు 400 మంది కూలీలు చెన్నై నుంచి సుమారు 800 కిలోమీటర్లకు పైగా దూరంలోని తమ సొంతూళ్లకు కాలినడకనే పయనమయ్యారు. అక్క డ విమ్‌కోనగర్‌లో పనులుచేస్తూ పరిసర ప్రాం తాల్లో  ఉంటున్నారు. లాక్‌డౌన్‌తో దాదాపు 800 కిలోమీటర్లకు పైగా దూరంలోని తమ సొంతూళ్లకు కాలినడకనే పయనమయ్యారు. 

Updated Date - 2020-03-27T10:16:26+05:30 IST