Abn logo
Jan 14 2021 @ 03:23AM

ఈ అపనమ్మకం వెనుక ఒక హెచ్చరిక !

వ్యవస్థల మీద నమ్మకం కలిగి ఉండడం ప్రజల బాధ్యతేమీ కాదు. నమ్మకాన్ని నిలుపుకోవడం వ్యవస్థలను నడిపేవారి విధి. దురదృష్టవశాత్తూ, మన దేశంలో వ్యవస్థ మీద అవిశ్వాసిగా ఉన్నవాడి మీద దేశద్రోహమో మరొకటో అభియోగం మోపవచ్చు. వ్యవస్థ నిర్వాహకులయి, దాని మీద అపనమ్మకం కలిగించే విధంగా వ్యవహరించే వారు మాత్రం బలాదూర్‌గా ఉంటారు. ప్రజానుకూలమైన స్పందనలేవీ లేకుండా, అధికారానికీ ధనదాహానికీ మాత్రమే పనికివచ్చే విధంగా సంస్థలను తయారుచేసి, పర్యవసానంగా ఎదురయ్యే ప్రతిఘటనను కఠినంగా అణచివేస్తూ పబ్బం గడుపుకుందామని పాలకులు చూస్తారు. ఆ క్లిష్ట విన్యాసంలో చాలా కోల్పోవలసి వస్తుంది, ముఖ్యంగా నైతికత. పాలించడానికి ఓట్ల గెలుపులే కాదు, కనీస స్థాయి నైతికత కూడా కావాలి. అది అడుగంటిపోయాక, అసలుకే మోసం వస్తుంది. కాబట్టి, వ్యవస్థల విశ్వసనీయతను, ప్రయోజకత్వాన్ని, నైతికతను- తమ కోసమే, తమ శ్రేయస్సు కోసమే నిలుపుకోవలసిన బాధ్యత ఏలికల బృందానికి ఉంటుంది. 


న్యాయస్థానాలైనా సరే, తమ విశ్వసనీయతను తామే తమ ఆచరణ ద్వారా నిత్యం నిలుపుకోవలసి ఉంటుంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలిదశాబ్దాలలో న్యాయవ్యవస్థకు ఉన్నంత ప్రతిష్ఠ, స్వతంత్రత, నిష్పాక్షికత ఇప్పుడు ఉన్నాయని, ప్రస్తుత న్యాయనిపుణులే అంగీకరించగలరా? ప్రధాన వ్యవస్థలో అంగాలుగా ఉన్న రాజకీయ, పాలనా వ్యవస్థలు విఫలం అయినప్పుడు, బాధితులు ఆశ్రయించడానికి న్యాయస్థానం ఉన్నది. ప్రజాన్యాయస్థానానికి నివేదించడానికి నాలుగో వ్యవస్థ మీడియా ఉన్నది. అపీలు అవకాశం ఇస్తున్న ఈ రెండు వ్యవస్థలు తమ బాధ్యతను నెరవేర్చలేకపోతే, ప్రజలకు ఇక నిష్కృతి ఎక్కడ? 


కిందిస్థాయి నుంచి అత్యున్నత న్యాయస్థానం దాకా న్యాయమూర్తుల నియామకంలో ఎంపికల్లో అనుసరిస్తున్న పద్ధతులు కూడా వివాదాస్పదం అయ్యాయి. పదవీ విరమణ అనంతరం న్యాయమూర్తులకు ప్రభుత్వాలు ఇచ్చే కొత్త బాధ్యతలు కూడా చర్చనీయాంశాలు అయ్యాయి. ఇక అవినీతులు, అక్రమ వర్తనల విషయంలో రకరకాల చర్యలను ఎదుర్కొన్న న్యాయమూర్తులు ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ, న్యాయవ్యవస్థపై ప్రజలకు ఆశలు ఉన్నాయి. ఎందుకంటే, కనీసం కొన్ని కీలకసందర్భాలలో, దానికి ధైర్యసాహసాలు ఉంటాయని, ఎంత పెద్ద శక్తిని అయినా శాసించగలదని జనం నమ్మారు. అటువంటి ఆశ కలిగించిన తీర్పులు, తీర్పరులు గతంలో ఉన్నారు. ప్రభుత్వాలు కూడా వ్యవస్థలోని కొన్ని అంగాల సాపేక్ష స్వయంప్రతిపత్తిని గౌరవించేవి. అట్లా కాక, ప్రభుత్వ నిర్ణయాలకు, ఏ కారణం చేత అయినా కావచ్చును, అనుగుణంగా మాత్రమే వ్యవహరించాలనుకుంటే న్యాయవ్యవస్థ మీద నమ్మకం నిలబడదు. ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థలోని ముఖ్యుల మీద రకరకాల ఒత్తిడులు తేవచ్చును. లేదా, ప్రభుత్వాలకు ఉన్న జనాదరణ న్యాయాధికారుల విచక్షణను ప్రభావితం చేయవచ్చును. తప్పొప్పుల విషయంలో సమాజంలో బలపడుతున్న ఉద్వేగపూరిత పిడివాదాలు న్యాయనిర్ణయాలలో సంకోచ వ్యాకోచాలకు కారణం కావచ్చును. అప్పుడిక, అన్యాయాలకు అపీలు ఎక్కడ? 


ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఆందోళన విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న చొరవకు ఆశించినంత సానుకూల ప్రతిస్పందన లభించలేదు. ఏ చట్టాల రద్దు కోసం వారు పోరాటం చేస్తున్నారో, ఆ చట్టాల అమలుపై స్టే విధించినా వారి కేమీ పెద్ద ఆనందం కలగలేదు. సంప్రదింపుల కోసం నియమించిన నిపుణుల కమిటీని వారు విశ్వసించడం లేదు. ఇది ఒకరకంగా సుప్రీంకోర్టు ప్రమేయంపై విముఖతను ప్రకటించినట్టే. ఎందుకు అట్లా? దీర్ఘకాలం కొనసాగుతూ బిగుసుకుపోయిన పోరాటాల విషయం సుప్రీంకోర్టు వంటి తటస్థ, స్వతంత్ర వ్యవస్థ కల్పించుకోవాలని కోరుకోవాలి కదా, కల్పించుకుంటే సంతోషించాలి కదా? ఇది రాజకీయ పోరాటం, మేం రాజకీయంగానే తేల్చుకుంటామని ఉద్యమసంఘాలు అంటున్నాయి. అంటే, ప్రభుత్వంతో నేరుగా వ్యవహరించవలసిందే తప్ప, కోర్టుకు ఇక్కడ ప్రాసంగికత లేదని అంటున్నాయి. 


నిజంగానే, వివాదాస్పద చట్టాల విషయంలో న్యాయవ్యవస్థ చేయగలిగేది ఏమీ లేదు. ప్రజాభిప్రాయమే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కారాన్ని సాధించాలి. ఈ చట్టాల విషయంలోనే కాదు, ఇంకా అనేక శాసనాల విషయంలో కేంద్రప్రభుత్వం కనీస ప్రజాస్వామిక సంప్రదాయాలను కూడా పాటించలేదు. చట్టసభలలో ప్రవేశపెట్టేముందు తగిన చర్చ జరపడం, తగినంత ముందుగా ప్రజాప్రతినిధులకు ముసాయిదాలు ఇవ్వడం, సభల్లో చర్చకు తగినంత సమయం ఇవ్వడం- ఇవేవీ ఈ మూడు చట్టాల విషయంలోనే కాదు, చాలా చట్టాల విషయంలో జరగలేదు. ఆ అంశం ఆధారంగా కోర్టు ప్రభుత్వాన్ని తప్పు పట్టగలదా? చట్టాలలోని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని భావించగలదా? దేశ ఆర్థిక వ్యవస్థను కీలకమయిన మలుపు తిప్పిన సందర్భాలలోనే ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ పరీక్షకు రాలేదు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రత్యేకంగా వ్యాఖ్యానిస్తే తప్ప, వ్యవసాయ కార్పొరేటీకరణ, మార్కెటింగ్ ప్రక్రియల ప్రైవేటీకరణ రాజ్యాంగవిరుద్ధాలని కోర్టు చెప్పలేదు. ఈ మూడు చట్టాలను, ఆ చట్టాలలోని అంశాల కారణంగా కోర్టు కొట్టివేయలేదు. మరి ఎందుకు జోక్యం? ఎందుకు స్టే? తాము ప్రభుత్వంపై పెడుతున్న ఒత్తిడిని బలహీనపరచడానికే సుప్రీంకోర్టు చర్యలు ఉపయోగపడతాయని ఉద్యమసంఘాలు భయపడుతున్నాయి. ప్రభుత్వ పక్షానికి మేలు చేయడానికే ఈ జోక్యం అని ఎవరూ నేరుగా ఆరోపించడం లేదు కానీ, ఫలితంలో అదే జరుగుతుందన్నది వారి ఆందోళన. 


రైతు ఉద్యమాన్ని బలహీనపరచడానికి, విఫలం చేయడానికి ప్రభుత్వం అనుసరిస్తూ వస్తున్న వివిధ ఎత్తుగడలను చూసిన తరువాత, ప్రభుత్వం నుంచి న్యాయస్థానంపై కూడా ఒత్తిడి ఉన్నదేమోనని అనిపించడం సహజం. ఈ మూడు చట్టాలను కోర్టు చేయగలిగేది ఏమీ లేదు కానీ, కోర్టు కల్పించుకోవలసిన చట్టాలు, నిర్ణయాలు అనేకం నిరీక్షణలో ఉన్నాయి. వాటి విషయంలో కాలయాపన ప్రమాదం కూడా. ఏడాదిన్నర దాటినా, ఆర్టికల్ 370 రద్దు విషయంలో దాఖలయిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇంకా విచారణకు స్వీకరించలేదు. 370 రద్దు చేయడానికి ప్రస్తుత పార్లమెంటుకు అధికారం ఉన్నదా, ఆ అధికరణం రాజ్యాంగంలోని శాశ్వత, స్థిర అధికరణమా, లేక తాత్కాలికమైనదా అన్న వివాదాన్ని తేల్చవలసి ఉన్నది. ఒకవేళ, పార్లమెంటుకు ఆ అధికారం లేదు అన్న తీర్పు వచ్చే మాట అయితే, ఇన్ని రోజులుగా రాజ్యాంగ విరుద్ధ నిర్ణయం అమలులో ఉన్నట్టే. రాజ్యాంగ మౌలికతకే భంగకరమని అనుమానం వచ్చే నిర్ణయాల విషయంలో సుప్రీంకోర్టు నిలుపుదల నిర్ణయాన్ని తీసుకుంటుంది. అది కూడా చేయలేదు. అదేమంత అత్యవసరమైనది కాదు అన్న వ్యాఖ్యతో దాన్ని నిరీక్షణలో ఉంచారు. అలాగే, పౌరసత్వ చట్టం విషయంలో దాఖలయిన పిటిషన్లపై కూడా సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించలేదు. న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాటు, ఢిల్లీ షహీన్ బాగ్ కేంద్రంగా తీవ్రంగా సాగిన ఉద్యమాన్ని భగ్నం చేయడానికి ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. దానితో పాటు, ఆశ్చర్యకరంగా అనుమానాస్పదంగా చెలరేగిన మతఘర్షణలు, ఆ తరువాత కరోనా కల్లోలం అక్కడి ఉద్యమ శిబిరాన్ని విరమింపజేశాయి. ఉద్వేగాలు, విభజనలు ముడిపడి ఉన్న నిర్ణయాల విషయంలో న్యాయస్థానాల సంకోచాల కారణంగా, అనేక రాజ్యాంగ వ్యతిరేక శాసనాలు కొద్దికాలమైనా అమలులో ఉండే ప్రమాదం ఉన్నది. ఏ రకంగా చూసినా రాజ్యాంగ బద్ధత ఉండని మతాంతర ప్రేమ వివాహాల చట్టాలు రాష్ట్రం వెనుక రాష్ట్రం రూపొందిస్తున్నాయి. ఆరోహణ క్రమంలో రావాలి కాబట్టి, ఈ చట్టాలపై వ్యాజ్యాలు ఇంకా హైకోర్టులలోనే ఉన్నాయి. 


ప్రస్తుత రైతాంగ ఉద్యమ శిబిరం పైన కూడా ట్రాఫిక్ వ్యాజ్యాలు నమోదయ్యాయి. ఉద్యమకారులను తీవ్రవాదులని చెప్పే ప్రచారమూ జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతీ లేదు, ప్రభుత్వం తన వైఖరిని సడలించుకోవడం లేదు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడానికి అంగీకరిస్తే, బహుశా, ఉద్యమకారులు తామూ ఒక మెట్టు దిగుతారేమో? సంస్కరణల అమలు విషయంలో కఠిన వైఖరిని అనుసరించాలనే విధానం కేంద్రానిది. రైతాంగానికి ఇది జీవన్మరణ సమస్య. నైతికత అంతా రైతుల వైపే ఉన్నది. ఈ సమయంలో మరొక నైతిక, విశ్వసనీయ వ్యవస్థ ప్రవేశం ద్వారా పరిస్థితి చక్కబడి ఉండవలసింది. కానీ, భిన్నంగా జరిగింది. ఎందుకు తన మాటకు చెల్లుబాటు లేకుండా పోయిందో న్యాయవ్యవస్థ సమీక్షించుకుంటుందా? ఉద్వేగ రాజకీయ వెల్లువలపై స్వారీ చేస్తూ, పెను పర్యవసానాలుండే నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటూ వెడుతున్న ఒక తీవ్రజాతీయ ప్రభుత్వానికి అవసరమైన మేరకు కళ్లెం వేయగలిగిన ధైర్యాన్ని న్యాయవ్యవస్థ ప్రదర్శించలేదా? కౌరవసభలో కనీసం భీష్మద్రోణుల మాదిరిగా అసమ్మతిని బలహీనంగానైనా వినిపించకపోతే, ఏ వ్యవస్థపైనా ప్రజలకు కనీసపు ఆశ లేకపోతే, పరిష్కారాలను వ్యవస్థలకు వెలుపల వెదుక్కుంటారు కదా?

కె. శ్రీనివాస్