సంక్షేమం మాటున పొంచివున్న సంక్షోభం

ABN , First Publish Date - 2020-06-25T06:18:23+05:30 IST

‘మనచర్యలే మన ప్రాధాన్యతలను ప్రదర్శిస్తాయి’ అన్న జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తిదాయక పలుకులను గుర్తుచేస్తూ ఈనెల 16న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2020-21 రాష్ట్ర వార్షిక బడ్జెట్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు...

సంక్షేమం మాటున పొంచివున్న సంక్షోభం

ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ములను తిరిగి ఆ ప్రజలకే  అత్యంత అందంగా ఉచిత తాయిలాల రూపంలో ఎవరు భిక్ష వేయగలరో వారే ప్రజానేతలు, అదే ప్రజా ప్రభుత్వం అని పిలిపించుకునే దౌర్భాగ్య పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ప్రజలలోని ఆలోచనాశక్తిని, పనిచేసే తత్వాన్ని, ప్రశ్నించే లక్షణాన్ని చంపేయకూడదు. నిజానికి ప్రజలు కోరుకుంటున్నది కొంత కాలం భ్రమల్లో ముంచెత్తి, తరువాత చేదు నిజాలను చవిచూపించే జనాకర్షక పథకాలను కాదు. తమ సమస్యలను చిత్తశుద్ధితో, శాశ్వతంగా పరిష్కరించే వారు కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు.


‘మనచర్యలే మన ప్రాధాన్యతలను ప్రదర్శిస్తాయి’ అన్న జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తిదాయక పలుకులను గుర్తుచేస్తూ ఈనెల 16న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2020-21 రాష్ట్ర వార్షిక బడ్జెట్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘‘2019-–20, 2020–-21 సంవత్సరాల్లో కేంద్ర పన్నుల బదలాయింపులో తగ్గుదల, 2020-–21 సంవత్సరానికి సంబంధించిన డివిజిబుల్ పూల్‍లో తగ్గిన వాటాతో పాటు, కోవిడ్-19 వల్ల ప్రకటించిన లాక్‌డౌన్ చర్యల వల్ల తగ్గుముఖం పట్టిన ఆదాయ వనరులు మన ఆర్థిక వ్యవస్థను మరింత తీవ్రతరం చేశాయి’’ అని చెపుతూనే మంత్రిగారు రూ.2,24,789.18 లక్షల కోట్లతో బడ్జెట్టును ప్రకటించారు. గతేడాది కంటే ఇది కేవలం రూ.3,186 కోట్లు మాత్రమే తక్కువ. గత ఆర్థిక సంవత్సరం (2019– 20) బడ్జెట్టును రూ.2,27,975 లక్షల కోట్ల అంచనాలతో రూపొందించారు. కానీ సవరించిన అంచనాలతో ఆ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసినది రూ.1.74 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. వాస్తవ బడ్జెట్ అంచనాలకు సవరణలకు తేడా రూ.53,217.54 కోట్ల రూపాయలు. అటువంటప్పుడు ప్రస్తుత బడ్జెట్టులో సవరించిన అంచనాలు ఏమేరకు ఉంటాయో అన్నది ఆ జగన్మాతకే ఎరుక!


ఇక ప్రస్తుత బడ్జెట్ విషయానికి వస్తే... అభివృద్ధిని విస్మరించి కేవలం ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునే విధంగా సంక్షేమంపైనే దృష్టి పెట్టింది వైసిపీ ప్రభుత్వం. అందుకే మొత్తం బడ్జెట్టులో రూ.41,456 కోట్లు సంక్షేమ పథకాలకే కేటాయించారు. గతేడాది బడ్జెట్టులో సంక్షేమం వాటా 6.20 శాతం అయితే అది ఈ బడ్జెట్టులో 193.12 శాతం పెరిగి 18.44 శాతానికి చేరింది. మరి రాష్ట్రానికి ఆదాయ మార్గాలను పెంచకుండా సంక్షేమ కార్యక్రమాలను ఏవిధంగా కొనసాగిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. గతేడాది రూ.1,78,697 కోట్ల రెవిన్యూ ఆదాయం వస్తుందని లెక్కిస్తే ఆర్థిక మందగమనంతో రూ.1,10,871కోట్లు మాత్రమే వచ్చాయి. అలాంటిది ఈ కరోనా సంక్షోభంలో ఆదాయాన్ని రూ.1,61,958 కోట్లుగా లెక్కించారు. మరోవైపు ఈ లక్ష్యం నెరవేరేందుకు రూ. 62,830కోట్లు అప్పులు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. రెవిన్యూ ఆదాయం పడిపోతే అప్పులే ఆధారంగా సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంటుందని ఆర్థికశాఖా మాత్యులు వారికి తెలియంది కాదు. ప్రభుత్వం ఆశిస్తున్న రెవిన్యూ ఆదాయంలో కేంద్ర సాయంగా రూ.53,175 కోట్లు వస్తాయని లెక్కించారు. గత ఏడాది కేంద్రం సాయంగా అందింది రూ.21,875 కోట్లు మాత్రమే.


ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సంక్షోభ సమయంలో గతంకంటే దాదాపు రెట్టింపు పైగా కేంద్ర సాయం అందుతుందని వైకాపా ప్రభుత్వం ఏవిధంగా ఆశిస్తుందో అర్థంకాని విషయం. కీలకమైన వ్యవసాయం, విద్య, ఇరిగేషన్, గృహనిర్మాణాల లాంటి శాఖల బడ్జెట్టుకు కోతలు విధించి ఈ బడ్జెట్టు అభివృద్ధి దిశగా ప్రభుత్వం నిర్దేశించుకున్న నమూనా అని మంత్రిగారు చెప్పడం హాస్యాస్పదం. కరోనా సమయంలో కీలకమైన వైద్య రంగానికి రూ.11,419.98 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే ఇది కేవలం 20.75 కోట్లు మాత్రమే ఎక్కువ. దీనిలో సింహభాగం రూ.2100కోట్లు ఆరోగ్యశ్రీ పథకానికే కేటాయించడం గమనార్హం. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి గతేడాది బడ్జెట్టులో రూ.1150 కోట్లు కేటాయించిన వైకాపా ప్రభుత్వం రూ.264 కోట్లు విడుదల చేసి రూ.236 కోట్లు మాత్రమే బాధితులకు విడుదల చేయడం జరిగింది. ఈసారి బడ్జెట్టులో కేవలం రూ.200 కోట్లే కేటాయించి చేతులు దులుపుకుంది. విచిత్రమేమిటంటే మేము దశలవారీగా మద్యం నియంత్రిస్తున్నామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం 2020-– 21లో మద్యం అమ్మకాలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకోవడం. గతం కంటే వెయ్యికోట్లు అదనంగా వస్తాయని అంటే రూ.7,931 కోట్లు ఈ సంవత్సరం మద్యం ద్వారా వస్తుందని అంచనా వేస్తున్నారు. 


మొత్తానికి జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలే తమ ప్రభుత్వ లోపాలను కప్పిపుచ్చి మరోసారి అధికారంలోకి రావడానికి తోడ్పడతాయని బలంగా నమ్ముతున్నట్లుంది. పోనీ ఈ సంక్షేమ పథకాలను కొనసాగించాలన్నా, జనాకర్షక విధానాలు అమలు చేయాలన్నా ఆదాయం ఎక్కడనుంచి వస్తుంది? వచ్చిన ఆదాయాన్ని మొత్తం వీటికే కేటాయిస్తే మరే పనికీ డబ్బులేక ప్రభుత్వం కేవలం పన్నులు వసూలు చేయడానికి, లంచాలు మింగడానికి, ఉద్యోగులకు జీతభత్యాలివ్వడానికి, కంటితుడుపుగా కొన్ని సబ్సిడీలిచ్చి ఓట్లు దండుకోవడానికి మాత్రమే పరిమితమైపోతుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.3,48,998.11 కోట్లకు చేరింది. అంటే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి తలపై దాదాపు రూ.70 వేల రూపాయల అప్పు భారం ఇప్పటికే ఉంది. మరో నాలుగేళ్లు ఈ భారం ఎన్ని లక్షల కోట్లకు చేరుతుందో భగవంతునికే ఎరుక. అభివృద్ధి లేని సంక్షేమం నీటి బుడగలాంటిది. అది ప్రజలకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది. రాష్ట్రానికి ఆదాయ మార్గాలను పెంచకుండా ఎంతో కాలం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించలేరన్నది ప్రభుత్వం గ్రహించాలి. 


ఉచితంగా ఇస్తే ఎవరైనా, ఏదైనా తీసుకుంటారనే మానవసహజ గుణాన్ని, బలహీనతను ఆసరాగా తీసుకుని ఓట్లు దండుకునేందుకు ఈ ప్రభుత్వం కానుకల రాజకీయమే చేస్తోంది. అంతేతప్ప ఎలాంటి మార్పులు తీసుకొస్తే సమాజంలో నిజమైన పరివర్తన వచ్చి జనం లాభం పొందగలరు అన్న ఆలోచన చేయడంలేదు. ప్రజల అభివృద్ధికి బాటలు వేయడం అంటే వారి జీవితాలను వారు తీర్చిదిద్దుకోగలిగే మార్గాలను నిర్మించడం అన్న స్పృహ కూడా పాలకులకు కొరవడింది. అధికారంలోకి రావడమంటే జనం ఓట్లు ఒక్కటే మార్గం కనుక, ఆ ఓట్లను సర్కారీ సొమ్ముతో కొనుగోలు చేయడానికి పూనుకునే పెడపోకడలు శృతిమించుతున్నాయి. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ములను తిరిగి ఆ ప్రజలకే అత్యంత అందంగా ఉచిత తాయిలాల రూపంలో ఎవరు భిక్ష వేయగలరో వారే ప్రజానేతలు, అదే ప్రజా ప్రభుత్వం అని పిలిపించుకునే దౌర్భాగ్య పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ప్రజలు కట్టిన పన్నుల సొమ్ము వారి జీవనాన్ని స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దే విధంగా ఉండాలి. అంతేతప్ప ఉచితంగా ఏం వస్తుందా అని నిరీక్షించేవారిగా ప్రజలను మార్చకూడదు. ప్రజలలోని ఆలోచనాశక్తిని, పనిచేసే తత్వాన్ని, ప్రశ్నించే లక్షణాన్ని చంపేయకూడదు. నిజానికి ప్రజలు కోరుకుంటున్నది కొంత కాలం భ్రమల్లో ముంచెత్తి, తరువాత చేదు నిజాలను చవిచూపించే జనాకర్షక పథకాలను కాదు. తమ సమస్యలను చిత్తశుద్ధితో, శాశ్వతంగా పరిష్కరించే వారు కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. మౌలిక సదుపాయాలూ, విద్య, ఆరోగ్యం, మంచి పాలన - వీటిల్లోనే నిజమైన పౌరసత్వం ఉందనీ, ఇవే మన బిడ్డలకు సగర్వంగా మనమివ్వగల వారసత్వం అని పాలకులు గ్రహించాలి. తాను కూడా ఊహించని రీతిలో అత్యధిక మెజార్టీ సాధించి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం... 

కూసంపూడి శ్రీనివాస్

అధికార ప్రతినిధి, జనసేన పార్టీ

Updated Date - 2020-06-25T06:18:23+05:30 IST