బస్సు డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో స్టీరింగ్ చేపట్టిన ప్రయాణికురాలు

ABN , First Publish Date - 2022-01-15T22:22:01+05:30 IST

అత్యంత సంక్లిష్ట సమయంలో ఓ మహిళ చూపిన ధైర్య, సాహసాలు తన

బస్సు డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో స్టీరింగ్ చేపట్టిన ప్రయాణికురాలు

పుణే : అత్యంత సంక్లిష్ట సమయంలో ఓ మహిళ చూపిన ధైర్య, సాహసాలు తన తోటి ప్రయాణికులను, ఓ నిండు ప్రాణాన్ని కాపాడాయి. విహార యాత్రకు వెళ్ళినవారు తిరిగి వస్తూండగా, వారు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో ప్రయాణికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో యోగిత సతవ్ (42) డ్రైవింగ్ బాధ్యతలను చేపట్టి దాదాపు 10 కిలోమీటర్లు నడిపి, అస్వస్థతకు గురైన డ్రైవర్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. 


స్థానిక మీడియా శనివారం తెలిపిన వివరాల ప్రకారం, కొందరు మహిళలు, బాలలు కలిసి పుణేకు సమీపంలోని షిరూర్‌లో ఆగ్రో టూరిజంకు వెళ్ళారు. వీరు తిరిగి వస్తూండగా, వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు డ్రైవర్‌కు రెండుసార్లు ఫిట్స్ వచ్చింది. దీంతో ఆయన బస్సును నిలిపేశారు. ప్రయాణికులంతా ఆందోళనకు గురై, ఏడవడం ప్రారంభించారు. ఆ సమయంలో యోగిత సతవ్ (42) బస్సును నడిపే బాధ్యతను స్వీకరించారు. గణేగావ్ ఖల్సాలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మరొక డ్రైవర్ వచ్చి అస్వస్థుడైన డ్రైవర్‌ను షిక్రపూర్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించారు. అనంతరం ప్రయాణికులను వారి స్వస్థలం వఘోలీకి తీసుకెళ్లారు. యోగితను అందరూ ప్రశంసిస్తున్నారు. 


యోగిత మాట్లాడుతూ, తనకు కారు నడపటం వచ్చునని, అందుకే బస్సును నడిపే సాహసం చేశానని చెప్పారు. డ్రైవర్‌కు సరైన చికిత్స అందజేయాలన్నదే ముఖ్యమైన పని అని తాను భావించానన్నారు. 


Updated Date - 2022-01-15T22:22:01+05:30 IST