15 రోజుల క్రితం ఆ మహిళకు ప్రసవం.. అంతలోనే కడుపులో భరించలేని నొప్పి.. ఆస్పత్రికి వెళ్తే బయటపడ్డ వింత పరిణామం..!

ABN , First Publish Date - 2021-07-30T21:35:17+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల యువతికి గత బుధవారం భరించలేని కడుపునొప్పి వచ్చింది..

15 రోజుల క్రితం ఆ మహిళకు ప్రసవం.. అంతలోనే కడుపులో భరించలేని నొప్పి.. ఆస్పత్రికి వెళ్తే బయటపడ్డ వింత పరిణామం..!

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల యువతికి గత బుధవారం భరించలేని కడుపునొప్పి వచ్చింది.. అప్పటికి 15 రోజుల కిత్రమే ఆ మహిళకు ప్రసవం అయింది.. అయితే తక్కువ బరువుతో పుట్టడంతో ఆ బిడ్డ చనిపోయింది.. తాజాగా మళ్లీ కడుపు నొప్పి మొదలైంది.. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.. ఆమెకు స్కానింగ్ తీసిన డాక్టర్లు షాకయ్యారు.. ఆమె గర్భంలో `స్టోన్ బేబీ` ఉందని నిర్ధారణకు వచ్చారు.. వెంటనే శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. 


రాయ్‌పూర్‌లోని 26 ఏళ్ల మహిళకు ఈ నెల ఆరంభంలో ప్రసవం అయింది. డెలివరీ జరిగిన 15 రోజుల తర్వాత మరోసారి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆమెను జవహర్‌లాల్ నెహ్రూ మెమోరియల్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ఆమెకు స్కానింగ్ తీసిన వైద్యులు ఆమె గర్భంలో అరుదైన లిథోపీడియన్ ఉన్నట్టు కనుగొన్నారు. దీనిని `స్టోన్ బేబీ` అని కూడా పిలుస్తారు. దీంతో ఆమెకు శస్త్ర చికిత్స చేసి సుమారు ఏడు నెలల వయసు కలిగిన స్టోన్ బేబీని బయటకు తీశారు. శస్త్రచికిత్స తర్వాత మహిళ ఆరోగ్యంగానే ఉంది. గర్భాశయం లోపలే కాకుండా వెలుపల కూడా పిండం అభివృద్ధి చెందినపుడు ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి జైస్వాల్ తెలిపారు. 


`గర్భాశయం వెలుపల పెరిగిన పిండానికి రక్త సరఫరా ఉండదు. బయటకు పంపే మార్గం లేకపోవడంతో శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ ఆ పిండాన్ని రాయిగా మారుస్తుంది. పూర్తిగా కాల్షియం కణజాలంగా మారిపోవడం వల్ల కణాలన్ని గట్టిగా రాయిలా అయిపోతాయి. దాని వల్ల చుట్టు పక్కల కీలక అవయవాలు దెబ్బతింటాయి. ఈ మహిళ ఉదరంలో ఏడు నెలలుగా స్టోన్ బేబీ ఉంది. శస్త్రచికిత్స ద్వారా బయటకు తీసేశాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంద`ని చెప్పారు. కాగా, 15 రోజుల క్రితం నార్మల్ డెలివరీ ద్వారా జన్మించిన చిన్నారి చనిపోయింది. ఆ మహిళకు ఒకేసారి గర్భాశయం వెలుపల, లోపల పిండాలు ఏర్పాడి ఉంటాయని వైద్యులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-07-30T21:35:17+05:30 IST