మీనా..ఆటో రయ్‌ రయ్‌!

ABN , First Publish Date - 2021-03-08T07:32:12+05:30 IST

మా స్వస్థలం వరంగల్‌ జిల్లా! నా చిన్నతనంలోనే మా నాన్న వెంకటయ్య బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వచ్చారు.

మీనా..ఆటో రయ్‌ రయ్‌!

  • భర్తను ఒప్పించి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ.. 
  • లాక్‌డౌన్‌తో ఉపాధి దూరమైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు

హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్‌ మధ్య ఆటో నడపడం అంత ఈజీ కాదు.. కానీ, ఆమె అలవోకగా ఆటో నడిపేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. జవహర్‌నగర్‌లో ఆటో మీనాగా సుపరిచితురాలైన ఆమె.. ఉక్కు సంకల్పంతో ఆటో డ్రైవర్‌గా మారారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో ఆమెతో ముచ్చటించింది. 

ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ : మా స్వస్థలం వరంగల్‌ జిల్లా! నా చిన్నతనంలోనే మా నాన్న వెంకటయ్య బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వచ్చారు. జవహర్‌నగర్‌లోని బాలాజీనగర్‌లో ఉంటాం. ఇక్కడే కొన్నాళ్ల పాటు వివిధ పనులు చేసిన నాన్న.. చివరకు బీఎస్‌ఎన్‌ఎల్‌లో కిందిస్థాయి ఉద్యోగిగా పనికి కుదిరాడు. జీతం సరిపోక రాత్రివేళ ఆటో నడిపేవారు. ఆ సమయంలోనే నాతోపాటు ముగ్గురు తమ్ముళ్లు ఆటో నడపడం నేర్చుకున్నాం. పెళ్లయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. ప్రస్తుతం వారిలో ఒకరు డిగ్రీ చదువుతుండగా, మరొకరు పదో తరగతి చదువుతున్నారు. నా భర్త శ్యామ్‌రాజ్‌ మార్బుల్‌ పని చేస్తారు. నేను కూలి పనులకు వెళ్లే దాన్ని. మా ఇద్దరి సంపాదన కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. ఇక, నాకు తెలిసిన మరో పని ఆటో డ్రైవింగే. అందుకే ఆటో తీసుకుంటానని నా భర్తకు చెబితే అస్సలు ఒప్పుకోలేదు. చాలా బతిమిలాడి ఒప్పించా.. చివరకు ఎల్‌పీజీ ఆటోను తీసుకున్నాం. 


కొవిడ్‌తో ఆటో బంద్‌ : ఆటో డ్రైవర్‌గా ఖర్చులు పోను రోజుకు రూ.500 వచ్చేవి. ఆటోలో రెగ్యులర్‌గా స్కూల్‌ టీచర్లు వచ్చేవారు. వారిని ఇంటి నుంచి స్కూల్‌కు తీసుకెళ్లి.. తీసుకొచ్చేది. ఆటో డ్రైవర్‌గా నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. చాలా మంది ఆసక్తిగా చూసేవారు. ఆటోకు ఏమైనా సమస్య వస్తే వెంటనే సాయం చేసేవారు. మహిళలు, పిల్లలు భరోసాగా భావించి నా ఆటో ఎక్కేవారు. అయితే, కొవిడ్‌ లాక్‌డౌన్‌ పరిస్థితి తలకిందులైంది. గత్యంతరం లేక ఆటో అమ్మేశాను. ఈటీవో అనే ఎలక్ర్టిక్‌ కార్గో ఆటో కంపెనీలో డ్రైవర్‌గా చేరి.. సరుకులు రవాణా చేస్తున్నా.  


ఎలక్ర్టిక్‌ ఆటో కొంటా

ఎలక్ర్టిక్‌ కార్గో ఆటో ద్వారా వివిధ కంపెనీలకు సంబంధించిన సరుకులను నగరంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తున్నా. టైమ్‌ టు టైమ్‌ జాబ్‌. ఎలక్ర్టిక్‌ ప్యాసింజర్‌ ఆటోను కొనుగోలు చేయాలనుకుంటున్నా. తద్వారా మరోసారి జనాలకు చేరువవుతా. మహిళలు అనుకుంటే ఏదైనా చేయగలరు. నా ఇద్దరు కుమార్తెలకు అన్ని పనులు నేర్పించడంతోపాటు ఆటలు ఆడేలా తీర్చిదిద్దుతున్నా.

Updated Date - 2021-03-08T07:32:12+05:30 IST