అర్థరాత్రి దొరికిన 18 లక్షలున్న ఏటీఎం కార్డు.. ఆ యువకుడు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-01-07T22:47:52+05:30 IST

‘నాది కానిది ఎన్ని కోట్లైనా నాకు అక్కరలేదు.. అదే నాది అర్థరూపాయైనా నేను వదిలిపెట్టను’ ఈ డైలాగ్ ఓ తెలుగు సినిమాలో హీరో చెబుతాడు. అచ్చం ఆ హీరోలానే.. విశాఖలో ఓ కుర్రాడు కూడా తనవి కాని లక్షల రూపాయలను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. ఫ్రీగా వస్తే పైసా కూడా వదిలిపెట్టని..

అర్థరాత్రి దొరికిన 18 లక్షలున్న ఏటీఎం కార్డు.. ఆ యువకుడు ఏం చేశాడంటే..

విశాఖపట్టణం:విశాఖలోని కంచరపాలేనికి చెందిన ప్రీతం ప్రతి రోజులాగే తన పని ముగించుకుని ఇంటికెళుతున్నాడు. అయితే దారిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్దకొచ్చేసరికి అతడికో ఏటీఎం కార్డు దొరికింది. ఆ ఏటీఎంను చేతికి తీసుకున్న ప్రీతంకు దానిపై పిన్ నెంబరు కూడా కనపడింది. దీంతో ఆ ఏటీఎంను పక్కన పారేయడానికి అతడికి మనస్కరించలేదు. ముందుగా ఏటీఎం కార్డును బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులకు అప్పజెప్పాలని భావించాడు. కానీ అది సరైన పని కాదని భావించి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలనుకున్నాడు. అప్పటికే రాత్రి 10 గంటలు దాటిపోయింది. ఇక చేసేదేం లేక ఇంటికెళ్లేందకు సిద్ధమయ్యాడు. పిన్ నెంబర్ ఉండడంతో అందులో అసలు ఎంత క్యాష్ ఉందో చెక్ చేద్దామని దగ్గరలోని ఏటీఎంలో చెక్ చేశాడు. అంతే దిమ్మ తిరిగిపోయింది. 


ఆ కార్డు ఖాతాలో ఏకంగా రూ18 లక్షల బ్యాలెన్స్ ఉంది. అంత మొత్తంలో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ దానికి కాజేయాలని ప్రీతం భావించలేదు. ఆ కార్డు దారుడి బాధను గురించే ఆలోచించాడు. అయితే అప్పటికి ఇంటికెళ్లిపోయినా.. ఉదయాన్నే కంచరపాలెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. ఏటీఎంను అందజేశాడు. అక్కడి ఎస్సై అప్పలనాయుడు వెంటనే ఓ కానిస్టేబుల్‌తో పాటు ప్రీతంను పంపించి బ్యాంకులో ఆ ఏటీఎం ఎవరి పేరుపై ఉందో వాకబు చేయించారు. దర్యాప్తులో ఆ ఏటీఎం కార్డు కంచరపాలెం పరిధిలో సుభాష్ నగర్‌లో నివసిస్తున్న ఆనంద్ ఉదయ్ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు.


ఏటీఎం కార్డు దారుడి గురించి తెలుసుకున్న పోలీసులు బ్యాంకు నుంచి తీసుకున్న ఆనంద్ ఉదయ్ మొబైల్ నెంబరుకు కాల్ చేశారు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ నంబరు స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మళ్లీ కానిస్టేబుల్‌ను అతడి ఇంటికి పంపించారు. ఆ కానిస్టేబుల్ ఆనంద్‌ను వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. అతడిని వివరాలడిగి తెలుసుకున్నారు. తన భార్య ఇటీవలే మరణించిందని ఆమె పేరు పై 18 లక్షలు ఫిక్సెడ్ డిపాజిట్ చేసినట్లు ఆనంద ఉదయ్ పోలీసులకు తెలిపాడు. అనంతరం ప్రీతం సమక్షంలోనే ఎస్సై అప్పలనాయుడు ఆ కార్డును ఆనంద్ ఉదయ్‌కు అప్పగించారు. ప్రీతం నిజాయితీని పోలీసులు ఎంతగానో ప్రశంసించారు. అతడి నిజాయితీని మెచ్చుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రీతంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



Updated Date - 2021-01-07T22:47:52+05:30 IST