Abn logo
Sep 27 2021 @ 00:06AM

ఆర్టీసీ బస్సుకు బ్రేక్‌లు ఫెయిల్‌

కనకదాసు విగ్రహం కట్టను ఢీకొని ఆగిన బస్సు

సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు 

గుంతకల్లుటౌన,సెప్టెంబరు 26: పట్టణంలోని బీరప్ప సర్కిల్లో ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుకు బ్రేక్‌లు ఫెయిల్‌ కావడంతో కనకదాసు విగ్రహం కట్టను ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బ యటపడ్డారు. ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్‌ వీరేంద్రకు స్వల్ప గాయాలయ్యాయి. గుంతకల్లు డిపోకు చెందిన ఏపీ21జడ్‌0455 బస్సు ఆదోని నుంచి గుంతకల్లుకు 33 మంది ప్రయాణికులతో బయల్దేరింది. బీరప్ప సర్కిల్‌లోకి బస్సు రాగానే అక్కడ ప్రయాణికులు దిగేందుకు బస్సును ఆపడానికి డ్రైవర్‌ బ్రేక్‌ వేశాడు. కాని బ్రేక్‌ పడలేదు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించడానికి డ్రైవర్‌ వీరేంద్ర చాకచక్యంగా వ్యవహరించి బస్సును కనకదాసు విగ్రహాన్ని కొలువుదీర్చిన కట్టకు ఢీకొట్టాడు. దీంతో బస్సు ఆగిపోయింది. కనకదాసు విగ్రహం గోపురం, కట్ట ధ్వంసమయ్యాయి. కట్ట వద్ద ఉన్న చెరుకు రసం తీసే బండి కూడా ధ్వంసమయింది. బస్సు స్టీరింగ్‌ డ్రైవర్‌ కడుపులో బలంగా తగిలింది. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కురుబ సంఘం నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ అధికారులు కనకదాసు కట్టను కట్టించాలని నినాదాలు చేశారు. ఆర్టీసీ అధికారులు రాస్తారోకో వద్దకు చేరుకుని కనకదాసు విగ్రహం కట్టను పునర్నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో  రాస్తారోకో విరమించారు. బీరప్ప సర్కిల్‌లో నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో కనకదాసు విగ్రహం కట్టను బస్సు ఢీకొట్టక పోయి ఉంటే పెద్దఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు పేర్కొన్నారు.