ఆసుపత్రుల్లోనే శిశువులకు ఆధార్‌!

ABN , First Publish Date - 2021-10-14T04:32:42+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాలింతలు ప్రసవించిన వెంటనే శిశువులకు ఆధార్‌ నమోదు చేసేలా రంగం సన్నద్ధమవుతోంది. జనన ధ్రువీకరణ పత్రంలో ఆధార్‌ నెంబర్‌ను అనుసంధానం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.గీతాప్రసాదిని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆసుపత్రుల్లోనే శిశువులకు ఆధార్‌!

- వచ్చే నెల 1 నుంచి అమలు

- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

(టెక్కలి రూరల్‌)

ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాలింతలు ప్రసవించిన వెంటనే శిశువులకు ఆధార్‌ నమోదు చేసేలా రంగం సన్నద్ధమవుతోంది. జనన ధ్రువీకరణ పత్రంలో ఆధార్‌ నెంబర్‌ను అనుసంధానం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.గీతాప్రసాదిని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీహెచ్‌సీలు, ప్రాంతీయాసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రులలో శిశుఆధార్‌ నమోదుకు సీఈఎల్‌సీ కిట్లు (1 ట్యాబ్‌, 1 ఎఫ్‌ఫీ స్కానర్‌)ను అందజేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవంబరు 1 నుంచి ఈ ప్రక్రియ పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధార్‌ నమోదు ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్‌రోల్‌మెంట్‌ ఆపరేటర్లకు ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు సంబంధించి సిబ్బందికి, డేటా ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆస్పత్రిలో పుట్టిన శిశువుకు మూడు నాలుగు రోజుల్లో ఆధార్‌ నమోదు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌కు సంబంధించి గుర్తించిన ఆపరేటర్లు ఈఅండ్‌యు సర్టిఫికేషన్‌ కోసం ఎన్‌ఎస్‌ఈఐటీ పోర్టల్‌లో పరీక్షలకు హాజరుకానున్నారు.  ఈ నెలాఖరులోగా ఈఅండ్‌యు సర్టిఫికేషన్‌ పూర్తిచేసుకుని వచ్చే నెల నుంచి శిశుఆధార్‌ నమోదు ప్రక్రియను పటిష్టంగా అమలు చేయనున్నారు. ఈ విషయమై  జిల్లా ప్రాంతీయాసుపత్రుల సమన్వయకర్త బి.సూర్యారావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా ప్రభుత్వ ఆసుపత్రులలో శిశుఆధార్‌ నమోదు ప్రక్రియకు సంబంధించిన ఆదేశాలు వచ్చాయని తెలిపారు. దీనిపై సంబంధిత ఆసుపత్రి అధికారులకు సూచనలు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. 

Updated Date - 2021-10-14T04:32:42+05:30 IST