Aadhar: కోల్పోయిన కుటుంబాన్ని తిరిగిచ్చింది!

ABN , First Publish Date - 2021-07-10T23:32:21+05:30 IST

దాదాపు పదేళ్ల క్రితం రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన ఓ బాలుడు ఆధార్ వివరాల కారణంగా మళ్లీ ఇన్నాళ్లకు తన తల్లిదండ్రులను కలుసుకోగలిగాడు.

Aadhar: కోల్పోయిన కుటుంబాన్ని తిరిగిచ్చింది!

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు పదేళ్ల క్రితం రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన ఓ బాలుడు  ఆధార్ వివరాల కారణంగా మళ్లీ ఇన్నాళ్లకు తన తల్లిదండ్రులను కలుసుకోగలిగాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాల్లో జరిగిన ఈ ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.  స్థానిక పోలీసులు 2011లో మతిస్థిమితం లేని ఓ బాలుడిని రైల్వే స్టేషన్‌లో గుర్తించారు. అతడి తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల వెతికినా లాభం లేకపోయింది. అప్పటికి ఆ బాలుడు అమ్మా..అమ్మా అని పిలవడం మినహా తన పేరు కూడా చెప్పలేకపోయాడు. దీంతో.. వారు ఆ బాలుడిని సమర్త్ దామ్లే అనే వ్యక్తి నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో చేర్పించారు. 


తన పేరేమిటో కూడా చెప్పలేని స్థితిలో ఉన్న ఆ బాలుడికి అమన్ అని దామ్లే పేరు పెట్టాడు. కొంత కాలం తరువాత అనాథాశ్రమం మూసివేయాల్సి వచ్చింది. దీంతో దామ్లే అమన్‌కు తన ఇంట్లో ఆశ్రయమిచ్చాడు. అమన్‌ను తన కుటుంబసభ్యుడిగానే చూస్తూ చదువు కూడా చెప్పించాడు. 2018లో అమన్ పదవ తరగతి పూర్తి చేశాడు. కాగా.. దామ్లే ఇటీవల అమన్ పేర ఆధార్ కార్డు కోసం ప్రయత్నించగా.. అతడి బయోమెట్రిక్ వివరాలను ఆధార్ డేటాబేస్ స్వీకరించలేదు.  ఆ వివరాలన్నీ అంతకుమనుపే డేటాబేస్‌లో నమోదై ఉండటమే ఇందుకు కారణం. దీంతో దామ్లే ఆశ్చర్యపోయాడు. అనంతరం.. ఆధార్ కేంద్రం నిర్వాహకుడు మరాఠే సాయంతో అమన్‌కు సబంధించిన వివరాలన్నీ తెలుసుకోగలిగాడు. ఈ క్రమంలో అమన్ అసలు పేరు మహ్మద్ అమీర్ అని, అతడు జబల్‌పూర్‌కు చెందినవాడని తెలిసింది. అమన్ విషయంలో ఆధార్ కేంద్రం నిర్వాహకుడు మరాఠే కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. అమన్‌ను అతడి అసలు కుటుంబం చెంతకు చేర్చాలని మరాఠే అనుకున్నాడు. ఇదే విషయాన్ని దామ్లేకు చెప్పగా ఆయన కూడా ఇందుకు అంగీకరించారు. 


ఈ క్రమంలో మరాఠే తనకు తెలిసినవాళ్ల ద్వారా అమీర్ తల్లిదండ్రులు ఆచూకీ తెలుసుకున్నాడు. దామ్లే వారిని ఫోన్లో సంప్రదించి అమీర్ తన దగ్గర ఉన్న విషయాన్ని చెప్పారు. ఇక ఎప్పటికీ చూడలేమనుకున్న తమ సంతానం ఆచూకీ తెలియడంతో అమీర్ తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆ తరువాత అమీర్ తల్లిదండ్రులు నాగ్‌పూర్‌లో ఉన్న దామ్లేను కలుసుకున్నారు. చట్టప్రకారం లాంఛనాలన్నీ పూర్తి చేసిన దామ్లే, అమీర్‌ను అతడి కుటుంబసభ్యులకు అప్పగించారు. అమీర్‌ను వదులుకోవడం బాధ కలిగిస్తున్నప్పటికీ.. అతడిని తన అసలు తల్లిదండ్రుల వద్దకు చేర్చడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని దామ్లే ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

Updated Date - 2021-07-10T23:32:21+05:30 IST