ఆ మూడూ ఐడీ ప్రూఫ్‌లే

ABN , First Publish Date - 2020-10-22T07:41:05+05:30 IST

వ్యక్తిగత గుర్తింపు రుజువుగా ఇక మీదట ఆధార్‌ లెటర్‌, ఈ-ఆధార్‌, పీవీసీ కార్డు సమానంగా చెల్లుబాటు కానున్నాయి...

ఆ మూడూ ఐడీ ప్రూఫ్‌లే

  • లెటర్‌, ఈ-ఆధార్‌, పీవీసీ కార్డులు చెల్లుబాటు 
  • సౌకర్యంగా ఉండేవాటిని ఎంచుకోవచ్చు
  • ఆధార్‌ ప్రాధికార సంస్థ స్పష్టీకరణ


న్యూఢిల్లీ, అక్టోబరు 21: వ్యక్తిగత గుర్తింపు రుజువుగా ఇక మీదట ఆధార్‌ లెటర్‌, ఈ-ఆధార్‌, పీవీసీ కార్డు సమానంగా చెల్లుబాటు కానున్నాయి. ప్రజలు తమకు ఏది సౌకర్యంగా ఉంటే దానిని ఉపయోగించుకోవచ్చు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఈమేరకు బుధవారం ట్విటర్‌లో స్పష్టంచేసింది. అన్ని రకాల ఆధార్‌  రూపాలు సమానంగా ఆమోదించగదగినవేనని, ఒకదానికి మించి మరొకదానికి ప్రాధాన్యం ఇవ్వనక్కర్లేదని తెలిపింది. వ్యక్తిగత గుర్తింపు కోసం యూఐడీఏఐ 12 అంకెల సంఖ్యను జారీ చేస్తోంది. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందేందుకు ఇది చాలా అవసరం. ఆధార్‌ జనరేట్‌ అయిన తర్వాత పోస్టు ద్వారా వచ్చే లెటర్‌, ఈ-ఆధార్‌, పీవీసీ కార్డు సమానంగా చెల్లుబాటు అవుతాయని, ప్రజలు తమకు సౌకర్యవంతంగా ఉండే ఆధార్‌ పత్రాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. సరైన తనిఖీతో వీటిలో దేనినైనా ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఆమోదించవచ్చునని పేర్కొంది. వీటిలో ఒకదానికి మించి మరొకదానికి ప్రాధాన్యం ఇవ్వనక్కర్లేదని పేర్కొంది.


మూడు రూపాల్లో ఆధార్‌ 

ఆధార్‌ లెటర్‌: దీనిని పోస్టు ద్వారా డెలివరీ చేస్తారు. ఒక్కసారి ఆధార్‌ గనక జనరేట్‌ అయితే సంబంధిత వ్యక్తి ఫోన్‌ నంబరుకు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది.


ఈ-ఆధార్‌: యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దీనిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డిజిటల్‌ రూపంలో ఉన్న ఆధార్‌ కార్డును దేశంలో ఎక్కడైనా ఆమోదిస్తారు. ఇది పీడీఎఫ్‌ రూపంలో ఉంటుంది. దీనిని తెరవాలంటే.. పాస్‌వర్డ్‌ అవసరమవుతుంది.  పాస్‌వర్డ్‌లోని మొదటి నాలుగు అక్షరాలు వ్యక్తి పేరులోని కేపిటల్‌ అక్షరాలు ఉండాలి. ఆ తర్వాత పుట్టన సంవత్సరం రావాలి.


ఆధార్‌ పీవీసీ కార్డు: ఈకార్డుపై డిజిటల్‌ సిగ్నేచర్‌, క్యూఆర్‌ కోడ్‌, కార్డుదారుడి చిరునామా వివరాలు ఉంటాయి. దీనిలో అనేక సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. రూ. 50 చెల్లించి ఈ కార్డును పొందవచ్చు. మొబైల్‌ నంబరు రిజస్టర్‌ చేయించుకోనివారు కూడా వేరొక మొబైల్‌ నంబరుతో ఆర్డర్‌ చేయవచ్చు. డెబిట్‌ కార్డులాగే ఆధార్‌ పీవీసీ కార్డు కూడా వాలెట్‌లో పెట్టుకొనే వీలుంటుంది.  

Updated Date - 2020-10-22T07:41:05+05:30 IST