ఆధార్.. అడ్డదారి.. సంక్షేమ అర్హత కోసం పక్కదారులు

ABN , First Publish Date - 2020-09-21T15:00:28+05:30 IST

సంక్షేమ పథకాల అమలులో చాలా కాలంగా ఆధార్‌నే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. వ్యక్తిగత సమాచారమైన వయసు, పేరు, చిరునామా.. ఇలా ఏదైనా కావచ్చు. అన్నింటికి ఇప్పుడు ఆధారే ఆధారమైంది. వైఎస్‌ఆర్‌ చేయూత.. 45 నుంచి 60 ఏళ్ల మధ్యవున్న మహిళలకు ఏడాదికి రూ.18,750 అందించే పథకం.

ఆధార్.. అడ్డదారి.. సంక్షేమ అర్హత కోసం పక్కదారులు

అనేకచోట్ల వయసు తారుమారు 

ఇంకొన్నిచోట్ల అనర్హులకు చోటు

చేతులు మారుతున్న వేల రూపాయలు

అప్రమత్తమైన అధికార యంత్రాంగం

సమాచారం ఉంటే పనిపడతాం : కలెక్టర్‌  


(ఏలూరు-ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాల అమలులో చాలా కాలంగా ఆధార్‌నే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. వ్యక్తిగత సమాచారమైన వయసు, పేరు, చిరునామా.. ఇలా ఏదైనా కావచ్చు. అన్నింటికి ఇప్పుడు ఆధారే ఆధారమైంది. వైఎస్‌ఆర్‌ చేయూత.. 45 నుంచి 60 ఏళ్ల మధ్యవున్న మహిళలకు ఏడాదికి రూ.18,750 అందించే పథకం. నాలుగేళ్లలో 75,000 మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వచ్చి చేరుతుంది. ఈ పథకం అర్హత సంపాదించేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆధార్‌లో ప్రస్తుత సమాచారం తొలగించి కొత్త సమాచారం చేర్చేందుకు కొందరు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. రాత్రికి రాత్రే దేశంలో విశిష్ట సంఖ్య కల్గిన ఆధార్‌ కార్డుకు కొత్త రూపు ఇచ్చేస్తున్నారు. ఇందుకు నుంచి వేల రూపాయలు లాగేస్తు న్నారు. ‘చిన్నప్పుడు ఎప్పుడో పుట్టిన తేదీల్లో మార్పుచేశారు. సరిగ్గా పడలేదు. మాతోడ బుట్టిన వాడికి నాకు ఒకే వయసు వేశారు. ఆ తరువాత రేషన్‌ కార్డులోనూ పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఈ పథకం కోసం వెళితే.. వయసు లేదు. పొమ్మంటున్నారు’ అంటూ కొందరు దీర్ఘాలు తీస్తున్నారు. ఇలాంటి వారందరినీ ఎక్కడికక్కడ దళారులు తమ గుప్పెట పెట్టుకుంటున్నారు. 


కాస్త చేయి తడిపితే చాలు ఆధార్‌లో మార్పులు, చేర్పులకు మార్గదర్శకం వహిస్తున్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలు వెనుకంజ వేయడం లేదు. తమ పార్టీకి అనుకూలురే కాబట్టి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వారికందితే వచ్చే స్థానిక ఎన్నికల్లోనూ పార్టీవైపు పడి ఉంటారని కొందరి నేతల విశ్వాసం. ఆధార్‌ కార్డులో వయసు మార్పుకు అధికారిక నిర్ధారణ కావాల్సి ఉండగా వీటిని మాయ చేస్తున్నారని చెబుతున్నారు. ఇంతకుముందు మీ సేవ కేంద్రాల్లో ఒక అధికారిక ధ్రువపత్రం కావాలంటే ముందస్తుగా నమోదు చేసుకోవాలి. ఆ తరువాత అనుమతులు వస్తేనే ఇలాంటి మార్పులు, చేర్పులకు అవకాశం ఉండేది. ఇప్పుడా సీన్‌ లేదు. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాదికైనా వయసు, పేరు మార్పు చేస్తే ఎంచక్కా బ్యాంకు అకౌంట్లో నాలుగు రాళ్లు చేరతాయి అనే ధైర్యంతో ఇలాంటి మార్పు, చేర్పు ప్రక్రియలో ఆరితేరిన వారికి 1500 నుంచి రెండు వేల వరకూ కొందరు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు.  


పింఛన్‌ కోసం పక్కదారులు

వృద్ధాప్య పింఛన్‌.. నెలకు రూ.2,250. దీనిని పొందాలంటే అల్పాదాయ వర్గమే కాకుండా 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు. పింఛన్‌ పొందేందుకు తక్షణ అర్హతలు ఏమి లేక పోయినప్పటికీ  55 ఏళ్లు పైబడిన వారు తాము 60 ఏళ్లు దాటేసినట్లు మార్చేసుకుంటున్నారు. కొందరు దీనికి మూడు వేల వరకు ముట్ట చెబుతున్నారు. ఈ అడ్డగోలు వ్యవహారంలో స్థానిక నేతల ప్రమేయం ఉంటున్నది. మొన్నీ మధ్యే అర్హులైన వారంతా పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు అనగానే దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడడంతో అందరికీ సందేహాలు మొదలయ్యాయి. తీగలాగితే ఆధార్‌లో మార్పులు, చేర్పులే కారణంగా తెలుస్తోంది. ఎక్కడైనా ఇలాంటి అక్రమ పద్ధతులు పాటిస్తున్నారని నిర్ధిష్ట సమాచారం ఇస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ముత్యాలరాజు వివరించారు.

Updated Date - 2020-09-21T15:00:28+05:30 IST