Punjab లో ఏం జరుగుతోంది.. ఎగ్జిట్‌పోల్స్ ఏం చెప్పాయి.. తాజా ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2022-03-10T14:59:44+05:30 IST

మరికొన్ని గంటల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేలిపోనున్నాయి.

Punjab లో ఏం జరుగుతోంది.. ఎగ్జిట్‌పోల్స్ ఏం చెప్పాయి.. తాజా ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే..

మరికొన్ని గంటల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేలిపోనున్నాయి. జనరల్ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ, ఉత్తరాఖండ్ తర్వాత అందరి దృష్టిని ఆకర్షిస్తోంది పంజాబ్. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. ఆప్‌కు కలిసి వస్తుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే, పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోసారి ప్రస్తుత సీఎం దళితుడైన చరణ్‌జీత్‌సింగ్ చన్నీనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టింది. ఎందుకంటే రాష్ట్ర జనాభాలో మూడింట ఒకవంతుగా ఉన్న దళిత ఓటర్లను తమవైపు తిప్పుకొవాలనే వ్యూహంతో.


కానీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధు, చరణ్‌జీత్ చన్నీల మధ్య విభేదాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ పార్టీని వీడి కొత్త కుంపటి పెట్టుకోవడం కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఆప్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది. సాగుచట్టాలపై పోరాట సమయంలోనూ ఢిల్లీలో రైతులకు అండగా నిలిచింది. ఇలా పంజాబ్ ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అటు రాష్ట్ర ప్రజలు కూడా మార్పు కోరుకోవడంతో ఆప్ వైపు మొగ్గినట్లు తెలుస్తోంది. దీంతో పంజాబ్‌లో ఎన్నికల సమయంలో ఆప్ ప్రభావం గట్టిగానే కనిపించింది. 


ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి..

ఎగ్టిట్ పోల్స్ కూడా ఈసారి పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తేల్చేశాయి. అధికార కాంగ్రెస్‌కు భంగపాటు తప్పకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టం చేశాయి. టుడేస్ చాణక్య అయితే ఆప్‌కు ఏకంగా 100 సీట్లు కట్టబెట్టింది. అలాగే ఇండియాటుడే 76-90 సీట్లు, టైమ్స్‌నౌ-వీటో 70 సీట్లు, ఏబీపీ న్యూస్-సీఓటర్ 51-61 సీట్లు గెలుస్తుందని అంచనా వేశాయి. 


తాజా ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే..

ఇక ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు తర్వాత వస్తున్న ట్రేండ్స్ ప్రకారం ముందు అనుకున్నట్లే ఆప్ రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిజం చేస్తూ ఏకంగా 50కి పైగా స్థానాల్లో లీడ్‌లో ఉంది. గట్టిపోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్ కేవలం 17 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 3, ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, 117 అసెంబ్లీ స్థానాలు గల పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 59 సీట్లు కావాలి. ప్రస్తుత ట్రేండ్స్ ప్రకారం ఆప్‌కు ఇది నల్లేరుమీద నడకే అనడంలో ఎలాంటి సందేహం లేదు.       

Updated Date - 2022-03-10T14:59:44+05:30 IST