డాక్టర్ ఆత్మహత్య కేసులో ఆప్ ఎమ్మెల్యేకు బెయిలు తిరస్కరణ

ABN , First Publish Date - 2020-06-05T20:30:58+05:30 IST

దక్షిణ ఢిల్లీకి చెందిన డాక్టర్ రాజేందర్ సింగ్ ఆత్మహత్య కేసులో నిందితుడు,

డాక్టర్ ఆత్మహత్య కేసులో ఆప్ ఎమ్మెల్యేకు బెయిలు తిరస్కరణ

న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీకి చెందిన డాక్టర్ రాజేందర్ సింగ్ ఆత్మహత్య కేసులో నిందితుడు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్‌కు తాత్కాలిక బెయిలు మంజూరు చేసేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. 


డాక్టర్ రాజేందర్ ఏప్రిల్ 18న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్ నోట్ కనిపించిందని పోలీసులు తెలిపారు. తనను, తన కుటుంబాన్ని ప్రకాశ్ జర్వాల్, అతని సహచరుడు వేధిస్తున్నట్లు డాక్టర్ రాజేందర్ ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. తన ఆత్మహత్యకు కారణం ప్రకాశ్, అతని సహచరుడు అని ఆరోపించినట్లు తెలిపారు. ప్రకాశ్ జర్వాల్ బలవంతంగా లాక్కోవడమనే నేరానికి పాల్పడినట్లు డాక్టర్ సింగ్ ఆరోపించారని పేర్కొన్నారు. 


ప్రకాశ్ జర్వాల్ బెయిలు పిటిషన్‌పై స్పెషల్ జడ్జి సంజీవ్ అగర్వాల్ తీర్పు చెప్తూ, నిందితుని భార్య, 11 నెలల కుమారుడు కోవిడ్-19తో బాధపడుతున్నారేమోననే అనుమానం ఉండటం, నిందితుని మామయ్య కోవిడ్-19 కారణంగా మరణించారేమోననే అనుమానం వంటివాటిని పరిశీలించినట్లు తెలిపారు. అయితే నిందితుడు కూడా డాక్టర్ రాజేందర్ నివసించే ప్రాంతంలోనే నివసిస్తుండటం, అంతేకాకుండా ఎమ్మెల్యే కూడా కావడం వల్ల, ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలిపారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక బెయిలు మంజూరు చేసేందుకు తిరస్కరించారు.



Updated Date - 2020-06-05T20:30:58+05:30 IST