పంజాబ్ సీఎం అభ్యర్థి ఖరారు.. ప్రకటించనున్న కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-01-17T23:46:26+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ రేపు (మంగళవారం) ప్రకటించనున్నారు..

పంజాబ్ సీఎం అభ్యర్థి ఖరారు.. ప్రకటించనున్న కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ రేపు (మంగళవారం) ప్రకటించనున్నారు. పంజాబ్ పర్యటన సందర్భంగా ఢిల్లీ సీఎం ఈ ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ జాతీయ కన్వీనర్ అయిన కేజ్రీవాల్ మంగళవారం పంజాబ్‌లోని మొహాలిలో విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారని సమాచారం.


పంజాబ్‌లోని 117 స్థానాలకు గాను గత ఎన్నికల్లో ఆప్ 17 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా సంపాదించుకుంది. వచ్చే నెల 20న పంజాబ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని మీరే నిర్ణయించాలంటూ కేజ్రీవాల్ ఆ అవకాశాన్ని ప్రజలకే ఇచ్చారు. ఇందుకోసం ఓ నంబరు కూడా కేటాయించారు. కేజ్రీవాల్ ప్రకటనకు విశేష స్పందన లభించింది.


96 గంటల్లో ఏకంగా 19 లక్షల మంది తమ అభిప్రాయాలను తెలియజేశారని పంజాబ్ ప్రతిపక్ష నేత హర్పాల్ సింగ్ చీమా తెలిపారు. వీరిలో 6.5 లక్షల మంది వాట్సాప్ ద్వారా వెల్లడించగా, దాదాపు 2.25 లక్షల్ మంది వాయిస్ మెసేజ్ ద్వారా, 8 లక్షల మంది వాయిస్ కాల్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్టు చెప్పారు. 


సంగ్రూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్ ‘ఆప్’ చీఫ్ భగవంత్ మాన్‌ వైపు ఎక్కువమంది ప్రజలు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించినప్పటికీ తాను ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోబోనని కేజ్రీవాల్ పలు సందర్భాల్లో తెలియజేశారు.  

Updated Date - 2022-01-17T23:46:26+05:30 IST