ఇక ఆరోగ్యవరమే..!

ABN , First Publish Date - 2021-06-03T05:14:44+05:30 IST

జిల్లాలోని పడమటి ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వైద్య కళాశాల రానే వచ్చింది. ఆలస్యంగానైనా ఆత్యాధునిక సేవలతో మూడేళ్లలో ప్రారంభమయ్యే కళాశాల నిర్మాణానికి శంకుస్థాపనతో అడుగుముందుకు పడింది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఇక ఆరోగ్యవరమే..!
మదనపల్లె మెడికల్‌ కళాశాలకు ఎంపిక చేసిన స్థలం

మూడేళ్లలో పడమట వైద్యసేవలు


95 ఎకరాల్లో రూ.475 కోట్లతో మెడికల్‌ కళాశాల


మదనపల్లె, జూన్‌ 2: జిల్లాలోని పడమటి ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వైద్య కళాశాల రానే వచ్చింది. ఆలస్యంగానైనా ఆత్యాధునిక సేవలతో మూడేళ్లలో ప్రారంభమయ్యే కళాశాల నిర్మాణానికి శంకుస్థాపనతో అడుగుముందుకు పడింది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.  ఓ వైపు ఉద్యోగాలు, మరో వైపు యువతకు ఉపాధి అవకాశాలు రానుండటం కూడా ఇక్కడ చెప్పుకోదగిన విషయం. పడమటి ప్రాంతాలైన మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో కరువుతోపాటు పేదరికం కూడా ఎక్కువే. ఈ పరిస్థితిల్లో అనుకోని రీతిలో ప్రమాదాలు జరిగినా, క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా వారిని బతికించుకోవడానికి బాధితులు వ్యయ, ప్రయాసాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో సమీపంలోని బెంగళూరు, చెన్నై, వేలూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. మెరుగైన వైద్యం కోసం వెళ్లే క్రమంలో ఎందరో అభాగ్యులు మార్గమధ్యంలో మృత్యువాత పడిన సందర్భాలూ ఎక్కువే. ఇక్కడ కళాశాల అందుబాటులోకి వస్తే, ఆ కష్టాలు తీరిపోనున్నాయి.


ఆరోగ్యవరమే..!


ప్రశాంత, ఆహ్లాత వాతావరణానికి మారుపేరుగా నిలిచిన ఆరోగ్యవరం... మెడికల్‌ కళాశాల మంజూరుతో నిజంగానే ఆరోగ్యవరంగానే మారనుంది. దేశంలోనే పేరు ప్రఖ్యాతలు గాంచిన  ఆరోగ్యవరం టీబీ రోగులకు శతాబ్దం కాలంగా వైద్యసేవలందిస్తూ రికార్డులకెక్కింది. ఈ కమ్రంలో దశాబ్దం క్రితమే దీనికి అనుగుణంగా వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినా..చివరి నిమిషంలో అది రద్దయింది. ఇందుకోసం అప్పట్లో నిర్మించిన భవనాలు కొన్ని  నిరుపయోగంగా మారాయి. ఇక వైద్య కళాశాల అందని దాక్షే అనుకునే క్రమంలో ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గానికి ఒక కళాశాలను మంజూరు చేయడం అందులోనూ దాన్ని మదనపల్లె పేరుతో ఆరోగ్యవరం వద్ద నిర్మిస్తుండటం ప్రాఽధాన్యం సంతరించుకుంది. ఆరోగ్యవరం అధీనంలోని 95 ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారు రూ.475కోట్లతో నిర్మాణానికి నాలుగురోజుల క్రితం శంకుస్థాపన చేయడం ఇక్కడ ప్రజల్లో ఆశలు చిగురించినట్లైంది. దేశంలోనే పెద్దదైన డివిజన్‌ కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి ఇటీవల జిల్లా స్థాయికి పురుడు పోసుకున్నా..ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదనే చెప్పాలి. ఇక్కడి రోగులకు తగిన స్థాయిలో సౌకర్యాలు, వైద్య పరికాలు లేకపోవడంతో చిన్నచిన్న కేసులను  తిరుపతికి రెఫర్‌ చేస్తున్నారు. ఇక అత్యవసర కేసులైతే బెంగళూరు, చెన్నై, వేలూరు సీఎంసీలకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికిప్పుడు అలాంటి అత్యవసర సేవలు అందుబాటులోకి రాకపోయినా ప్రభుత్వం చెబుతున్నట్లు మూడేళ్లకైనా వస్తే మంచిదేననే అభిప్రాయం ఇక్కడ ప్రజల్లో కలుగుతోంది.


Updated Date - 2021-06-03T05:14:44+05:30 IST