సాక్షాత్తూ సీఎం చెప్పినా..

ABN , First Publish Date - 2021-05-11T05:09:16+05:30 IST

సాక్షాత్తూ సీఎం చెప్పినా..

సాక్షాత్తూ సీఎం చెప్పినా..
కొవిడ్‌ పడగ...కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ మహిళకు సోమవారం నగరంలోని ప్రహ్లాద కల్యాణమండపం వద్ద అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ అందిస్తున్న దృశ్యం

అక్కరకు రాని ఆరోగ్యశ్రీ

కొవిడ్‌ బాధితులకు అందని వైద్యం
ముఖం చాటేస్తున్న కార్పొరేట్‌/ప్రైవేటు ఆస్పత్రులు
పడకలు ఖాళీగా లేవంటూ వెనక్కి పంపించేస్తున్న యాజమాన్యాలు
నగదు చెల్లించేందుకు సిద్ధమైన వారికే వైద్యం
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
తప్పని పరిస్థితుల్లో అప్పులు చేసి  ఆస్పత్రులకు రూ.లక్షలకు లక్షలు కడుతున్న నిరుపేదలు\


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి):

ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారెవరైనా కొవిడ్‌ వైరస్‌ బారినపడితే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలో గల కార్పొరేట్‌/ప్రైవేటు ఆస్పత్రులు ఉచితంగా వైద్యం అందించాలి. కార్డు లేని వారి వద్ద నుంచి కూడా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. ఆరోగ్యశ్రీ కార్డుదారులకు వైద్యం నిరాకరించినా, కార్డు లేని వారి వద్ద ఎక్కువ ఫీజులు వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం.

...ఇదీ సీఎం వద్ద నుంచి జిల్లా అధికారుల వరకూ పదేపదే చేస్తున్న హెచ్చరిక



అయితే, సాక్షాత్తూ సీఎం చెప్పినా, మంత్రులు, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా ఆస్పత్రుల తీరు మారడం లేదు. నగర పరిధిలోని అనేక కార్పొరేట్‌/ప్రైవేటు ఆస్పత్రులు ముందుగా లక్ష రూపాయలు కడితేనే గానీ బెడ్‌ కేటాయించడం లేదు. ఆరోగ్యశ్రీనో మరో ప్రైవేటు హెల్త్‌ ఇన్సూరెన్సో...వుందని చెప్పినా అవేవీ చెల్లవని ముఖం మీదే చెప్పేస్తున్నారు. కార్డులతో పని కాదని, క్యాష్‌ కట్టాల్సిందేనంటున్నారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే...తమ ఆస్పత్రిలో అసలు పడకలు లేవని చెప్పేస్తున్నారు. దీంతో ఆర్థిక స్థోమత లేనివారు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అప్పోసొప్పో చేసి తమ కుటుంబసభ్యులు/బంధువులను కార్పొరేట్‌/ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పిస్తున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల ఫీజులు తట్టుకోలేక ప్రభుత్వ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు వెళితే...అక్కడ బెడ్లు కోసం గంటలు తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.


ఆరోగ్యశ్రీ.. బెడ్లు ఖాళీ లేవు..

కరోనా కేసులు కార్పొరేట్‌/ప్రైవేటు ఆస్పత్రులకు కాసులు కురిపిస్తున్నాయి. ఆస్పత్రిలో చేరాలంటే ముందు రూ.లక్ష డిపాజిట్‌ చేయించుకుంటున్నాయి. ఆ తరువాత రోజువారీ వైద్య ఖర్చులను రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. ఫీజు ఎంతైనా చేరేందుకు సిద్ధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో..ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డుతో వచ్చే వారికి బెడ్లు లేవని చెబుతూ, డబ్బు చెల్లిస్తామనే వారికి అప్పటికప్పుడు అడ్మిషన్‌ ఇస్తున్నాయి. అయితే ఆరోగ్యశ్రీ కార్డుదారుల వద్ద వైద్యానికి డబ్బు తీసుకుంటున్న ఆస్పత్రుల యాజమాన్యాలు...తరువాత ప్రభుత్వం నుంచి కూడా నగదు రాబట్టుకుంటున్నాయి.


ఆరోగ్యశ్రీ లెక్కల్లో కూడా..

ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో గల 27 కార్పొరేట్‌/ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ వైరస్‌ బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కానీ, ఆస్పత్రుల్లో రూపాయి చెల్లించకుండా ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన వారి సంఖ్య చాలా స్వల్పమనే చెప్పాలి. అతికొద్దిమందికి మాత్రమే కొన్నిచోట్ల వైద్య సేవలు అందుతున్నాయి.


నోటీసులు ఇస్తున్నాం.. చర్యలు తప్పవు: డాక్టర్‌ రాజేష్‌, ఆరోగ్య శ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ జాబితాలో వున్న ఆస్పత్రులు తప్పనిసరిగా కొవిడ్‌ వైద్య సేవలను ఉచితంగా అందించాలి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో లేని ఆస్పత్రులు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చాం. అయితే, ఆ ఆదేశాలను అనేక ఆస్పత్రులు పాటించడం లేదన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే ఐదు ఆస్పత్రులకు నోటీసులు జారీచేశాం. తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. వైరస్‌ బాధితుల నుంచి వసూలు చేసిన మొత్తానికి పది రెట్లు జరిమానా విధించాలనుకుంటున్నాం. రెండోసారి అలాగే జరిగితే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ నుంచి తొలగిస్తాం.


ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలోని ఆస్పత్రుల జాబితా..

ప్రథమ, అపోలో, కిమ్స్‌ ఐకాన్‌, కేర్‌, సురక్ష హెల్త్‌ పార్క్‌, స్మైల్‌ కేర్‌ మల్టీస్పెషాలిటీ, వెంకటరమణ హాస్పిటల్‌, విజేత, ఓమ్నీ ఆర్కే, ఎంబీ మల్టీస్పెషాలిటీ, మెడికవర్‌, సెయింట్‌ అన్నాస్‌, డాక్టర్‌ దేముడుబాబు కమల నర్శింగ్‌ హోమ్‌, ఉషా ప్రైమ్‌ హాస్పిటల్‌, స్టార్‌ పినాకిల్‌, క్వీన్స్‌ ఎన్‌ఆర్‌ఐ, ఎస్‌ఆర్‌ హాస్పిటల్‌, శ్రీ శివాని మల్టీ స్పెషాలిటీ, ఎల్‌జీ హాస్పిటల్‌, జీజే హాస్పిటల్‌, ఆర్కే హాస్పిటల్‌, శ్రద్ధ, ఏఎన్‌ బీచ్‌, సూర్య హాస్పిటల్‌, గీతం, గాయత్రీ విద్యా పరిషత్‌ ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందే వైరస్‌ బాధితులు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా డబ్బులు అడిగితే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల జిల్లా కో-ఆర్డినేటర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. 

Updated Date - 2021-05-11T05:09:16+05:30 IST