ఆసరాలోనూ.. షరా మామూళ్లే..!

ABN , First Publish Date - 2020-09-25T13:42:45+05:30 IST

ప్రభుత్వం 2019 సెప్టెంబరు 11 లోపు రుణాలు తీసుకున్న డ్వాక్రా సంఘాలకు..

ఆసరాలోనూ.. షరా మామూళ్లే..!

వైఎస్సార్‌ ఆసరాకు మామూళ్ల చెద

డబ్బివ్వనివారి ఖాతాలో జమ ఆలస్యం

రూ.5 వేల వరకు డిమాండ్‌

ఊరికే డబ్బిస్తుంటే మామూళ్లివ్వలేరా! అంటూ ఎదురుదాడి

రూ.543 కోట్ల మొత్తంలో రూ.22 కోట్లు పక్కదారి

కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు వాటాలంటూ వసూళ్లు

ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోని అధికారులు


ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు మొదటి విడత కింద జిల్లాకు రూ.135.85 కోట్లు విడుదల చేశారు. ఆ మొత్తం గ్రూపుల ఖాతాల్లో జమ కావాలంటే ఆర్పీలు, యానిమేటర్లు, డ్వాక్రా అధికారుల సంతకం చెయ్యాల్సి ఉంటుంది. డ్వాక్రా మహిళలకు విడుదలయిన నిధుల మొత్తాన్ని బట్టి వాటాలు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  


బ్యాంకు అప్పుకు ప్రభుత్వం ఊరికే డబ్బిస్తుంటే మా వాటాలివ్వలేరా! ఇవన్నీ మాకే అనుకుంటున్నారా! జిల్లా స్థాయి అధికారుల వరకు వాటాలివ్వాల్సిందే. మీకు సంతకం కావాలంటే మేమడిగిన మొత్తం ఇవ్వాల్సిందే. లేకుంటే మీ డబ్బు ఖాతాలో జమకాదు... ఇదీ ఆర్పీలు, యానిమేటర్ల దగ్గర నుంచి స్వయం సహాయక సంఘాలకు ఎదురవుతున్న వాటాల వేధింపులు...!


తెనాలి(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం 2019 సెప్టెంబరు 11 లోపు రుణాలు తీసుకున్న డ్వాక్రా సంఘాలకు నాలుగు విడతల కింద నిధులు మంజూరు చేసేందుకు నిర్ణయించింది. దీనికోసం జిల్లాకు రూ.543 కోట్లు కేటాయించింది. దీనిలో మొదటి విడత కింద రూ.135.85 కోట్లు విడుదల చేశారు. మొత్తం మీద జిల్లాలో 1,57,724 మంది డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరుతోంది.  వీరిలో కొందరు రుణం చెల్లించేసినవారుంటే, మరికొన్ని బాకీలున్న గ్రూపులున్నాయి. చెల్లించనివారికి మాఫీ వర్తిస్తుంటే, చెల్లించినవారు  ఆ మొత్తాన్ని ఉపాధి కోసం చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేందుకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల ఈ గ్రూపులకు పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు అట్టహాసంగా సభలు ఏర్పాటుచేసి మరీ డ్వాక్రా సంఘాలకు మంజూరయిన మొత్తాలకు సంబంధించిన చెక్కులను కూడా అందించారు. ఆ డబ్బు ప్రస్తుతం వారి ఖాతాల్లో జమవుతున్న తరుణంలో కొత్త వివాదం తెరపైకొచ్చింది.


రూ. 22 కోట్లు వాటాలకే చెల్లు

డ్వాక్రా మహిళలకు విడుదలయిన నిధుల స్థాయిని బట్టి వాటాలు నిర్ణయిస్తున్నారు. డబ్బిచ్చే విషయంలో నాలుగు విడతలకు చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. చాలామంది ప్రజాప్రతినిధులు, చివరకు ఎమ్మెల్యే దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లినా ఫలితం శూన్యమే. తెనాలి డివిజన్‌లోని తెనాలి, రేపల్లె, పొన్నూరు, బాపట్ల మున్సిపాలిటీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెబుతున్నారు. అటు పల్నాడులోనూ నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల వంటి పట్టణాల్లో బహిరంగంగానే వాటాలేసుకుంటున్న పరిస్థితి ఉందనేది విమర్శ.  తెనాలిలో ఒక గ్రూపునకు రూ.46 వేలు మంజూరయితే వారి నుంచి రూ.2వేలు నిలబెట్టి వసూలు చేశారని, మరో గ్రూపునకు రూ.88వేలు మంజూరయితే రూ.4వేలు, ఇంకో సంఘం నుంచి రూ.5వేలు కూడా వాటా మొత్తం కింద వసూలు చేశారని చెబుతున్నారు.


దీని ప్రకారం చూస్తే ప్రస్తుతం మొదటి విడత కింద రూ.135.85 కోట్లు అన్ని సంఘాలకు మంజూరయితే వాటిలో ఆర్పీలు, యానిమేటర్లు వసూలు చేసే వాటాలకే రూ.5.44కోట్లు పోతున్నాయంటే రూ.543 కోట్లకు నాలుగు విడతల్లో ఇదే రూపంలో వసూలుకు తెగబడితే రూ.21.72 కోట్లు వాటాల రూపంలో చేతులు మారినట్టే.  ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సి ఉంది.


చేతులు మారుతున్న డబ్బు

గతంలో ఉన్న గ్రూపుల్లో చనిపోయిన, సంఘాలు మారిన, వైదొలగిన వారిని తీసేసి మెప్మా అధికారులు కచ్చితమైన సభ్యులను తేల్చారు. ఈ వ్యవహారం నుంచే డబ్బు చేతులు మారుతూ వచ్చాయి. తొలగించిన సభ్యులను తిరిగి చేర్చటానికి, పది గ్రూపులు కొత్తగా ఏర్పడితే ఆ గ్రూపులకు ఆర్పీని నియమించాలంటే రూ.10వేలు సమర్పించుకోవలసిందే...! ఈ తతంగమంతా జరుగుతున్న తరుణంలోనూ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ప్రస్తుతం నిధులు విడుదలవుతున్న సందర్భాన్ని అవకాశంగా మలచుకుని వాటాలకు బరితెగిస్తున్నారు. 


నిలదీస్తే చీవాట్లు..

అదేమని ఎవరైనా సభ్యులు ప్రశ్నిస్తే నువ్వు చెల్లించే రూ.200 వాటాకు మమ్ముల్ని నిలదీస్తావా అంటూ మిగిలిన సభ్యులతో చివాట్లు పెట్టించటం, భవిష్యత్‌లో మీకు రుణాలు ఎలా మంజూరవుతాయో చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్న యానిమేటర్లు ఉన్నారని కొందరు సభ్యులు కంటతడి పెడుతున్నారు. ఒకవేళ ఏ గ్రూపయినా ఇవ్వటానికి నిరాకరిస్తే వారికి నగదు జమ చేసేందుకు అవసరమైన సంతకం చేయకుండా తిప్పుకుంటున్న పరిస్థితులు ఉంటున్నాయని, మిగిలిన సభ్యులు తిరగలేక రాజీపడిపోయి రూ.2వేల నుంచి రూ.5వేల వరకు మామూళ్లు కింద ఇచ్చేందుకు సిద్దపడుతున్న పరిస్థితి. ఈ దా‘రుణ’ వసూళ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తే పట్టించుకోకుండా, గట్టిగా ఎవరైనా నిలదీస్తే మాత్రం తమ దృష్టికి రాలేదని, అటువంటిదేమైనా ఉంటే చర్యలు తీసుకుంటామని తిప్పి పంపుతున్నారని మరికొందరు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మా దృష్టికి తీసుకురండి..

డ్వాక్రా సంఘాలకు అవసరమైన సహకారం మినహా ఆర్థికపరమైన లావాదేవీల్లో ఆర్పీలు, యానిమేటర్లు జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదు. బ్యాంకుల దగ్గరకు సంఘాల లీడర్లు మాత్రమే వెళ్లాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. బ్యాంకు మేనేజర్లను కూడా వారు కలవటానికి వీలులేదు. మా పేర్లు కూడా చెప్పి వాటాలు తీసుకున్నట్టు ఏ గ్రూపు మా దృష్టికి తీసుకొచ్చినా వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. ఎవరూ ఆర్పీలకు, యానిమేటర్లకు ఒక్క రూపాయికూడా లంచం కింద ఇవ్వవద్దు. ఎవరైనా సంతకం పెట్టకుండా బలవంతం చేసినా, ఇబ్బందిపెట్టినా నా దృష్టికి తీసుకురండి. వారిపై తక్షణ చర్యలుంటాయి. 

  - బాలయ్య, మెప్మా పీడీ, గుంటూరు


Updated Date - 2020-09-25T13:42:45+05:30 IST