Abn logo
Oct 27 2021 @ 22:57PM

ఒక్క రూపాయి వస్తే ఒట్టు...!

ఆసరా చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే రాంబాబు (ఫైల్‌)

డ్వాక్రా మహిళలకు అందని ఆసరా 

బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు 

7న అట్టహాసంగా ప్రారంభించిన సీఎం 

ఆరోజు నుంచి ఆర్భాటంగా సభలు

గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 27 : వైఎస్సార్‌ ఆసరా డబ్బుల కోసం డ్వాక్రా గ్రూపు మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 7న ఒంగోలులో సీఎం జగన్‌ ఆసరా పథకం నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఒక్క రూపాయి కూడా గ్రూపు మహిళల ఖాతాల్లోకి జమకాలేదు. దీంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల బ్యాంక్‌లకు వెళ్లి అధికారులను నిలదీస్తున్నారు. ఈనెల 22 వరకు డ్వాక్రా సభ్యుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయవద్దని తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని, 25 నుంచి అంచెలంచెలుగా వేస్తామని అధికారులు  చెప్తున్నారు.  వైసీపీ అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాలకు 2019 ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి ఉన్న రుణ బకాయిలను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో జగన్‌ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చి రుణ బకాయిలను యథావిధిగా చెల్లించాలని, తర్వాత ఏడాదికి 25శాతం చొప్పున నాలుగేళ్లపాటు అందజేస్తామని తెలిపారు. ఆ ప్రకారం 2019 ఏప్రిల్‌ 1 నాటికి గిద్దలూరు నియోజకవర్గంలో 5,288 గ్రూపులకు రుణబకాయిలు రూ.142.56 కోట్లు మాఫీ చేయాలి. గతేడాది మొదట విడత మాఫీ సొమ్మును ఇవ్వగా, రెండో విడత రూ.35.64కోట్లను ప్రభుత్వం ఈనెల 7న విడుదల చేసింది. ఇవి ఆయా బ్యాంక్‌ ఖాతాలకు చేరాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల, పట్టణంలో వార్డులలో అట్టహాసంగా సభలు ఏర్పాటుచేసి సంబరాలు చేసుకున్నారు. ఈనెల 18న ఎమ్మెల్యే అన్నా రాంబాబు మార్కెట్‌ యార్డు ఆవరణలో గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలాలకు సంబంధించి భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్యలకు నమూనా చెక్కులను అందజేశారు. ఈ నేపథ్యంలో మహిళలు పొదుపు ఖాతాలు ఉన్న బ్యాంక్‌లకు వెళ్లి ఆసరా డబ్బుల గురించి ఆరా తీయగా ఇంకా జమకాలేదని అధికారులు తెలిపారు. రోజులు గడుస్తున్నా తమ ఖాతాలకు డబ్బు జమకాకపోవడంతో మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బ్యాంక్‌ అధికారులను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఈ నెల 25 తరువాత మహిళల వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులు జమచేయాలని మౌఖిక ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంతవరకు ఎక్కడా అమలు కాలేదు. ఈ విషయం గురించి సంబంధిత అధికారులను వివరణ కోరగా డ్వాక్రా సంఘాలకు ఇప్పటికే డబ్బులు జమ అయ్యాయని, వీటిని వ్యక్తిగత ఖాతాలకు జమచేయడానికి సమయం పడుతుంది తప్ప నగదు బదిలీపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని పేర్కొంటున్నారు.